Share News

Chhattisgarh Maoist Clash: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:24 AM

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది, ఇందులో 17 మంది మావోయిస్టులు మరణించారు. 11 మంది మహిళలతో సహా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో ప్రముఖ మావోయిస్టు నేత జగదీశ్‌ కూడా ఉన్నారు

Chhattisgarh Maoist Clash: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

17 మంది మావోయిస్టుల మృతి

సుకుమా జిల్లాలోని అడవుల్లో ఘటన

మృతుల్లో 11 మంది మహిళలు

గాయపడ్డ నలుగురు డీఆర్‌జీ జవాన్లు

మావోయిస్టులు లొంగిపోవాలి: అమిత్‌ షా

15 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల/చింతూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. తొమ్మిది రోజుల క్రితం ఈ నెల 20న బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను మరువక ముందే శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. సుక్మా జిల్లా కెర్లపాల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఉప్పంపల్లిలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. మృతుల్లో దర్బా డివిజన్‌ కమిటీ కార్యదర్శి, ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు కుహ్దామి జగదీశ్‌ అలియాస్‌ బుధ్రా కూడా ఉన్నాడు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. కాగా, ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు డీఆర్‌జీ, మరొకరు సీఆర్‌ఫీఎఫ్‌ జవాను ఉన్నారు. గాయపడ్డ జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని బస్తర్‌ రేంజ్‌ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ ఐజీ సందర్‌రాజ్‌ తెలిపారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్‌లో రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు. 17 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో డీఆర్‌జీ, 159 బెటాలియన్‌కు చెందిన సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగి 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, శనివారం సాయంత్రం వరకు మృతుల్లో ఏడుగురిని గుర్తించినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.


ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దర్బా డివిజన్‌ కమిటీ కార్యదర్శి జగదీశ్‌ స్వస్థలం సుకుమా జిల్లా కుకనార్‌ గ్రామం. 2013లో 30 మంది కాంగ్రెస్‌ నాయకులను హత్య చేసిన ఘటన, 2023లో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసి 10 మందిని హత్య చేసిన ఘటనల్లో జగదీశ్‌ నిందితుడు. కాగా,ఛత్తీస్‌గఢ్‌లో ఒకే నెలలో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. మార్చి 20న బీజాపూర్‌ జిల్లా గంగలూరు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందగా.. తాజా ఎన్‌కౌంటర్‌లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది మహిళలు ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఇకనైనా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మరోవైపు,ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం 15 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్‌కౌంటర్‌ బూటకం

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫసర్‌ లక్ష్మణ్‌ గడ్డం, ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావు ఆరోపించారు. దండకారణ్యంలో నరమేధం ఆపాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:24 AM