Share News

మనం మరిచిపోయిన వాఙ్మయ శిఖరం

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:42 AM

కాన్పూర్‌లో జరిగిన ఒక విద్వద్గోష్ఠికి మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్, లాహోర్ ఓరియంటల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ స్వరూప్ మున్నగు విద్వద్వరేణ్యులు విచ్చేసారు....

మనం మరిచిపోయిన వాఙ్మయ శిఖరం

కాన్పూర్‌లో జరిగిన ఒక విద్వద్గోష్ఠికి మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్, లాహోర్ ఓరియంటల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ స్వరూప్ మున్నగు విద్వద్వరేణ్యులు విచ్చేసారు. నేను ఇద్దరికీ పరిచితుడినే. ప్రసంగవశాత్తు ‘రామకృష్ణ కవిగారిని ఎరుగుదురా?’ అని రాహుల్‌ జీ ప్రశ్నించారు. ‘ఎందుకు?’ అన్నాను. ‘ఏమీ లేదు, ఆయన ఎంత ధన్యజీవి! ఆయన జీవిత సార్థక్యానికి ఒక్క కుందమాల నాటకం చాలు. ఎంత మంచి నాటకం వెలుగుకు తెచ్చారు? అన్నారు రాహుల్ జీ. ‘మరి నాట్య శాస్త్రం సంగతో?’ అన్నారు లక్ష్మణ్ స్వరూప్ జీ, ‘ఆయన జీవితాన్ని ధన్యం చేయడానికి!’ అన్నారు మరొకరు. నాకు మాట పెగల్లేదు. గుండె గొంతుకలో కొట్టుకులాడింది. నేను అప్పుడు అనుభవించింది మానుషానందం కాదు. ఉపనిషత్తులు ఉద్ఘోషించిన అతి మానుషానందభూతి అది! అతి కష్టంతో గద్గద కంఠంతో అన్నాను : ‘కవిగారు నాకు చాలా పరిచితులు.


ఆయన దగ్గర పనిచేసే భాగ్యం నాకు కలిగింది’ అని. అక్కడి వారందరి చూపుల్లో కవిగారిని దర్శించినంత సంతోషం తెలిపే రాగరేఖ ఒక్కసారిగా మెరిసింది... తిరుమల రామచంద్ర తమ స్వీయ చరిత్ర ‘హంపీ నుంచి హరప్పా దాకా’లో రామకృష్ణ కవిగారిని గురించి రాసిన భాగంలో ప్రారంభ వాక్యాలివి. ‘అందరికంటే నెక్కువుగా నాకు చిరకాల మిత్రులు, ఆంధ్ర భాషా వాఙ్మయం నందు విశేష కృషి చేసిన వారును, దేశాటనము చేసి అపూర్వ పుస్తక సంపాదనము చేసిన వారును శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారు...’ అని కందుకూరి వీరేశలింగం తమ ఆంధ్ర కవుల చరిత్రములో ప్రస్తావించారు. ‘సాహిత్య ప్రపంచంలో మా బోంట్లు తిన్నగా కన్నులు తెరవక పూర్వమే రామకృష్ణ కవి గారు ప్రాచీన ప్రబంధములను ప్రకటించిరి’ అని వేటూరి ప్రభాకర శాస్ర్తి కీర్తించిన మహావ్యక్తి రామకృష్ణ కవి. బాలాంత్రపు రజనీకాంతరావు సైతం తన ‘ఆత్మకథా విభావరి’లో మానవల్లి వారి గురించి రెండు అధ్యాయాలు కేటాయించారు. ముందుతరాలపై మహానుభావుల ప్రభావం అలాగే ఉంటుందేమో. అందుకే, యాభై ఏళ్ళ క్రితం సాహిత్య అకాడమీ 555 పుటల్లో ప్రచురించిన మానవల్లి రామకృష్ణకవి రచనల సంపుటికి రాసిన ముందుమాటలో, ‘ఆంధ్ర భాషలో సాహిత్య విమర్శకు భిక్షపెట్టినవారు వీరేనని చెప్పిన అతిశయోక్తి కాజాలదు..’ అన్న దేవులపల్లి రామానుజరావు, వాఙ్మయ పరిశోధనకై చేసిన తపస్సు కవిగారి జీవితము అంటారు. పై ఉటంకింపులను బట్టి రామకృష్ణ కవి గారి అసాధారణ ప్రతిభ ఎంతటిదో అర్థమౌతుంది. చెన్నపురి (నేటి చెన్నై)లోని నుంగంబాకంలో పండిత వంశంలో జన్మించిన మానవల్లి రామకృష్ణకవి కళాశాల విద్య అక్కడే చదివారు. ఆరుకి పై బడిన భాషల్లో అనర్గళమైన పాండిత్యం కలిగిన మానవల్లివారు 16 ఏళ్ళ వయసులో మృగవతి అనే కవిత రాయడం వల్ల ఆయన్ని అందరూ గౌరవంగా ‘కవి గారు’ అని పిలిచేవారట.


భరత నాట్యంలో పిహెచ్.డి చేసిన తమిళనాడు విద్వాంసురాలు శ్రీమతి శశికళ 2023 లో జాతీయ హిందీ, సంస్కృత పరిశోధన పత్రికకు రాసిన వ్యాసంలో కవిగారు మార్చి 20, 1875న జన్మించారని రాశారు. వనపర్తి సంస్థానంలో కొన్నాళ్ళు పనిచేసిన రామకృష్ణ కవి తదనంతరం మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలో ప్రాచీన తాళపత్ర గ్రంథాల అన్వేషణలో అగ్రభాగాన నిలిచారు. ‘విస్మృత కవులు’ రచన చేసిన రామకృష్ణ కవి శిథిల స్థితిలోనున్న ఎన్నో విలువైన గ్రంథాల్ని సేకరించి భద్రపరిచారు. వేంకటేశ్వరా ప్రాచ్య పరిశోధనా సంస్థలో, విద్యా శాఖాధికారిగా రాజమండ్రిలో ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. శూద్రకుని వత్సరాజ చరిత్రను నవలగా రాశారు. నన్నెచోడుడి ‘కుమార సంభవం’ కావ్యాన్ని పరిష్కరించి ప్రకటించి నన్నెచోడుడు నన్నయ కంటే ముందువాడని కవి గారు చేసిన ప్రతిపాదన పండిత లోకంలో ఒక సంచలనం. మెకంజీ కైఫీయత్తుల్ని తెలుగీకరించారు. క్రీడాభిరామం, నీతిసార ముక్తావళి, ప్రబంధ మణిభూషణం, పరతత్వ రసాయనం, అనర్ఘ రాఘవం, త్రిపురాంత కోదాహరణం, శ్రీరంగ మహత్యం, సకాలనీతి సమ్మతం వంటి గ్రంథాలను సేకరించి విశ్లేషణాత్మక పీఠికలతో ప్రకటించారు. వైజయంతి, భారతి, ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక, సరస్వతి మొదలైన పత్రికలలో అనేక విలువైన వ్యాసాలు రాశారు. వాల్మీకి చరిత్రనూ, తరిగొండ వెంగమాంబ, గణపవరపు వెంకటకవి, సోమనాథ సోమయాజి, కస్తూరి భట్టరాజు, చింతపల్లి కవుల్ని వెలుగులోనికి తీసుకువచ్చింది మానవల్లి వారే. తెలంగాణమంతా పర్యటించి ‘లిథిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్’ అనే శాసనాల సంకలన గ్రంథాన్ని ప్రతిబింబాలతో పాటుగా ప్రకటించారు.


ఇన్నింటిలోకీ యావత్ తెలుగు జాతి ఆయనకు రుణపడి తీరాల్సిన మహోన్నత కార్యం, మహానుభావుడు అన్నమయ్యను వెలికితీసిన మహత్కార్యం. అదొక్కటి చాలు ఆయన్ని తెలుగు జాతి సారస్వత ఉద్ధారక సమున్నతుడుగా గుర్తించడానికి. డబ్లిన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేసిన మెయిల్స్ డిల్లోన్ తాను పారిస్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు తన అభిమాన టీచర్ సిల్వెన్ లేవి తనకి మొట్టమొదటిసారిగా, రామకృష్ణ మహాకవి గారినే పరిచయం చేశారనీ, ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఎన్నో సందేహాలను కవిగారు నివృత్తి చేశారని అన్నారు. మానవల్లి వారు సంస్కృతంలో నలుగురు ప్రాచీన కవులు రాసిన చతుర్భాణిని 1922లో పరిష్కరించి ఇవ్వగా పాట్నాలోని ఒక ప్రచురణ సంస్థ ముద్రించిందనీ, దానిని తాను డార్జిలింగ్ వద్దగల కుర్సియాంగ్ రేడియో స్టేషన్‌కి డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 1967, 1968 సంవత్సరాలలో తెలుగులోకి అనువదించాననీ ప్రత్యేకంగా ఒక అధ్యాయమే కేటాయించి వెల్లడించారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. మహాపండితుడు, అనుపమేయ సారస్వత సేవకుడు అయిన మానవల్లి వారు తన చివరి దశలో ఆర్థిక సమస్యలతో చెప్పరాని బాధలు అనుభవించారు. కుమారులిరువురూ కలిసి రాలేదు. ప్రభుత్వం గుర్తించి ఎంతో కొంత గౌరవ భృతి ఏర్పాటు చేసింది. తుదకు తిరుపతి వీధుల్లో తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్న మానవల్లి వారిని అక్కడి రిక్షా వాళ్ళు చేరదీయగా ఒక హోటలు వారు దయతలచి భోజనం పెట్టేవారట. అలాంటి దుర్భర పరిస్థితుల్లో తన 91 ఏట 20–9–1957న ఆయన తిరుపతిలో మరణించారు. ప్రాచీన గ్రంథాల అన్వేషణలో నేపాల్, బరోడా, బికనీర్, ట్రావెంకోర్, లాహోర్, జోధ్‌పూర్‌, కేరళ, కలకత్తా... ఇలా దేశం నలుచెరుగులా తిరిగిన మరో తెలుగు కవి కానీ, పరిశోధకుడు కానీ ఆనాటికి, ఈనాటికీ కూడా ఎవరూ లేరు. మారుమూల గ్రామాల్లో సంప్రదాయ పండితులు ఇవ్వడానికి నిరాకరించిన గ్రంథాల్ని ఊరికే చూసి ఇస్తానని తీసుకుని మొత్తం గ్రంథాన్ని మనసులో పెట్టుకుని తిరిగి వచ్చాక వాటిని పొల్లుపోకుండా నకలు చేసేవారట కవిగారు.


అందుకేనేమో తిరుమల రామచంద్ర ‘ఆయన ధారణశక్తి శక్తిస్వరూపిణి. ఆయన మెదడొక పావురాల గూడు. అవసరమైన శ్లోకాలు ఆ అరల నుంచి కర్బురకాంతుల కపోతాలలాగ వెలుపలికి వచ్చేవి...’ అని అన్నారు. ఒకనాడు దేశం యావత్తు గౌరవించిన మానవల్లి రామకృష్ణకవి ఈ రోజు తెలుగు జాతికి సైతం విస్మృతుడయ్యారు. నిత్యం అన్నమాచర్యుల కీర్తనలతో మారుమోగే ఏ ఇంట్లోనూ, కనీసం ఆ వేంకటేశ్వరుని సన్నిధి పరిసరాలలో కూడా అసలు ఆయన గురించి తెలిసిన వారు లేరు. మానవల్లి వారి పేరుతో ఒక పురస్కారం ఏర్పాటు చేస్తే విశేష పరిశోధన చేసే వారికి ప్రోత్సాహంగా వుంటుంది. వేటూరి ప్రభాకర శాస్ర్తి మొదలుకుని తిరుమల రామచంద్ర వరకూ ఎందరో విజ్ఞాన జిజ్ఞాసువులకు మార్గదర్శకులుగా నిలిచిన రామకృష్ణ కవి విస్మృత జీవితాన్ని వెలుగులోనికి తీసుకురావడమే ఆయనకు మన తరం ఇవ్వదగ్గ కనీస సార్థక నివాళి.

గౌరవ్

(నేడు మానవల్లి రామకృష్ణ కవి 50వ జయంతి)

Updated Date - Mar 20 , 2025 | 01:42 AM