నల్లబంగారానికి రాజకీయ రంగు!
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:39 AM
తెలంగాణలో కొంగు బంగారం సింగరేణి. కానీ నేడు నల్లబంగారాన్ని ఉత్పత్తి చేసే ఈ సింగరేణి సంస్థ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. నాడు లక్షా 16 వేల మంది కార్మికులతో...

తెలంగాణలో కొంగు బంగారం సింగరేణి. కానీ నేడు నల్లబంగారాన్ని ఉత్పత్తి చేసే ఈ సింగరేణి సంస్థ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. నాడు లక్షా 16 వేల మంది కార్మికులతో కళకళలాడిన ఈ ప్రాంతం నేడు కార్మికుల సంఖ్య తగ్గించడంతో ప్రాభవం కోల్పోయింది. భవిష్యత్తు తరాలకోసం ఆలోచించకుండా నాటి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి వచ్చింది. 90వ దశకంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు అమలు చేయడం వలన సింగరేణి కంపెనీ సిక్ ఇండస్ట్రీ జాబితాలోకి వెళ్లింది. సింగరేణిని ఆదుకోవాలని నాటి బీజేపీ ప్రధాని అటల్ బిహార్ వాజపేయి రూ.650కోట్ల మారటోరియం ప్రకటించారు. దీనికి తోడు కార్మికులు ఉద్యోగులు, అధికారులు, యూనియన్ నాయకులు సింగరేణికి జవసత్వాలు అందించి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకురావడమే కాకుండా రెండు దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిన తరువాత కోల్‌బెల్ట్ ప్రాంతం ఒక రాజకీయ అవకాశంగా మారింది. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లను వ్యతిరేకించి, అవసరమయితే కుర్చీ వేసుకుని ఓపెన్ కాస్ట్‌లను తగ్గిస్తానని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 17 ఓపెన్ కాస్ట్ గనులను తీసుకు వచ్చింది.
ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన రాజకీయ పార్టీల హామీలన్నీ పక్కనే ఉన్న గోదారి పాలయ్యాయి. ఇప్పుడు సంస్థలో 30 వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులున్నారు. ఆనాడు ఒక లక్షా 16వేల మంది ఉన్న పర్మినెంట్ కార్మికుల సంఖ్య నేడు 39వేలకు పడిపోయింది. ఈ మార్చి 31 నాటికి మరో రెండు వేల మంది పదవీ విరమణ కానున్నారు. ఈ పరిస్థితికి కారణం నువ్వంటే నువ్వంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ తమ వల్ల సింగరేణికి జరిగిన నష్టంపై నోరెత్తడం లేదు. ఒకవైపు దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ పెరిగిపోతున్న దశలో ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి పెరగాలంటే కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల సమయంలో 10 అండర్‌గ్రౌండ్ బొగ్గు గనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్‌లో జరిగిన సభలో వేదిక పక్కనే శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఆ శిలాఫలకాలు భద్రంగా ఉన్నాయి. కానీ ఒక్క అండర్‌గ్రౌండ్ బొగ్గు గని కూడా ప్రారంభం కాలేదు. అవి గనక ప్రారంభమై ఉంటే సుమారు 30వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఇలా ఉండగా అప్పటి యూపీఏ–-1, యూపీఏ–2 హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం వల్ల ప్రత్యక్షంగా లక్షా రూ.80వేల కోట్లు, పరోక్షంగా రూ.10లక్షల కోట్ల మేర నష్టం జరిగనట్లు కాగ్ రిపోర్ట్ తెలిపింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అవకతవకలు జరిగిన బొగ్గు బ్లాకులను రద్దుచేసి పారదర్శక వేలానికి ఆదేశించింది.
ఈ మేరకు అన్ని పక్షాలను సంప్రదించి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. 2020జూన్‌లో మోదీ తొలిసారి పారదర్శక బొగ్గుగనుల కమర్షియల్ వేలాన్ని ప్రారంభించారు. నాటి నుండి 11 విడతలుగా బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వేలాన్ని నిర్వహిస్తున్నది. కానీ సింగరేణి కంపెనీ ఆ బొగ్గు బ్లాకుల వేలంలో రాజకీయ ఒత్తిడుల వల్ల పాల్గొనడం లేదు. బీఆర్ఎస్ హయాంలో నూతన చట్టానికి అనుగుణంగా ఒరిస్సా రాష్ట్రంలోని నైనీ బ్లాక్‌ను తీసుకున్నారు. అదేవిధంగా తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్‌ను సింగరేణి, జెన్ కో నుండి తప్పించి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించి తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండా మా బ్లాకులు మా రాష్ట్రానికే ఇవ్వాలని వితండ రాజకీయాలు చేసింది. కొత్త చట్టానికి పార్లమెంట్‌లో అప్పటి బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికి చట్టానికి అనుకూలంగా ఓటువేసి అదే చట్ట ప్రకారం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనలేదు. ఫలితంగా ఐదేళ్ల కాలం గడిచిపోయింది. ప్రస్తుతం సింగరేణి చేతిలో బొగ్గు గనులు తగ్గడంతో కార్మికులు కూడా తగ్గుతున్నారు. ఈ దశలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. తెలంగాణలో బొగ్గు గనుల వేలానికి నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకోమని పలుమార్లు కేంద్ర బొగ్గుగనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు కోల్‌బెల్ట్ ప్రాంత బీజేపీ నేతలతో కలిసి హోంశాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కూడా బొగ్గు గనుల శాఖా మంత్రిని కలిసిన సందర్భంలో వేలంలో పాల్గొంటే సింగిల్ టెండర్‌గా తెలంగాణకే కేటాయిస్తామని చెప్పినా కూడా టెండర్ ఫారాన్ని తీసుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం బిడ్డింగ్‌లో పాల్గొనలేదు. దీంతో కోల్‌బెల్ట్ ప్రాంత కార్మికులకు, సింగరేణి సంస్థకు అన్యాయం జరిగింది.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని, భవిష్యత్తులో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక సంపదతో దేశంలో ముందుంటామని చెబుతూనే, ఢిల్లీలో ఇటీవల పత్రికా కాంక్లేవ్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఉచితాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదనీ, కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోతున్నామనీ, ఆరు గ్యారంటీల అమలు చేయలేమనీ చెప్పకనే చెప్పారు. ఈ స్థితిలో ఆర్థిక వనరులు పెంచుకోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలి. తెలంగాణకు ప్రధాన ఆదాయవనరు అయిన సింగరేణి ప్రభుత్వానికి ఆర్థిక పరిపుష్టిని అందించడంలో అగ్రభాగాన ఉంటుంది. అలాంటి సింగరేణిని కాపాడుతూ కార్మికుల సంఖ్యను పెంచడం ద్వారా కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని కాపాడవచ్చు. సింగరేణి సంస్థ ద్వారా ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలి. భవిష్యత్తులో కొత్త బ్లాక్‌లలో ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ద్వారా ఆయా బొగ్గుగనులలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించడంతోపాటు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. ఇంధన రంగంలో 2047కల్లా స్వతంత్రంగా అభివృద్ది సాధించాలన్న ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షల మేరకు ‘బొగ్గు రంగంలో ఆత్మనిర్భర్’లో బాగంగానే బొగ్గు బ్లాకులు వేలం జరుగుతున్నది.
ఎస్. కుమార్ జాతీయ కార్యదర్శి,
బీజేపీ ఎస్సీ మోర్చా