Jitendra Singh: విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలతో 1,243 కోట్ల ఆర్జన
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:27 AM
అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలు సాధిస్తున్న భారత్... వాణిజ్యపరంగానూ భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. గత పదేళ్ల కాలంలో 34 దేశాలకు చెందిన విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా రూ.1243 కోట్ల (143 మిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

న్యూఢిల్లీ, మార్చి 14: అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలు సాధిస్తున్న భారత్... వాణిజ్యపరంగానూ భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. గత పదేళ్ల కాలంలో 34 దేశాలకు చెందిన విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా రూ.1243 కోట్ల (143 మిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2015 జనవరి నుంచి 2024 డిసెంబరు వరకు వాణిజ్య ప్రాతిపదికను మొత్తం 393 విదేశీ ఉపగ్రహాలు, 3 భారత కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్టు లోక్‌సభలో తెలిపారు.
భారత్ ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల్లో అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవి కూడా ఉన్నాయని వివరించారు. అత్యధికంగా అమెరికాకు చెందిన 232 ఉపగ్రహాలను పంపగా, ఆ తర్వాత ఇంగ్లండ్ (83), సింగపూర్ (19) దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం 61 దేశాలు, 5 బహుళ జాతి సంస్థలతో భారత్ అంతరిక్ష సహకార ఒప్పందాలు చేసుకుంది.