Share News

పునర్విభజన మంచిచెడులను నిగ్గుతేల్చాలి!

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:44 AM

సమస్యను దాటవేయడం, వాయిదా వేయడం ద్వారా అది పరిష్కారం కాబోదు. ఎదుర్కోవడం ద్వారానే దానికి సహేతుకమైన ముగింపు లభిస్తుంది అన్నది రాజకీయ నీతిజ్ఞులు చెప్పిన నానుడి...

పునర్విభజన మంచిచెడులను నిగ్గుతేల్చాలి!

‘‘సమస్యను దాటవేయడం, వాయిదా వేయడం ద్వారా అది పరిష్కారం కాబోదు. ఎదుర్కోవడం ద్వారానే దానికి సహేతుకమైన ముగింపు లభిస్తుంది’’ అన్నది రాజకీయ నీతిజ్ఞులు చెప్పిన నానుడి. కానీ, మన దేశంలో క్లిష్టమైన సమస్యలను వాయిదా వేస్తూ వాటిని సంక్షిష్టంగా మార్చడం స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏలిన పాలకులు చాలామంది అనుసరించిన పంథా! 2026లో చేపట్టవలసిన దేశ జన గణన, దాని ఆధారంగా చేయాల్సిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను ఓ ముప్పై ఏళ్లపాటు వాయిదా వేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ కొత్తగా ఓ ప్రతిపాదన చేస్తున్నారు. స్టాలిన్‌ ప్రతిపాదనలో మంచి చెడులను విశ్లేషించే క్రమంలో ‘పునర్విభజన సమస్య’లో ఇమిడివున్న పలు అంశాలను సునిశితంగా పరిశీలించడం ముఖ్యం. మన రాజ్యాంగకర్తలు నిర్ణీత వయోపరిమితి దాటిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారు. అంతేగాక ప్రతిఒక్కరి ఓటుకు ఒకే విలువ అనే ప్రాతిపదికన ప్రతి రాష్ట్రానికి జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండాలని రాజ్యాంగం ద్వారా నిర్దేశించారు. అయితే, దేశంలో జనాభా రేటులో ప్రాంతాల వారీగా తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకుంటాయని ఆనాడు ఊహించలేదు. అయితే, 1976లో జానాభా ఆధారంగా జరిగిన పునర్విభజన తర్వాత ఈ ప్రక్రియ ప్రతి పదేళ్ళకు చేపట్టవలసి ఉన్నప్పటికీ నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజనను 2000 సంవత్సరం వరకూ జరగకుండా స్తంభింపజేశారు.


2001లో 84వ రాజ్యాంగ సవరణ తెచ్చి 2026 తర్వాత మాత్రమే జనగణన ద్వారా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టే వెసులుబాటును కల్పించారు. చివరసారిగా 1976లో జరిగిన పునర్విభజన తర్వాత దేశంలో సామాజికంగా, ఆర్థికంగా అనేక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. జాతీయ విధానంగా తీసుకొన్న జనాభా నియంత్రణకు అనేక రాష్ట్రాలు, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు విశేషంగా కృషి చేశాయి. దాంతోపాటు విద్య, ఆరోగ్యం, ఉపాధి మొదలైన కీలక రంగాలలో ముందంజ వేసి సామాజిక, ఆర్ధికాభివృద్ధి సాధించాయి. అదే సమయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ లాంటివి అభివృద్ధిలో వెనక్కుపోయి ‘బీమారు’ (రోగగ్రస్తమైన) రాష్ట్రాలుగా గణతికెక్కాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలో 282 అధికరణ ప్రకారం ప్రాంతీయ అసమానతల్ని తొలగించడానికి కేంద్రం తన విచక్షణాధికారాలను ఉపయోగించి ‘బీమారు’ రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వడం; ఆర్థికాభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అరకొర నిధులు విదిలించడం రివాజుగా మారింది. ఈ చర్య పైకి రాజ్యాంగబద్ధంగా కన్పిస్తున్నప్పటికీ.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను శిక్షించడంగానే భావించాలి. ఈ అన్యాయాన్ని గత రెండున్నర దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు వివిధ వేదికల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నాయి.


దేశ జనాభాలో 18శాతంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు దేశ స్థూల ఉత్పత్తికి దాదాపు 36శాతం మేర నిధులను సమకూరుస్తుంటే, కేంద్రం తిరిగి వాటికి అరకొరగా నిధులు అందించడం దక్షిణాది ప్రాంత ప్రజలను బాధిస్తోంది. ఇక, జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ సూత్రం యథాతథంగా అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సహజంగానే లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అలాగే, ఉత్తరాదిన ఉన్న కొన్ని రాష్ట్రాలకు, మధ్య భారతంలోని మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఈ అంశాన్నే ఇపుడు స్టాలిన్‌, రేవంత్‌రెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. సామాజికాభివృద్ధి సాధించడంలో వెనుకబడిన రాష్ట్రాలకు అధిక మొత్తంలో నిధులు అందించడంతో పాటు లోక్‌సభలో హెచ్చు ప్రాతినిధ్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న నేడు జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. దీనిపైననే ఇపుడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలనుకొంటున్నారు. ఎం.కె. స్టాలిన్‌, ఎ. రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్యలు ఎన్డీయేతర పార్టీల ముఖ్యమంత్రులు కనుక ఈ సమస్యపై బహిరంగంగా మాట్లాడగలుగుతున్నారు. సమస్య సహేతుకంగా పరిష్కారం కావడానికి కలిసికట్టుగా రావాలంటూ దక్షిణాదిలోనే అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నారు. నిజానికి ఇదే సమస్యను దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం అందరికంటే ముందుగా లేవనెత్తి జాతీయ స్థాయిలో చర్చకు ఆస్కారం కల్పించింది నేటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ పిల్లల్ని ఎక్కువగా కనాలంటూ తన రాష్ట్రంలోని నవ దంపతులకు సూచన చేస్తున్నారు. కొత్తగా పెళ్లయిన వారు ఎక్కువ మంది పిల్లల్ని కంటూపోతే.. 30 ఏళ్ల తర్వాత తమిళనాడు జనాభా పెరిగి, అపుడు జరిగే పునర్విభజనలో తమ రాష్ట్రానికి లోక్‌సభలో అధిక ప్రాతినిధ్యం లభిస్తుందన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. తమిళనాడుకు న్యాయం జరగాలన్న ఆరాటంలో ఆయన కొన్ని వాస్తవాలను విస్మరిస్తున్నారు. రాబోయే 30 ఏళ్లల్లో మిగతా రాష్ట్రాలతోపాటు ఉత్తర, మధ్య భారతదేశ రాష్ట్రాల్లో అదే దామాషాలో లేదా అంతకుమించి జనాభా పెరగదన్న గ్యారంటీ ఏమి లేదు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించకపోతే, మిగతా రాష్ట్రాలు మాత్రం నియంత్రణ పాటిస్తాయా? అలాంటి ఆలోచన చేయడంలో ఔచిత్యం కనపడదు. పైగా, అధిక సంతానం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోవడం అనుభంలో ఉన్న చేదువాస్తవం. పెరిగే జనాభాకు అనుగుణంగా తగిన విద్య, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను సృష్టించడం అశాస్త్రీయం, అవివేకం. స్టాలిన్‌ సూచనను ఆ రాష్ట్ర ప్రజానీకం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకొంటారని భావించలేం గానీ, బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు ఏ అంశంలోనైనా మంచీచెడులను బేరీజు వేసుకొని స్పందిస్తేనే మంచిది.


1976 నుంచి 543 స్థానాలు గలిగిన లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు లభిస్తున్న ప్రాతినిధ్యం ఉత్తరాదితో పోలిస్తే తక్కువే ఐనప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధించిన వాస్తవాన్ని కూడా విస్మరించలేం. అదేవిధంగా కేంద్రం ద్వారా అత్యధికంగా నిధులు పొందుతున్న బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం యువత దక్షిణాది రాష్ట్రాలకు వలసలు వస్తున్నారు. లోక్‌సభలో అధిక ప్రాధాన్యత ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. ఇక, దేశంలో నగరీకరణ, పట్టణీకరణ పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య తగ్గి నగరాలు, పట్టణాల్లో జనసాంధ్రత పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం వంటి కార్పొరేషన్ల పరిధిలోని నియోజకవర్గాలలో జనాభా సంఖ్య అధికంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉంది. అందువల్ల పునర్విభజన శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో కూడా చేపట్టాల్సిన అవసరం కనబడుతున్నది. పునర్విభజన అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక, ఆర్థిక కోణంలో నుంచే చూడాలి. ఈ అంశాన్ని పరిష్కరించడానికి శాస్త్రీయపరమైన మార్గాన్ని అన్వేషించాలి. లోక్‌సభలో విస్తృతమైన సంప్రదింపులు జరపాలి. చట్టసభలలో ప్రాతినిధ్యంలేని రాజకీయ పార్టీల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించడానికి అఖిలపక్షాన్ని పిలవాలి. ఎంతో సున్నితమైన ఈ సమస్యకు శాస్త్రీయపరమైన ముగింపు లభించాల్సిన అవసరం ఉంది.

సి. రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు

Updated Date - Mar 20 , 2025 | 01:45 AM