Share News

బొమ్మను చేసి... ఉపాధిగా మలచి

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:54 AM

‘‘సాధారణంగా ఆడపిల్లలు పొడవాటి జడ ఉన్న అమ్మాయి బొమ్మతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. నా కూతురికి కూడా అలాంటి బొమ్మ కొనాలని చాలా షాపులు తిరిగాను. ఎక్కడా దొరకలేదు. ఓ షాపులో చిన్న జడ...

బొమ్మను చేసి... ఉపాధిగా మలచి

బెంగళూరుకి చెందిన వీణా పీటర్‌కు బొమ్మలంటే ఇష్టం. కూతురు తార కోసం సరదాగా తయారు చేసిన బొమ్మ ఓ వ్యాపార సంస్థ ప్రారంభానికి నాంది పలికింది. అదే ‘తారాస్‌ డాల్‌ హౌస్‌’. పర్యావరణానికి అనుకూలంగా ఉండే రకరకాల బొమ్మలను రూపొందించడం ఈ సంస్థ ప్రత్యేకత. అంతేకాదు ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రస్తుతం కోటి రూపాయల టర్నోవర్‌ దిశగా సాగుతోంది. ఈ సంస్థకు సంబంధించి ఆసక్తికరమైన విశేషాలను వీణ ఇలా చెప్పుకొచ్చారు...

‘‘సాధారణంగా ఆడపిల్లలు పొడవాటి జడ ఉన్న అమ్మాయి బొమ్మతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. నా కూతురికి కూడా అలాంటి బొమ్మ కొనాలని చాలా షాపులు తిరిగాను. ఎక్కడా దొరకలేదు. ఓ షాపులో చిన్న జడ ఉన్న అమ్మాయి బొమ్మ కనిపిస్తే వెంటనే కొని ఇంటికి తీసుకెళ్లాను. మా అమ్మాయి చేతిలో ఆ బొమ్మ ఎక్కువ కాలం నిలవలేదు. నాకు బాధగా అనిపించింది. మార్కెట్లో దొరికే బొమ్మలన్నీ ఇలా త్వరగా విరిగిపోతుండడంతో నేనే ఒక బొమ్మను తయారు చేయాలని అనుకున్నా. ఇంట్లో ఉన్న పలుచని వస్త్రాలను ఉపయోగించి ఒక అమ్మాయి బొమ్మను తయారు చేశాను. పొడవైన ఊలు దారాలతో జడను రూపొందించాను. బొమ్మకు చక్కగా డ్రెస్‌ కుట్టి తొడిగాను. ఈ బొమ్మను చూసి మా అమ్మాయి చాలా సంతోషించింది. చాలా రోజుల వరకూ దానితోనే ఆడుకుంది కూడా. దీంతో ఇలాంటి బొమ్మల తయారీ ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. వెంటనే 2022లో తారాస్‌ డాల్‌ హౌస్‌ని ఏర్పాటు చేశాను.


తయారీ ఇలా...

అమ్మాయి బొమ్మలతో పాటు అబ్బాయి బొమ్మలను కూడా తయారు చేస్తాం. బొమ్మలను తయారు చేయడానికి నాణ్యమైన మెత్తని బట్టలను ఉపయోగిస్తాం. బొమ్మల తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు, వాటికి తొడిగే దుస్తులకోసం అవసరమయ్యే వస్త్రాలను ఢిల్లీ, సూరత్‌ల నుంచి తెప్పించుకుంటాం. చర్మం రంగు... మూడు రకాల టోన్లలో ఉండేలా బొమ్మలను రూపొందిస్తాం. అలాగే తల వెంట్రుకలను నాలుగు వేర్వేరు రంగుల్లో తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఆరు, పన్నెండు, పద్దెనిమిది అంగుళాల పొడవున్న బొమ్మలను రూపొందిస్తున్నాము. పిల్లల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ట్రావెల్‌ డాల్‌ హౌస్‌లు, స్లింగ్‌ బ్యాగ్‌ డాల్‌ క్యారియర్లు, డాల్‌ టెంట్లు, బొమ్మల వార్డ్‌రోబ్‌ సెట్‌లు కూడా తయారుచేస్తున్నాము. మా బొమ్మలకు ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో మంచి ఆదరణ ఉంది.


పర్యావరణ హితం...

బొమ్మల తయారీలో ప్లాస్టిక్‌, హానికరమైన రసాయన రంగులను ఉపయోగించము. స్టెన్సిల్‌ ట్రేసింగ్‌, కత్తిరించడం, కుట్టడం, తలకు వెంట్రుకలు అతికించడం, దుస్తులు కుట్టడం లాంటి ప్రక్రియలన్నింటినీ అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తాము. పిల్లలు ఎంతకాలం ఆడుకున్నప్పటికీ బొమ్మలు మన్నికగా ఉండేలా రూపొందిస్తాము.

మహిళా సాధికారతకు...

ప్రస్తుతం నెలవారీ 200 నుంచి 300 వరకు బొమ్మలు అమ్ముడవుతున్నాయి. వీటి నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వస్తోంది. త్వరలో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నాము. అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాము. దీనికి కొంత సమయం పట్టవచ్చు. తారాస్‌ డాల్‌ హౌస్‌ సంస్థ మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తుంది. టైలరింగ్‌, బొమ్మల తయారీ, మార్కెటింగ్‌ విభాగాల్లో పూర్తిగా మహిళలే పనిచేస్తున్నారు. సంస్థ సహవ్యవస్థాపకుల్లో ఒకరు తప్ప మొత్తం బృంద సభ్యులంతా మహిళలే. నా అభిరుచి మరికొంతమంది మహిళలకు ఉపాధి మార్గం అయినందుకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంది. భవిష్యత్తులో మరింతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తా.’’

ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:54 AM