Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..
ABN , Publish Date - Jan 20 , 2025 | 07:15 AM
మనుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ మెుదటిస్థానంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మనుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ మెుదటిస్థానంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు. అయితే చాలా మందికి తమకు డయాబెటిస్ వచ్చిన విషయం కూడా తెలియదు. ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్తే పరీక్షల్లో తమకు డయాబెటిస్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మధుమేహం వస్తున్నట్లు ముందే తెలిసే అవకాశం ఉందా? మన శరీరం దాన్ని తెలియజేసేలా ఏమైనా సంకేతాలు ఇస్తుందా?. ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు చూస్తే.. డయాబెటిస్ వచ్చిన వారు విపరీతంగా నీటిని తాగుతుంటారు. వారి శరీరం నీటి కొరతను ఎదుర్కొవడంతో అధికంగా దాహం వేస్తుంది. దీంతో తరచుగా మంచి నీటిని తాగుతుంటారు. అలాగే అధికంగా మూత్రవిసర్జన చేస్తారు. మూత్రం ద్వారా నీరు అధికంగా పోవడంతో శరీరంలో నీటిస్థాయి తగ్గి దాహం వేస్తుంది. నీళ్లు తాగడం, మూత్ర విసర్జన చేయడం ఇదే పనిగా మారిపోతుంది. రాత్రిళ్లు సైతం టాయిలెట్ రావడంతో నిద్రాభంగం జరిగి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలసట, మత్తుగా ఉండడం, ఎక్కువగా నిద్ర వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయెుద్దు.
కొంతమంది ఎప్పటిలాగానే ఆహారం తీసుకున్నప్పటికీ ఒక్కసారిగా శరీర బరువుని కోల్పోతారు. ఇలా ఎందుకు జరిగిందో వారికి ఏమాత్రం అర్థం కాదు. అయితే ఇది కూడా డయాబెటిస్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించండి. షుగర్ పరీక్షలు చేయించుకుని డయాబెటిస్ ఉందో, లేదో నిర్ధారించుకోండి. మధుమేహం వచ్చిన వారికి దృష్టి సమస్యలు సైతం వస్తాయి. అప్పటివరకూ చూపు బాగానే కనిపించినప్పటికీ కళ్ల ద్రవస్థాయిల్లో మార్పులు వచ్చి కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు సైతం వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
అలాగే డయాబెటిస్ ప్రారంభ లక్షణాల్లో కాళ్లు, చేతులు మెుద్దుబారి స్పర్శను కోల్పోవడం, విపరీతమైన ఆకలి, చర్మం పొడిబారి వికారంగా మారిపోవడం వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి వారికి ప్రమాదవశాత్తూ గాయాలైనా త్వరగా మానే అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి. డయాబెటిస్ ఉందో, లేదో నిర్ధారించుకోండి.