Char Dham Yatra 2025: యూట్యూబర్స్, రీల్స్ చేసే వారికి షాకింగ్ న్యూస్.. అక్కడికి నో ఎంట్రీ..
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:07 PM
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. వ్యూస్, లైకుల కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ జనాల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్, రీల్స్ చేసే వారికి షాక్ తగలనుంది.

ప్రపంచంలో ఎక్కడా దొరకని సోషల్ మీడియా సరుకు మన భారతదేశంలోనే దొరుకుతుంది. పూసలు అమ్ముకునే వారిని, బిచ్చగత్తెను కూడా సెలెబ్రిటీని చేసే సత్తా మన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఉంది. ఓ సెల్‌ఫోన్ చేతిలో పట్టుకుని.. ఎక్కడ పడితే అక్కడ.. ఎవర్ని పడితే వారిని వీడియోలు తీసేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్లు రచ్చ చేస్తూ ఉన్నారు. వ్యూస్, లైకుల కోసం ఆఖరికి గుళ్లను కూడా వదలటం లేదు. వీడియోలు తీసే నెపంతో పవిత్ర స్థలాల్లో కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేధార్‌నాథ్-బద్రీనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు గుడి ప్రాంగంణంలోకి అనుమతి నిషేధించాయి.
మరికొన్ని రోజుల్లో చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. ఏప్రిల్ 3 అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి గుడి తలుపులు తెరుకుంటాయి. అప్పటినుంచి చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. మే 2వ తేదీన కేధార్‌నాథ్ గుడి తలుపులు తెరుచుకుంటాయి. అనంతరం మే 4వ తేదీన బద్రీనాథ్ గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. యాత్రకు వచ్చే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయంలో కేధార్‌నాథ్-బద్రీనాథ్ పండ సమాజ్ కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. గుడి ప్రాంగణంలోకి వారికి అనుమతి నిషేధించింది. ఎవరైనా గుడి ప్రాంగణంలో వీడియోలు తీస్తూ కనిపిస్తే.. దర్శనం అవ్వకుండానే వెనక్కు పంపేస్తామని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 30 నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై నిషేధం ఉంటుంది. ఈ కొత్త రూలుకు సంబంధించి కేధార్‌నాథ్-బద్రీనాథ్ పండ సమాజ్ ప్రభుత్వంతో చర్చించింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇక, యాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండానికి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యాత్ర జరిగే మొత్తం 10 కిలోమీటర్ల పరిధిలో పోలీస్ పహారా ఉండనుంది. పోలీసులు బైకులపై తిరుగుతూ భక్తుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. అవసరమైన వారికి సాయం చేస్తారు. చార్ ధామ్ యాత్ర కోసం కేవలం ఆరు రోజుల్లో 9 లక్షల మంది భక్తులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
Ramagiri MPP Elections: పెనుకొండకు రామగిరి పాలిటిక్స్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
Viral Video: దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో..