PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
ABN , Publish Date - Feb 04 , 2025 | 07:56 PM
పేదలపై కపట ప్రేమ తమకు చేతకాదని, తాము చేతల మనుషులమని, లక్షలాది మందిని పేదరికం నుంచి ఒడ్డున పడేశామని, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకున్నామని ప్రదానమంత్రి లెక్కలతో సహా చెప్పారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సమాధానం ఇస్తూ అనేక అంశాలను ప్రస్తావించారు. యూపీఏ హయాంలో 'టాక్స్ బాంబు' నుంచి రాహుల్ గాంధీ ఓబీసీ వ్యాఖ్యల వరకూ ఏకరువు పెట్టారు. కేజ్రీవాల్ 'శీష్ మహల్' వ్యవహారాన్ని సైతం విడిచిపెట్టలేదు. యూపీఏ హయాంలో సంక్షేమ ఫలాలు పక్కదారి పడితే, వాటిని నేరుగా ప్రజలకే అందించిన ఘనత ఎన్డీయే సర్కార్‌కే దక్కుతుందన్నారు. పేదలపై కపట ప్రేమ తమకు చేతకాదని, తాము చేతల మనుషులమని, లక్షలాది మందిని పేదరికం నుంచి ఒడ్డున పడేశామని, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకున్నామని లెక్కలతో సహా చెప్పారు.
PM Modi: వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తాం
ప్రధాని ప్రసంగంలో ముఖ్యంశాలు
-రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇచ్చే అవకాశం రావడం ఇది 14వ సారి. ఈ అవకాశం కల్పించిన ప్రజలకు నా కృతజ్ఞతలు.
-కొందరు వ్యక్తులు (కేజ్రీవాల్) జాకుజీ (వెచ్చటి నీటి కొలనులు), స్లైలిష్ షవర్లపై దృష్టి పెడతారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వడంపై ఎన్డీయే దృష్టి పెడుతుంది. మా ప్రభుత్వం తప్పుడు నినాదాలు ఇవ్వదు. నిజమైన అభివృద్ధిని ప్రజలకు అందిస్తుంది. ప్రభుత్వ పథకాలతో డబ్బు ఆదా చేస్తుందే కానీ, ప్రజాధనాన్ని 'శీష్ మహల్' కట్టుకోవడానికి వినియోగించదు.
-పేదల గుడిసెల్లో ఫోటో సెషన్లపై దృష్టి పెట్టేవారు, వినోదించే వారికి (రాహుల్ గాంధీ) పార్లమెంటులో పేదల గురించి మాట్లాడుతుంటే బోర్ కొట్టినట్టే ఉంటుంది.
-బీజేపీ ప్రభుత్వం రాకముందు ప్రతిరోజూ అవినీతి, స్కామ్‌లు గురించే హెడ్‌లైన్స్ వార్తలు ఉండేవి. కానీ, గత పదేళ్లుగా మేము కోట్లాది రూపాయిలు ఆదా చేసి ప్రజలకు వినియోగించాం. దేశ నిర్మాణానికే డబ్బులు ఖర్చుచేసామే కానీ 'శీష్ హమల్' కట్టుకోవడానికి ఖర్చు చేయలేదు.
-ఆదాయం పన్ను తగ్గించడం ద్వారా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మధ్యతరగతి వర్గానికి సేవింగ్స్ పెంచింది. 2014కు ముందు (యూపీఏ హయాంలో) టాక్స్ బాంబులు విసిరేవాళ్లు, బుల్లెట్లు పేల్చేవాళ్లు. ప్రజా జీవనంపై ఎంతో భారం పడేది. ఆ గాయాల నుంచి తమ ప్రభుత్వం స్వస్థత చేకూర్చి ముందుకు వెళ్తోంది. ఇవాళ రూ.12 లక్షల వరకూ పన్ను కట్టనక్కరలేదు.
-యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. కొన్ని పార్టీలు యువతను మోసగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఆ తర్వాత చేతులెత్తేస్తారు. ఇలాంటి పార్టీలు యువత భవిష్యత్తుకు విపత్తు (ఆప్‌దా) వంటివి. హర్యానాలో మేము ఎలా పనిచేశామో అందరూ చూశారు. ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి ప్రభుత్వం ఏర్పడగానే యువతకు ఉద్యోగాలిచ్చాం. మహారాష్ట్రలోనూ చారిత్రక ఫలితాలు సాధించాం. ప్రజల ఆశీర్వాదంతోనే మేము ఈ విజయాలు సాధించాం.
-కొందరు (విపక్ష నేతలు) అర్బన్ నక్సల్స్ భాషలో మాట్లాడుతూ 'ఇండియన్ స్టేట్'ను బహిరంగంగానే సవాలు చేస్తుంటారు. ఇలా మాట్లాడే వారికి రాజ్యాంగం గురించి కానీ, దేశ ఐక్యత గురించి కానీ అవగాహన లేదు. భారత రాజ్యంగం ఎలాంటి వివక్ష తావీయదు. రాజ్యాంగాన్ని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్న వారికి (రాహుల్) ముస్లిం మహిళలను ఎలాంటి కష్టాల్లోకి నెట్టేశారనేది తెలియదు.
-మహాత్మాగాంధీ చెప్పినట్టు చిట్టచివరి వ్యక్తి వరకూ ఫలాలు అందాలనేదే మా ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు గరిష్ట అవకాశాల కల్పనకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. కొందరికి (రాహుల్) కులం గురించి మాట్లాడటం ఫ్యాషన్‌గా ఉంటుంది. గత 30 ఏళ్లుగా ఓబీసీ ఎంపీలు ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కులాన్ని సొంత లబ్ధి కోసం వాడుకోవాలని చూసేవారు ఆ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోలేదు? విపక్షాల మాటలకు, చేతలకు అసలు పొంతనే ఉండదు.
-అధికారమనేది సేవ చేసేందుకే అయితే జాతి నిర్మాణం జరుగుతుంది. అధికారం వారసత్వంగా మారితే ప్రజాసామ్యం అంతమవుతుంది. మేము రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తామే కానీ విష రాజకీయాలకు పాల్పడం.
మరిన్ని వార్తల కోసం..
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి