యుగయుగానికి ఓ రాముడు
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:33 AM
పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఇది తెలిసిన రాముడు మరణిద్దామనుకున్నాడు. ‘‘యమ! నువ్వు వచ్చి నన్ను వైకుంఠానికి తీసుకువెళ్ళు’’ అని కోరాడు. కానీ యముడు అయోధ్యకు వచ్చి రాముడిని తీసుకువెళ్లటానికి...

పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఇది తెలిసిన రాముడు మరణిద్దామనుకున్నాడు. ‘‘యమ! నువ్వు వచ్చి నన్ను వైకుంఠానికి తీసుకువెళ్ళు’’ అని కోరాడు. కానీ యముడు అయోధ్యకు వచ్చి రాముడిని తీసుకువెళ్లటానికి ఇష్టపడలేదు. కారణం హనుమంతుడు. ఆయన ఎప్పుడూ అయోధ్యను, రాముడిని కాపలా కాస్తూ ఉంటాడు. ఇది రాముడికి తెలిసింది. యముడు రావాలంటే హనుమంతుడు అయోధ్యలో ఉండకూడదు.దీనికి రాముడు ఉపాయం ఆలోచించాడు. తన ఉంగరాన్ని తీసి తన మందిరంలోని ఒక చీలికలో పడేశాడు. హనుమను పిలిచి ‘‘ఉంగరం పడిపోయింది. సూక్ష్మ రూపంలో వెళ్లి తీసుకురా’’ అని ఆజ్ఞాపించాడు. హనుమ చిన్న కందిరీగలా మారి చీలికలో దూరాడు. ఆ చీలిక ఒక సొరంగంలా మారింది. ఆ సొరంగం నాగలోకానికి నేరుగా చేరింది. హనుమంతుడు నాగలోక రాజైన వాసుకి దగ్గరకు వెళ్లి ‘‘నా రాముడి ఉంగరం పడిపోయి నీ లోకానికి చేరింది. దానిని తీసుకువెళ్లటానికి వచ్చా’’ అన్నాడు. వాసుకి చిరునవ్వు నవ్వి హనుమంతుడిని నాగలోకం మధ్యలోకి తీసుకువెళ్లాడు. అక్కడ కొన్ని వేల ఉంగరాలు గుట్టగా ఉన్నాయి. ‘‘ఈ గుట్టలో రాముడి ఉంగరం పడి ఉంటుంది. వెతుకు’’ అన్నాడు. ‘ఈ గుట్టలో రాముడి ఉంగరం ఎలా వెతికాలి?’ అనుకుంటూ హనుమ గుట్టపైకి వెళ్లాడు. అక్కడ రాముడి ఉంగరం కనిపించింది. హనుమంతుడికి విపరీతమైన ఆనందం కలిగింది. ఆ ఉంగరాన్ని తీసుకొని.. మరో ఉంగరం వైపు చూశాడు. అది కూడా రాముడి ఉంగరమే! ఒక్కొక్కటి చూస్తుంటే- అన్నీ రాముడి ఉంగరాలే! హనుమంతుడికి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు వాసుకి- ‘‘హనుమ! నువ్వు చూస్తున్నది నిజమే. కానీ ఇదంతా ఒక మాయ. ఈ ప్రపంచం చావు- పుట్టుకలనే చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఒక సారి చక్రం తిరిగితే దానిని కల్పం అంటారు.
ఒకో కల్పంలోను నాలుగు యుగాలు ఉంటాయి. ఇది త్రేతా యుగం. దీనిలో రాముడు అయోధ్యలో పుట్టాడు. ఆయన చేతి ఉంగరం జారి సర్పలోకానికి వచ్చింది. దానిని వెతుక్కుంటూ ఒక వానరం వచ్చింది. ఈ లోపులో భూమిపై రాముడు మరణిస్తాడు. ఇలాంటి లక్షల కల్పాలు తిరుగుతూ ఉంటాయి. గుట్టలో ఉన్న ఉంగరాలే దీనికి నిదర్శనం. ఇది ఎంత కాలం జరుగుతుందో నాకు తెలియదు..’’ అన్నాడు. అప్పుడు హనుమంతుడికి రాముడు తనను ఉంగరం వెతకమని ఎందుకు పంపాడో అర్ధమయింది. రాముడు మరణిస్తాడు. ప్రపంచం అంతమయిపోతుంది. మళ్లీ కొత్త ప్రపంచం పుడుతుంది. దానిలో మళ్లీ రాముడు పుడతాడు. ఈ సృష్టి రహస్యం హనుమంతుడికి అర్ధమయిన తర్వాత మనసుకు ప్రశాంతత కలిగింది.
(కాలచక్రం మన భారతీయ తాత్విక చింతనలో ఒక ముఖ్యమైన అధ్యాయం. రాముడు ఒక ప్రాంతానికో.. ఒక ప్రాంత చరిత్రకో సంబంధించినవాడు కాదు. రాముడి పుట్టుపూర్వోత్రాలు కనుగొనటం కన్నా ఆ అవతారం వెనుకున్న తాత్విక చింతనను తెలియజేయటానికి ఈ కథను చెబుతారు.)
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News