ఒప్పించలేక తప్పించుకుంటున్న స్టాలిన్!
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:36 AM
బాగా పరిపాలించి మరోసారి అధికారం ఇచ్చేలా ప్రజలను కన్విన్స్ చేయడం సాధ్యం కాకపోతే.. వాళ్లను కన్ఫ్యూజ్ చేయి సమస్య అదే పరిష్కారం అవుతుంది అంటాడు అమెరికా ముఫ్పై మూడో...

‘‘బాగా పరిపాలించి మరోసారి అధికారం ఇచ్చేలా ప్రజలను కన్విన్స్ చేయడం సాధ్యం కాకపోతే.. వాళ్లను కన్ఫ్యూజ్ చేయి సమస్య అదే పరిష్కారం అవుతుంది’’ అంటాడు అమెరికా ముఫ్పై మూడో ప్రెసిడెంట్ హ్యూరీ ట్రూమన్. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ అదే చేస్తున్నారు. ఎన్నికల భయంతో ఏడాది ముందే ఆయన ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ప్రారంభించారు. దానికి భాషను ఆయుధంగా వాడుకుంటున్నారు. గతంలో ఆయన తండ్రి కరుణానిధి కూడా అదే చేశారు. అప్పట్లో కరుణానిధి ఆయుధం సంస్కృత భాష. సంస్కృత భాషపై వ్యతిరేకతతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. కరుణానిధి రాజకీయ ప్రసంగాల్లో, సంస్కృతాన్ని ‘‘ఆర్య భాష’’గా చిత్రీకరిస్తూ, ద్రవిడ భాషలతో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశారు. 2007లో తిరువల్లువర్ అనే ప్రఖ్యాత తమిళ కవి గురించి మాట్లాడుతూ, ఆయన సంస్కృత భాషను వ్యతిరేకించారని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. నేడు వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు భాషా వివాదాన్ని తరచూ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బలమైన మద్దతును పొందడమే స్టాలిన్ ప్రధాన లక్ష్యం. భారతదేశంలో లింగ్విస్టిక్ ఫ్రీడమ్ ఉంది.
భారతీయుడు ఇష్టం వచ్చిన భాషలు నేర్చుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అలా చెబితే నేరం కూడా. మరి ఎందుకు హిందీని తమిళనాడులో శత్రు భాషగా ప్రచారం చేస్తున్నారు? కులం పేరుతో, ప్రాంతం పేరుతో తమిళులను భావోద్వేగాలతో నింపే అవకాశం లేదని అప్పట్లో హిందీ భాష వ్యతిరేకతను ద్రవిడ పార్టీల పెద్దలు ఎంచుకున్నారు. అభ్యుదయం పేరుతో క్రమశిక్షణ లేని జీవితాలను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఆనాడు భాషపై వేసిన విద్వేష బీజాలతోనే నేడు ద్రవిడ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పటికీ అదే భాషపై ద్వేషంతో ప్రజల్ని విడగొట్టి దేశానికి దూరం చేసి తమ ఓటు బ్యాంకుగా ఉంచుకోవాలనుకుంటున్నాయి. హిందీ భాషపై ఒక్క తమిళనాడులో తప్ప ఎక్కడా వ్యతిరేకత లేదు. తమిళనాడులోనూ హిందీ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు లక్షలామంది ఉంటారు. కానీ హిందీ నేర్చుకుంటే తమిళ ద్రోహం అన్నట్లుగా భయపెట్టి అందర్నీ ఆపేస్తున్నారు. హిందీ భాష వల్ల తమిళానికి ముప్పు వస్తుందని ఎవరైనా అంటే అంత కంటే పిచ్చి వాదన ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మాతృభాషలకు అసలు సవాల్‌గా మారింది ఇంగ్లిష్ మాత్రమే. ఇప్పుడు పిల్లల చదువులు ఇంగ్లిష్ మీడియంలో జరుగుతున్నాయి. మాతృభాష ద్వితీయ ప్రాధాన్యం అయిపోయింది. మాట్లాడేవారు ఉన్న చదువుకునేవారు తక్కువైపోతున్నారు. అంతెందుకు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి చదువుకుంది తమిళం మీడియంలోనా ఇంగ్లిష్ మీడియంలోనా? అంత ఎందుకు తమిళనాడులో ఇతర భాషల ఉనికి లేదా? తమిళనాడులో అధికార భాష తమిళ భాషను తమ మాతృభాషగా మాట్లాడుతారు. తెలుగు మాట్లాడేవారు తమిళనాడులో రెండవ అతిపెద్ద భాషా సమూహం.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా చెన్నై, వెల్లూరు, కాంచీపురం, తూత్తుకుడి, కోయంబత్తూరు వంటి జిల్లాలలో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న జిల్లాలలో, ముఖ్యంగా ధర్మపురి, కృష్ణగిరి, కోయంబత్తూరు వంటి ప్రాంతాలలో కన్నడ మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. కేరళ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా కన్యాకుమారి, తెన్కాశి వంటి జిల్లాలలో మలయాళం మాట్లాడే ప్రజలు ఉన్నారు. చెన్నై, వెల్లూరు వంటి పట్టణ ప్రాంతాలలో ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఇంగ్లీష్, హిందీ వంటి భాషలు కూడా విద్య, వ్యాపారం, ఇతర అవసరాల కోసం మాట్లాడేవారు తమిళనాడులో ఉన్నారు. కాదని చెప్పగలరా? ఇలాంటి సమయంలో ఇంగ్లిష్ నుంచి మాతృభాషను కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ హిందీపై యుద్ధం చేస్తే కలిగే ప్రయోజనం శూన్యం. మనదేశం వేలాది భిన్నభాషల, సంస్కృతుల సమ్మేళనం. గ్లోబలైజేషన్ కావొచ్చు ఇతర కారణం కావొచ్చు, ఇప్పుడు ఇంగ్లిష్ మాత్రమే గ్లోబల్ లాంగ్వేజ్. ప్రభుత్వ పాలన, ఇతర వ్యవహారాలన్నీ, రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఇంగ్లిష్‌లోనే సాగుతూంటాయి. తమిళనాడులో ప్రభుత్వ ఆదేశాలు కొన్ని చోట్ల తమిళంలో ఇస్తున్నప్పటికీ కేవలం తమిళంలో ఇవ్వడం లేదు. అందరికీ ఇంగ్లిష్‌లో ఆదేశాలు జారీ చేసి, కేవలం రికార్డెడ్‌గా మాత్రమే తమిళం ఆదేశాల కాపీలు ఉంచుతున్నారు. ఇంగ్లిష్ నుంచి వచ్చే ముప్పు నుంచి దేశ బాషలను కాపాడేందుకు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులను కూడా మాతృభాషల్లో బోధించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. టెక్స్‌ట్ బుక్‌లు రెడీ చేస్తోంది. ఇటీవల అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడు స్టాలిన్‌కు ఇదే సవాల్ చేశారు. ఎంబీబీఎస్ కోర్సును తమిళ భాషలో ప్రారంభించాలన్నారు.
దానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామన్నారు. దీనికి డీఎంకే నుంచి సమాధానం రాలేదు. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దడం లేదు. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం తెచ్చింది. హిందీ అధికారభాషే కానీ, జాతీయ భాష కాదు. దీన్ని అందరూ అంగీకరిస్తారు. హిందీ ప్రాంతాల్లోనూ హిందీ, ఆంగ్లభాషలే పాఠశాలల్లో బోధిస్తున్నారు. అక్కడ కూడా త్రిభాషా సూత్రం అమలవుతుంది. అయితే జాతీయ విద్యా విధానంలో త్రిభాషల్లో ఒకటిగా హిందీ ఉండటంతో అక్కడ హిందీ, ఇంగ్లిష్‌తో పాటు వారు ఎంచుకున్న బాషను నేర్పుతున్నారు. అక్కడి వారు తమిళం కోరుకుంటే తమిళం, తెలుగు మూడో లాంగ్వేజ్‌గా కోరుకుంటే తెలుగు నేర్పుతారు. మూడో భాషగా వారు ఏ భాషను ఎంచుకుంటారన్నది వారిష్టం. 2011 జనాభా లెక్కల ప్రకారం 22 భాషలు ఉండగా వాటిలో 17 భాషలు తిరోగమన బాట పట్టాయని, మాట్లాడేవారు తగ్గిపోతున్నారని, హిందీ బెంగాలీ తర్వాత మూడవ స్థానంలో ఉన్న తెలుగు కూడా నాల్గవ స్థానానికి పడిపోయిందని వాదిస్తున్నారు. ఇదే నిజం అయితే దీనికి కారణం హిందీ కాదు. ఇంగ్లిష్ మాత్రమే. అయితే హిందీ వల్ల ఉత్తర భారతంలోని అనేక భాషలు అంటే భోజ్‌పురి, అవథీ, బుందేలీ, ఛత్తీస్‌గడీ వంటి భాషలు కనుమరుగయ్యాయని వాదిస్తున్నారు. అవన్నీ హిందీ మాతృకగా ఉన్న భాషలే. వాటికి సంబంధించిన లిపి హిందీలోనే ఉంటుంది. అవి కనుమరుగయ్యే అవకాశం లేదు. వాటిని మాతృభాషగా ఉన్నవారు వాటికి ప్రాణం పోసుకుంటూనే ఉన్నారు. భాషను రాజకీయం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తమిళనాడు వాసులకు వారి మాతృభాషపై అమితమైన ప్రేమ అన్న విషయంలో డౌట్ లేదు. అంటే మిగతా రాష్ట్రాల వారికి ఆ ప్రేమ లేదని కాదు. కన్నడిగులు, తెలుగువారు, మలయాళీలు తమ మాతృభాషను మర్చిపోవడం లేదు. అలాగని ఇతర భాషల మీద ద్వేషం చూపడం లేదు. దీన్ని గుర్తిస్తే సమస్య ఉండదు.
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు