Share News

crme news: మద్యం తాగి.. విచక్షణ మరిచి..

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:35 PM

Murder due to alcohol మూడు ముళ్ల బంధాన్ని, ఏడుడగుల అనుబంధాన్ని మరిచిన ఆ వ్యక్తి భార్యను నిర్ధాక్షిణ్యంగా హత్యచేశాడు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కిరాతకుడిగా వ్యవహరించాడు. గ్రామంలో అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో భార్యను ఇంట్లోనే కత్తితో దాడి చేసి కడతేర్చాడు.

crme news: మద్యం తాగి.. విచక్షణ మరిచి..
భర్త అప్పలరెడ్డితో నాగమ్మ (ఫైల్‌)

  • భార్యను చంపేశాడు

  • గొడవపడి తలపై, మెడపై కత్తితో దాడి

  • అనుమానంతో ఘాతుకం

  • ఎచ్చెర్ల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మూడు ముళ్ల బంధాన్ని, ఏడుడగుల అనుబంధాన్ని మరిచిన ఆ వ్యక్తి భార్యను నిర్ధాక్షిణ్యంగా హత్యచేశాడు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కిరాతకుడిగా వ్యవహరించాడు. గ్రామంలో అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో భార్యను ఇంట్లోనే కత్తితో దాడి చేసి కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే.. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం గ్రామానికి చెందిన నాగమ్మ(42).. భర్త అప్పలరెడ్డి చేతిలో సోమవారం రాత్రి హతమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు త్రినాథ్‌ విశాఖపట్నంలో తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె పార్వతికి 2020లోనే వివాహం చేయగా.. భర్తతో కలిసి విశాఖపట్నంలోనే ఉంటోంది. ప్రస్తుతం నాగమ్మ, అప్పలరెడ్డి మాత్రమే స్వగ్రామంలో నివసిస్తున్నారు. నీలగిరి, సరుగుడు తదితర తోటలు కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. నిరంతరం భార్యను అనుమానిస్తూ, అవమానిస్తుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న నాగమ్మతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా తోటలు కొట్టేందుకు వినియోగించే కత్తితో ఆమె తలపై, నుదుటిపై, మెడపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన తెలుసుకుని స్థానికులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అయితే సుమారు 20ఏళ్ల కిందట నాగమ్మను అప్పలరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా, హత్య చేసిన అనంతరం అప్పలరెడ్డి తాను దాడి చేసిన కత్తితో పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మంగళవారం ఉదయం జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌టీమ్‌ వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అక్కడికి శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద కూడా చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కుమారుడు త్రినాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎం.అవతారం తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 11:35 PM