రక్షించేది విశ్వాసమే
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:23 AM
జపాన్‌లో బహుళ ప్రచారంలో ఉన్న ఈ కథను యదార్థమైనదని చెబుతారు. యుద్ధవీరుడైన (సమురై) ఒక యువకుడు ఉండేవాడు. అతను ఎక్కడికి వెళ్ళినా...

సద్బోధ
జపాన్‌లో బహుళ ప్రచారంలో ఉన్న ఈ కథను యదార్థమైనదని చెబుతారు. యుద్ధవీరుడైన (సమురై) ఒక యువకుడు ఉండేవాడు. అతను ఎక్కడికి వెళ్ళినా... ఒరలో కత్తి ఉండేది. అతనికి వివాహమైన తరువాత.. కొన్ని రోజులపాటు ఎక్కడైనా ఆనందంగా గడిపి వద్దామని ఆ దంపతులు అనుకున్నారు. సమీపంలో ఉన్న ఒక అందాల దీవిని దానికోసం ఎంచుకున్నారు. ఒక పడవలో వారిద్దరూ బయలు దేరారు. కబుర్లు చెప్పుకుంటూ, హాయిగా, సంతోషంగా వారు ప్రయాణిస్తున్నారు. కొంతదూరం ఈ ప్రయాణం బాగానే సాగింది. కానీ హఠాత్తుగా తుపాను మొదలయింది. రానురానూ వాతావరణం భీకరంగా మారింది. వారు ప్రయాణిస్తున్న పడవ అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. గాలి, వాన తీవ్రమయ్యాయి. పడవ ఏ క్షణంలోనైనా మునిగిపోయే పరిస్థితిలో ఉంది.
ఆ యువకుని భార్యకు భయం వేసింది. తీవ్రంగా వణుకుతోంది. అయితే తన భర్తలో ఎలాంటి ఆందోళన లేకపోవడాన్ని ఆమె గమనించింది. తాము చావు కోరల్లో ఉన్నా అతను ప్రశాంతంగా... పడవ ఎక్కినప్పుడు ఉన్నట్టే ఉండడం చూసి ‘‘ఏమండీ! ఏమైంది మీకు? ఏ ఊహాలోకంలో విహరిస్తున్నారు? ఈ లోకంలోకి వచ్చి చుట్టూ ఎలా ఉందో చూడండి. భయంకరమైన తుపానులో మనం ఇద్దరం చిక్కకుపోయాం. మన పడవ ఎప్పుడైనా మునిగిపోవచ్చు. మనకు ఇవే ఆఖరి క్షణాలు కావచ్చు. మన తొలి ప్రయాణం ఇలా విషాదాంతం అవుతుందనుకోలేదు. ఇలాంటి భయంకరమైన క్షణాల్లో... మనం ప్రాణాలతో ఎలా బయటపడాలో ప్రయత్నించకుండా, కనీసం ఆలోచించకుండా ఊరకే ప్రశాంతంగా కూర్చున్నారేమిటి?’’ అంది నిష్టూరంగా.
వెంటనే ఆ యువకుడు తన ఒరలోని కత్తిని తీసి ఆమె మెడ మీద పెట్టాడు. అలాంటి వాతావరణంలో కూడా ఆమె నవ్వడం మొదలుపెట్టింది.
‘‘ఎందుకు నవ్వుతున్నావు? నీకు భయంగా లేదా? కత్తి ఎంత పదునుగా ఉందో నీకు తెలీదా? ఇలాంటి కత్తి నీ కంఠం దగ్గర ఉందనే విషయం మరచిపోయావా? ఒక్కసారి దాన్ని కదిలిస్తే చాలు, నీ కంఠం తెగుతుంది. నీ పంచప్రాణాలూ పంచభూతాల్లో కలిసిపోతాయి. అంత పదునైన కత్తి ఇది’’ అన్నాడు.
అప్పుడు ఆమె ‘‘అది ఎంత పదునైన కత్తి అయినా, ఎంత భయంకరమైన కత్తి అయినా మీ చేతిలో... అంటే నన్ను అమితంగా ప్రేమించే నా భర్త చేతిలో ఉంది. కాబట్టి నాకెందుకండీ భయం’’ అంది ఆ యువకుడు తన కత్తిని ఒరలో పెట్టేసి... ‘‘ఆ కత్తి నా చేతిలో ఉంటే నీకు భయం కలగనట్టే... ఈ తుపానును చూసి నాకూ భయం వేయడం లేదు. పదునైన కత్తి కన్నా ఈ తుపాను ఎంతో భయంకరమైనది, ప్రమాదకరమైనదీ కావచ్చు. కానీ అది నేను ప్రేమించే, నన్ను అంతకన్నా అమితంగా ప్రేమించే నా తండ్రి అయిన దైవం అధీనంలో, ఆయన ఆజ్ఞకు లోబడే ఉంటుంది. అలాంటప్పుడు నాకు, నా అర్థాంగిగి ఏ ప్రమాదమైనా ఎలా సంభవిస్తుంది?’’ అని ప్రశ్నించాడు. భక్తులను రక్షించేది భగవంతుడి పట్ల ఉండే ఇలాంటి దృఢమైన విశ్వాసమే. అదే ప్రహ్లాదుణ్ణి ఎన్నో ఆపదల నుంచి రక్షించిందని భాగవతం చెబుతోంది.
రాచమడుగు శ్రీనివాసులు
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News