Share News

Rahul Gandhi: స్పీకర్‌ మాట్లాడనివ్వడం లేదు

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:03 AM

రాహుల్ గాంధీ లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాన్ని అణగదొక్కే విధంగా సభ నడుస్తోందని విమర్శించారు.

 Rahul Gandhi: స్పీకర్‌ మాట్లాడనివ్వడం లేదు

అవకాశమివ్వాలని కోరితే వాయిదావేసి పారిపోయారు: రాహుల్‌గాంధీ

విపక్ష నేత హుందాగా మెలగాలి

సభానియమాలు పాటించాలి: సభాపతి

న్యూఢిల్లీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. స్పీకర్‌ ఓం బిర్లా సభలో తనను మాట్లాడనివ్వడం లేదన్నారు. ఏడెనిమిది రోజులుగా ఇదే జరుగుతోందని తెలిపారు. బుధవారం సభాపతి సభను వాయిదావేసే ముందు.. సభ్యులు సభలో హుందాతనం పాటించాలని చెప్పారు. సభలో కొందరి ప్రవర్తన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ పలు దృష్టాంతాలు తన దృష్టికి వచ్చాయన్నారు. తండ్రి-కుమార్తె, తల్లి-కుమార్తె, భర్త-భార్య సభ్యులుగా ఉండడం ఈ సభ చూసిందని.. ఈ నేపథ్యంలో సభలో సభ్యులు 349 నిబంధనకు అనుగుణంగా నడచుకోవాలని, ముఖ్యంగా ప్రతిపక్ష నేత నియమాల ప్రకారం ప్రవర్తించాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. సభాపతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తక్షణ కారణమేంటో తెలియరాలేదు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘సభలో నన్ను మాట్లాడనివ్వాలని విజ్ఞప్తిచేశాను. కానీ ఆయన పారిపోయారు. సభ నడిపే పద్ధతి ఇది కాదు. నా గురించి నిరాధారంగా మాట్లాడారు. నా ప్రస్తావన తెచ్చినందున నాకు మాట్లాడే అవకాశమివ్వాలని అడిగాను. అవసరం లేకపోయినా ఆయన సభను వాయిదావేసి వెళ్లిపోయారు. సభలో ప్రసంగించేందుకు ప్రతిపక్ష నేతకు చాన్సివ్వడం సంప్రదాయం. నేను ఎప్పుడు లేచినా మాట్లాడేందుకు అనుమతించడం లేదు. ఏడెనిమిది రోజులుగా ఇది జరుగుతోంది. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ తావులేదు’ అని ఆరోపించారు.


మరోవైపు.. స్పీకర్‌ నిష్క్రమించగానే.. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌, విప్‌ మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సహా సుమారు 70 మంది కాంగ్రెస్‌ ఎంపీలు ఆయన చాంబరుకు హడావుడిగా చేరుకున్నారు. తమ నేతకు కొన్ని రోజులుగా అవకాశమివ్వడం లేదని ఆక్షేపించారు. ఆయనపై వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటో తెలుసుకోగోరారు. అయితే తమ ప్రయత్నం ఫలించలేదని కొందరు ఎంపీలు తెలిపారు. కాగా.. మౌలిక పార్లమెంటరీ మర్యాదల గురించి ప్రతిపక్ష నేతకు స్పీకర్‌ గుర్తుచేయాల్సి రావడం అవమానకరమని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ వ్యాఖ్యానించారు. మాణిక్కం ఠాగూర్‌ సభలో ప్రసంగిస్తుండగా.. రాహుల్‌ లేచి తన సోదరి ప్రియాంక సీటు వద్దకు వెళ్లి ప్రేమగా ఆమె బుగ్గలు నొక్కుతున్న దృశ్యాన్ని మాలవీయ పోస్టు చేశారు. అన్నాచెల్లెళ్ల ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనమైనప్పటికీ.. పార్లమెంటు జరుగుతుండగా రాహుల్‌ అలా చేయడాన్ని సభాపతి తీవ్రంగా పరిగణించినట్లు కనబడుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 05:03 AM