Myanmar Earthquake: మయన్మార్ భూకంపం.. 334 అణుబాంబులతో సమానం
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:06 AM
మయన్మార్‌లో శుక్రవారం జరిగిన భారీ భూకంపం అణుబాంబులకు సమానమైన శక్తిని ప్రదర్శించింది. భవనాలు పూర్తిగా ధ్వంసం అవడం వల్ల మరణాల సంఖ్య 2972కి చేరుకుంది

334 అణుబాంబులతో సమానం
మయన్మార్ భూకంపం అంత శక్తిమంతమైంది.. జియాలజిస్టు జెస్ ఫీనిక్స్ వెల్లడి
భారత్-యురేషియన్ ఫలకాల ఢీ.. రాబోయే రోజుల్లోనూ ప్రకంపనలు!
3 వేలకు పెరిగిన మరణాలు
ఆదివారం మరోమారు భూకంపం
నేపిదా, మార్చి 30: మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం, తదనంతర ప్రకంపనలు అత్యంత తీవ్రత ఉన్నాయని అమెరికాకు చెందిన జియాలజిస్టు జెస్ ఫీనిక్స్ వెల్లడించారు. ఈ తీవ్రత 334 అణుబాంబుల విధ్వంసంతో సమానమని పేర్కొన్నారు. భూగర్భంలో భారత-యురేషియన్ టెక్టానిక్ ఫలకాలు ఢీకొనడం వల్ల.. మయన్మార్‌లోని స్ట్రైక్‌స్లిప్ కేటగిరీకి చెందిన ‘సగైంగ్ ఫాల్ట్’ వద్ద రాబోయే కొన్ని నెలల పాటు తదనంతర ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) వచ్చే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు. ఆదివారం రాత్రి కడపటి వార్తలందేసరికి మయన్మార్ భూకంప మృతుల సంఖ్య 2,972కు చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల సంఖ్య 3,122గా ఉన్నట్లు తెలిపాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మరణాల సంఖ్య పెరుగుతోందని చెప్పాయి. కాగా.. అంతర్యుద్ధం కారణంగా ఆంక్షలు కొనసాగుతుండడంతో.. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలేర్పడుతున్నాయి. భవనాల శిథిలాలను తొలగించి, ఒక్కో మృతదేహాన్ని వెలికితీయడానికి 2 నుంచి 8 గంటల సమయం పడుతున్నట్లు రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.
అనుక్షణం భయంభయం
శుక్రవారం నాటి భారీ భూకంపం తర్వాత కూడా మయన్మార్ పౌరులు అనుక్షణం భయంభయంగా గడుపుతున్నారు. ఇక్కడ తదనంతర ప్రకంపనలు కూడా తీవ్రంగానే ఉంటున్నాయి. శుక్రవారం తొలి భూకంప తీవ్రత 7.7గా నమోదవ్వగా.. ఆ తర్వాత వరుసగా 3.3-4.7 మధ్య, శనివారం 3.8-4.7 మధ్య తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం మండలే నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించింది. మరిన్ని భూకంపాలు రావొచ్చనే వార్తల నేపథ్యంలో మయన్మార్ పౌరులు రోడ్లపైనే ఉంటున్నారు.
సికాయ్ 80% ధ్వంసం
మాండలే కేంద్రంగా భూకంపం సంభవించినా.. పర్వతప్రాంతం సికాయ్ దారుణంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 80% పట్టణం ధ్వంసమైపోయిందని, మిగతా 20% కూడా పాక్షికంగా భూకంప ప్రభావిత ఇళ్లతో మిగిలిపోయిందని పేర్కొన్నారు. సెనేట్ ప్రతినిధి కమిటీ కార్యదర్శి మావో ఝావోటియాన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేశారు. రెబల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమకు మానవతాసాయం అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల పౌరులే వట్టి చేతులతో శిథిలాలను తొలగించి, తమవారి కోసం వెతుకుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వెలికితీసిన 183 మృతదేహాలను ఆదివారం సామూహికంగా ఖననం చేసినట్లు సికాయ్‌లోని ఓబో హెల్త్ అండ్ రెస్క్యూ టీమ్ బృందం సభ్యుడొకరు తెలిపారు.
సహాయక చర్యల్లో ఆటంకాలు..
మయన్మార్‌లో భూకంప సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతోంది. రెబల్స్ ఉంటున్న ప్రాంతాలకు దారి తీసే రహదారుల్లో మిలటరీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద సహాయక బృందాలను అడ్డుకుంటున్నారని, అక్కడి సైనికులకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే, సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
సాయానికి స్టార్‌లింక్
మయన్మార్‌లో కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్‌మస్క్ ఎక్స్‌లో పోస్టు చేశారు. మయన్మార్‌లోని సైనిక సర్కారు అనుమతిస్తే.. వెంటనే చర్యలను ప్రారంభిస్తామని తెలిపారు. భూప్రకోపానికి గురైన మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ను ప్రారంభించింది. ఇదిలా ఉండగా, భూకంపం కారణంగా థాయ్‌లాండ్‌లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిపై ఆశలు ఆవిరవుతున్నాయని బ్యాంకాక్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరని గుర్తుచేశారు. శిథిలాలను పూర్తిగా తొలగించడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్లు పేర్కొన్న పోలీసులు.. ఇంకా 82 మంది గల్లంతైనట్లు వివరించారు.
శ్మశాన వాటికల్లో రద్దీ!
మాండలేలోని దక్షిణ, లాంగికాన్ శ్మశాన వాటికల్లో ఆదివారం విపరీతమైన రద్దీ నెలకొంది. ఖననాలకు స్థలం సరిపోని పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. ‘‘ఆదివారం ఉదయం శ్మశానవాటిక బయట పార్క్ చేసిన కార్లతో రహదారులు నిండిపోయాయి. మయన్మార్ చట్టాల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రం లేనిదే మృతదేహాలను ఖననం చేయకూడదు. వందల మృతదేహాల విషయంలో అలాంటి పత్రాలు లేవు. దీంతో.. సమీప సరస్సు వద్దే బంధుమిత్రులు తమవారి మృతదేహాలతో పడిగాపులు కాస్తున్నారు’’ అని లాంగికాన్ శ్మశానవాటికలో పనిచేసే ఓ వ్యక్తి చెప్పారు. ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన మృతదేహాలు కూడా శ్మశాన వాటికలో కుప్పలుగా ఉన్నాయని వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఫోన్‌ను చొక్కా జేబులో పెడుతున్నారా.. ఎలా కొట్టేశాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..