Bajinder Singh Gets Life Term: పంజాబ్‌కు చెందిన మత ప్రబోధకుడికి యావజ్జీవ కారాగార శిక్ష
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:53 PM
పంజాబ్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు బాజిందర్‌కు సింగ్‌కు అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2018 నాటి కేసులో మోహాలీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

పంజాబ్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు బాజిందర్ సింగ్‌కు మోహాలీ కోర్టు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018 నాటి అత్యాచారం కేసులో న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మత ప్రబోధకుడిగా ప్రచారం చేసుకునే వ్యక్తి తనపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తులపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టకూడదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పాటియాలా జైలుకు తరలించారు.
Also Read: మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న నగరాల్లో మధ్య నిషేధం
విదేశాల్లో సెటిల్ చేస్తానని మభ్యపెట్టి తనపై బాజిందర్ అత్యాచారానికి ఒడిగట్టాడంటూ బాధితురాలు 2018లో ఫిర్యాదు చేసింది. తన ఇంటికి పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఘటన వీడియోను చిత్రీకరించి తనపై బెదిరింపులకు దిగాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తానని హెచ్చరించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో బాజీందర్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.
Also Read: ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. లోకోపైలట్‌ల దుర్మరణం
ఈ కేసులో బాధితురాలు కోర్టు తీర్పును స్వాగతించింది. ‘‘అతడో సైకో, అతడు బయట ఉంటే ఇలాంటి దారుణాలకు పాల్పడతారు. కాబట్టి, జైల్లోనే అతడు మగ్గిపోవాలి. నేడు ఎందరో బాధితులకు విజయం దక్కిన రోజు. మాపై దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీని అభ్యర్థిస్తున్నాను’’ అని ఆమె అన్నారు. న్యాయం కోసం తాము ఏడేళ్ల పాటు పోరాడామని బాధితురాలి భర్త పేర్కొన్నారు. కోర్టును బాజీందర్ పలుమార్లు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడని, అనుమతి లేకున్నా విదేశాలకు వెళ్లాడని తెలిపింది. తనపై ఫేక్ ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్ చేయించాడని, దాడులు చేయించాడని తెలిపారు. తాను ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందని కూడా అన్నాడు. అతడికి ఎలాగైనా శిక్ష పడాలని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు.