Share News

Caller ID: ఇన్‌బిల్ట్‌ కాలర్‌ ఐడీ

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:13 AM

టెలికామ్‌ సంస్థలు స్పామ్‌ కాల్స్‌ అరికట్టేందుకు, కాలర్‌ ఐడీ సమాచారాన్ని నేరుగా మొబైల్‌ స్క్రీన్‌పై చూపించే ‘సీఎన్‌ఏపీ’ సేవలను ప్రారంభించనున్నాయి. ప్రస్తుతానికి ఇది అదే నెట్‌వర్క్‌కు పరిమితమై ఉండగా, భవిష్యత్తులో ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్‌ ఐడీకి ప్రభుత్వం అనుమతినిస్తే మరింత విస్తరించనుంది.

Caller ID: ఇన్‌బిల్ట్‌ కాలర్‌ ఐడీ

స్పామ్‌ కాల్స్‌ నిరోధానికి థర్డ్‌పార్టీ యాప్స్‌

అవసరం లేకుండా సీఎన్‌ఏపీ సేవలు

ఇప్పటికే ట్రయల్స్‌ పూర్తిచేసిన జియో,

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు

త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు

తొలుత ఏ నెట్‌వర్క్‌కు ఆ నెట్‌వర్క్‌ పరిధిలోనే

న్యూఢిల్లీ, మార్చి 26: స్పామ్‌ కాల్స్‌(మోసపూరిత, అవాంచిత కాల్స్‌)ను నిరోధించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరు ? అనే కాలర్‌ ఐడీ సమాచారాన్ని టెలికామ్‌ సర్వీసు ప్రొవైడర్‌ సంస్థలే మొబైల్‌ స్ర్కీన్‌పై చూపెట్టబోతున్నాయి. ప్రస్తుతం ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ అప్లికేషన్ల సాయంతో మొబైల్‌ వినియోగదారులు ఈ కాలర్‌ ఐడీ సేవలు పొందుతున్నారు. ఇకపై, ఇలాంటి యాప్‌లు అవసరం లేకుండానే కాల్‌ నేమింగ్‌ ప్రెజెంటేషన్‌(సీఎన్‌ఏపీ) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం జియో, ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు హెచ్‌పీ, డెల్‌, ఎరిక్‌సన్‌, నోకియా తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దశలవారీగా సీఎన్‌ఏపీ సేవలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నాయి. అయితే, ఈ సీఎన్‌ఏపీ సేవలు ప్రస్తుతానికి ఏ నెట్‌వర్క్‌కు ఆ నెట్‌వర్క్‌ పరిధికే పరిమితం కానున్నాయి. ఎయిర్‌టెల్‌ వినియోగదారుడు.. మరో ఎయిర్‌టెల్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే.. కాల్‌ చేసింది ఎవరు ? అనే సమాచారం కనిపిస్తుంది. ఎయిర్‌టెల్‌ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం మొబైల్‌ స్ర్కీన్‌పై పేరు డిస్‌ప్లే అవుతుంది. అదే, ఎయిర్‌టెల్‌ వినియోగదారుడు జియో లేదా వీఐ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ఆ వ్యక్తి కాలర్‌ఐడీ జియో లేదా వీఐ వినియోగదారులకు కనిపించదు. టెలికామ్‌ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తేనే సీఎన్‌ఏపీ సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 05:13 AM