Share News

Israel: ఇజ్రాయెల్‌ నిఘా చీఫ్‌పై వేటు!

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:32 AM

తన శక్తివంతమైన అంతర్గత నిఘా విభాగం ‘షిన్‌ బెట్‌’ చీఫ్‌ రొనెన్‌ బార్‌పై ప్రధాని నెతన్యాహు వేటు వేశారు. బార్‌ను సర్వీసు నుంచి తొలగించాలని గురువారం రాత్రి జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.

Israel: ఇజ్రాయెల్‌ నిఘా చీఫ్‌పై వేటు!

1949 తర్వాత చరిత్రలో తొలిసారి ‘షిన్‌ బెట్‌’ అధిపతి తొలగింపు

తాత్కాలిక స్టే విధించిన సుప్రీంకోర్టు

టెల్‌ అవివ్‌/జెరూసలేం, మార్చి 21: హమా్‌సతో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన శక్తివంతమైన అంతర్గత నిఘా విభాగం ‘షిన్‌ బెట్‌’ చీఫ్‌ రొనెన్‌ బార్‌పై ప్రధాని నెతన్యాహు వేటు వేశారు. బార్‌ను సర్వీసు నుంచి తొలగించాలని గురువారం రాత్రి జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బార్‌పై నెతన్యాహు విశ్వాసం కోల్పోయారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు బార్‌ తొలగింపు అవసరమని, ‘తదుపరి విపత్తు’ను నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఆయన వారసుడిని నియమించే వరకు కాని, ఏప్రిల్‌ 10 వరకు గానీ ఏది ముందు అయితే అప్పటి వరకు బార్‌ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. ఇజ్రాయెల్‌ చరిత్రలో షిన్‌ బెట్‌ను ఏర్పాటు చేసిన 1949 నుంచి ఈ తరహా అసాధారణ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. బార్‌ పదవీ కాలం వాస్తవానికి మరో ఏడాదిన్నర ఉంది.


తనను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ బార్‌ వేసిన పిటిషన్‌పై ఇజ్రాయెల్‌ సుప్రీంకోర్టు తక్షణం స్పందించింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపే వరకు నెతన్యాహు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పీల్‌ను ఏప్రిల్‌ 8లోగా విచారిస్తామని పేర్కొంది. 2023, అక్టోబర్‌ 7న హమాస్‌ దాడిని గుర్తించడంలో షెన్‌ బెట్‌ విఫలమైందని, దానివల్లే నెతన్యాహు రోరెన్‌ బార్‌ను తొలగించారని తెలుస్తోంది. మరోవైపు, బార్‌ తొలగింపు వెనుక ‘ఖతార్‌-గేట్‌’ దర్యాప్తుల అంశం ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నెతన్యాహు సన్నిహితులు ఖతార్‌ తరఫున లాబీయింగ్‌ చేశారన్న ఆరోపణపై షిట్‌ బెట్‌ పరిశీలన చేస్తోంది. ఖతార్‌ ప్రభుత్వంతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.



ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 06:32 AM