Iran Missile City: భూగర్భ క్షిపణి నగరం
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:10 AM
ఇరాన్ భూగర్భంలో 500 మీటర్ల లోతులో భారీ క్షిపణి నిల్వ నగరాన్ని నిర్మించినట్లు వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దీనిపై భయాందోళన వ్యక్తం చేయగా, ఇరాన్ అణు ఒప్పంద విషయంలో తమ శక్తిని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది.

భూమికి 500 మీటర్ల అడుగున నిర్మించిన ఇరాన్
వీడియోను విడుదల చేసిన ఐఆర్‌జీసీ
అందులో.. ఖైబర్ షేకాన్స్, ఘద్రహాస్, సెజ్జిల్స్,
హజ్ ఖాసీమ్స్, పహేవ్ క్షిపణులు
ఇప్పటికే ఇరాన్‌లో పలు భూగర్భ నగరాలు!
ఇతర దేశాల నిఘా నుంచి తప్పించుకునేందుకే..
టెహ్రాన్/వాషింగ్టన్, మార్చి 26: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో క్షిపణులను భద్రపరిచే భారీ భూగర్భ నగరం వివరాలను ప్రపంచానికి తెలియజేసింది. భూమికి 500 మీటర్ల లోతులో ఈ నగరాన్ని నిర్మించినట్లు పేర్కొంటూ.. 85 సెకన్ల నిడివి గల ఓ వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఆ వీడియోలో ఇరాన్ సాయుధ బలగాల అధిపతి హుస్సేనీ బఘేరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ఏరోస్పేస్ కమాండర్ ఆమిర్‌అలీ హాజిజాద్ ఓ వాహనంపై సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ.. ఆయుధాలను వీక్షిస్తున్న దృశ్యాలున్నాయి. అక్కడ ఖైబర్ షేకాన్స్, ఘద్రహస్, సెజ్జిల్స్, హజ్ ఖాసీమ్స్, పవేహ్, ఖద్ర్ క్షిపణులు ఉన్నట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోంది. ఇరాన్ చెబుతున్న క్షిపణి నిల్వల భూగర్భ నగరం ఆ దేశ నైరుతి ప్రాంతమైన ఖరీద్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రావిన్స్‌కు ఉత్తరాన కొండలు, పర్వతాలు ఉండగా.. దక్షిణాన మైదానప్రాంతం మాదిరి ప్రాంతాలున్నాయి. ఖరూన్, కర్కేహ్, జరాహీ, మారూన్ నదులు ఈ ప్రావిన్స్ మీదుగా ప్రవహిస్తాయి. అయితే.. ఖరీద్ ప్రావిన్స్ ఉత్తర భాగంలో ఇరాక్, సౌదీ అరేబియాలోని ఎడారుల నుంచి దుమ్ము తుఫాన్లు వస్తాయి. ఫలితంగా అక్కడ భూగర్భంలో చెలమలకు అవకాశం లేదని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీడియోలో దృశ్యాలను బట్టి చూస్తే.. భూగర్భ నగరం, సొరంగ మార్గాలను భారీ బంకర్ల మాదిరిగా నిర్మించారు. అంటే.. అణుయుద్ధాలు వచ్చినా.. వేల మంది పౌరులకు భూగర్భ నగరాల్లో ఆశ్రయం కల్పించే అవకాశాలుంటాయి. 2018లో కూడా ఇరాన్ తన సముద్ర తీరప్రాంతాల్లో భూగర్భ నగరాలను నిర్మించిందనే వార్తలు వచ్చాయి. పర్షియన్ గల్ఫ్ ఒడ్డున రహస్య క్షిపణి డిపోలు ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో..
అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఇటీవల యెమన్ కేంద్రంగా దాడులు చేస్తున్న హౌతీలపై అమెరికా విరుచుకుపడింది. ఆ సందర్భంలోనూ ఇరాన్‌ను ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అణు ఒప్పందానికి రెండు నెలల గడువు విధించారు. ట్రంప్ హెచ్చరికలతో.. తాము అణు ఒప్పందానికి సిద్ధమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ ఇటీవల ప్రకటించారు. అయితే.. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం హౌతీల సొంత కారణాలతో దాడులకు జరిగుతున్నాయని, తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని, అమెరికాకు గట్టి దెబ్బ తగులుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. తమ శక్తిని అంచనా వేయొద్దంటూ సందేశం ఇచ్చేలా ఇరాన్ తమ భూగర్భ నగరం వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఈ దేశాలకు ముప్పు?
ఇరాన్ తాజా వీడియోపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇది భయాందోళన కలిగించే విషయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అమెరికా రక్షణ శాఖ కూడా దీనిపై అత్యవసర సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ మిసైల్ సిటీ కారణంగా ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్, ఐరోపా దేశాలకు ముప్పు పొంచి ఉందని రక్షణ రంగ నిపుణులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాజా వీడియో మరింత ఆజ్యం పోసినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..