Share News

Delhi ExitPolls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఢిల్లీ పీఠం ఎవరిదంటే

ABN , Publish Date - Feb 05 , 2025 | 06:14 PM

ఢిల్లీ శాసనసభలో మెజార్టీ ఏ పార్టీకి వస్తుంది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి. మెజార్టీ మార్క్ ఏ పార్టీకి దాటబోతుంది. హంగ్ వస్తే కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా..

Delhi ExitPolls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఢిల్లీ పీఠం ఎవరిదంటే
Delhi Elections

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. 699 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఈనెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.ఈలోపు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేదెవరనేదానిపై వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ఢిల్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి ఆప్, బీజేపీ అధికారం కోసం చేయని ప్రయత్నాలు లేవు. ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేశాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేసుకున్నారు. ఈక్రమంలో ఢిల్లీ ఓటర్లు ఎవరిని ఆశీర్వదించారనేది ఆసక్తిగా మారింది.


ఆప్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ రోజుకో ప్రచారఅస్త్రాన్ని బయటకు తీసుకురాగా.. వాటిని ధీటుగా తిప్పికొట్టడంతో పాటు బీజేపీపై తీవ్రస్థాయిలో ఆప్ విమర్శలు కురిపించింది. కాంగ్రెస్ సైతం పోటీలో ఉన్నప్పటికీ ప్రధానపోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉంటుందనే ప్రచారం సాగిననేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ ఫలితాలపై మరింత ఆసక్తి రేపుతున్నాయి.


బీజేపీకి అనుకూలంగా..

ఒకట్రెండు సర్వే సంస్థలు ఆప్‌ మెజార్టీ మార్క్ దాటుతుందని అంచనా వేయగా.. మరికొన్ని సంస్థలు బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ఒకటి నుంచి మూడు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థలు అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థల సంయుక్త ఎగ్జిట్‌పోల్‌ ప్రకారం.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరనుందని స్పష్టం చేసింది. ఈ సర్వేలో బీజేపీ 51-60, ఆప్‌ 10-19 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే సంస్థలు తెలిపాయి. కాంగ్రెస్‌తోపాటు ఇతరులకు చోటు దక్కదని ఈ సంస్థ స్ఫష్టం చేసింది. అయితే ఢిల్లీలోని మహిళా ఓటర్లు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి జైకొట్టినట్లు పీపుల్స్ పల్స్ కొడిమో వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్‌ అంచనా ప్రకారం బీజేపీ 39 నుంచి 44 స్థానాలు, ఆప్‌ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది. కేకే సర్వేలో మాత్రం ఆప్‌ 39, బీజేపీ 22 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. రిపబ్లిక్‌ పిమార్క్‌ అంచనా ప్రకారం బీజేపీ 39 నుంచి 49, ఆప్‌ 21 నుంచి 31, కాంగ్రెస్‌ పార్టీ ఒకచోట గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. అసలు ఫలితం తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 05 , 2025 | 06:56 PM