Tasty Jackfruit Recipes: నోరూరించే పనస రుచులు
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:23 AM
పనసతో పలు రుచికరమైన వంటకాలు తయారు చేయవచ్చు. పనసకాయ దమ్ బిర్యానీ, పనస తొనల హల్వా, పనస చిప్స్ వంటి వంటకాల తయారీ విధానాలు, వాటి ప్రయోజనాలు మరియు జాగ్రత్తలు ఈ నోట్లో ఉన్నాయి. పనస గింజలను తీసివేసి వాటిని వంటలలో ఉపయోగించడం, వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఇష్టంగా రుచి చూడవచ్చు

వంటిల్లు
పనస తొనలను ఇష్టంగా తినని వారు ఉండరు. ఇవి వేసవి తాపాన్ని హరిస్తాయి. వడదెబ్బ నుంచి
కాపాడతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే పనసతో రుచికరమైన వంటకాలు కూడా
చేసుకోవచ్చు. వాటిలో కొన్ని విభిన్న రుచులను మీకోసం అందిస్తున్నాం...
పనసకాయ దమ్ బిర్యానీ
కావాల్సిన పదార్థాలు
లేత పనసకాయ- అర కేజీ, బాస్మతీ బియ్యం- అర కేజీ, బంగాళ దుంపలు- రెండు, టమాటాలు- నాలుగు, ఉల్లిపాయలు- రెండు, పచ్చి మిర్చి- ఎనిమిది, పెరుగు- రెండు కప్పులు, పసుపు- పావు చెంచా, లవంగాలు- ఆరు, యాలకులు- రెండు, జాపత్రి- ఒక పెద్ద ముక్క, దాల్చిన చెక్క- రెండు చిన్న ముక్కలు, మరాఠీ మొగ్గ- ఒకటి, అనాస పువ్వు- ఒకటి, బిర్యానీ ఆకులు- రెండు, రాతిపువ్వు- కొద్దిగా, షాజీరా- కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండున్నర చెంచాలు, నూనె- అయిదు చెంచాలు, నెయ్యి- అయిదు చెంచాలు, ఉప్పు- రెండున్నర చెంచాలు, ధనియాల పొడి- ఒక చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, గరం మసాలా పొడి- ఒక చెంచా, కుంకుమ పువ్వు- అర చెంచా, పుదీనా- రెండు రెమ్మలు, కొత్తిమీర- ఒక కట్ట, కారం- మూడు చెంచాలు, నిమ్మకాయ- సగం చెక్క, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
బాస్మతీ బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. ఆలుగడ్డలను పెద్ద ముక్కలుగా కోయాలి. టమాటాలను సన్నగా తరగాలి. ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను చీలికల మాదిరి కోయాలి. కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. కుంకుమపువ్వును రెండు చెంచాల పాలలో నానబెట్టాలి. ముప్పావు వంతు ఉల్లిపాయ చీలికలను నూనెలో ఎర్రగా వేపి ఉంచుకోవాలి.
చేతులకు ఆముదం లేదా కొబ్బరినూనె రాసుకోవాలి. చాకుతో పనసకాయ తొక్కు తీయాలి. కాయను నీళ్లతో కడిగి పెద్ద ముక్కలుగా కోసి గింజలు తీయాలి.
వెడల్పాటి గిన్నెలో పనసకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చి మిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు కొన్ని, పెరుగు, రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఒకటిన్నర చెంచా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పుదీనా ఆకులు, కారం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దగ్గరకు ఒత్తిపెట్టి రెండు గంటలు నాననివ్వాలి.
స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి నిండుగా నీళ్లు పోసి లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, రాతి పువ్వు, షాజీరా, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెంచా నూనె, ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. అరగంట తరవాత ఇందులో నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి మెల్లగా కలపాలి. పెద్ద మంట మీద ఉడకనివ్వాలి.
మరో స్టవ్ మీద మందపాటి పెద్ద గిన్నె పెట్టి అందులో నాలుగు చెంచాల నూనె, నాలుగు చెంచాల నెయ్యి వేసి అవి వేడెక్కాక నానబెట్టిన పనసకాయ ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద మూడు నిమషాలు మగ్గనివ్వాలి. తరవాత మూత తీసి ఈ మిశ్రమం మీద సగానికి పైగా ఉడికిన బాస్మతీ బియ్యాన్ని స్టయినర్ సహాయంతో తీసుకుని ఒక పొరలా పరచాలి. దీని మీద వేయించిన ఉల్లిపాయ చీలికలు, కొత్తిమీర తరుగు చల్లి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించాలి.
తరవాత మూత తీసి ముప్పావు వంతు ఉడికిన బాస్మతీ బియ్యాన్ని పొరలా పరచాలి. దీని మీద కూడా వేయించిన ఉల్లిపాయ చీలికలు వేసి రెండు నిమిషాలు మగ్గించాలి. తరవాత పూర్తిగా ఉడికిన బాస్మతీ అన్నాన్ని పైన పొరలా వేసి మరుగుతున్న నీళ్లు మూడు గంటెలు పోయాలి. దీనిపైన మరికొన్ని వేయించిన ఉల్లిపాయ చీలికలు, కొత్తిమీర తరుగు చల్లి వెంటనే కుంకుమపువ్వు నానబెట్టిన పాలు చిలకరించాలి. మూతపెట్టి ఆవిరి బయటికి వెళ్లకుండా నీళ్లలో తడిపిన వస్త్రాన్ని కప్పి ముప్పావు గంటసేపు మగ్గించాలి. తరవాత స్టవ్ మీద నుంచి దించి మూత తీసి అక్కడక్కడా చెంచాతో రంధ్రాలు చేసి వాటిలో బిరియానీ నీళ్ల చుక్కలు, గులాబీ నీళ్ల చుక్కలు వేయాలి. అయిదు నిమిషాల తరవాత వేరే గిన్నెలోకి బోర్లించి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
జాగ్రత్తలు
బిర్యానీ వండడానికి మందంగా ఉన్న గిన్నెను మాత్రమే ఉపయోగించాలి. లేదంటే అడుగు భాగం మాడిపోతుంది.
బిర్యానీని ఓ పక్క నుంచి తీస్తూ వడ్డించాలి. అప్పుడే పనసకాయ ముక్కలు, కలర్ రైస్, వైట్ రైస్ పొరలుగా
కనిపిస్తాయి.
పనసకాయను కోసిన తరవాత లోపలి భాగం గట్టిగా అనిపిస్తే దాన్ని తీసివేయడం మంచిది.
పనస చిప్స్
కావాల్సిన పదార్థాలు
పనస తొనలు- 12, పల్లీలు- అర కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, కారం- కొద్దిగా, నూనె- తగినంత
తయారీ విధానం
పనస తొనల నుంచి గింజలు వేరుచేయాలి. తొనలను సన్నని చీలికల మాదిరి కోసి కొద్దిసేపు ఆరబెట్టాలి.
స్టవ్ మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసి వేడి చేయాలి. ఇందులో పల్లీలు, కరివేపాకు వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీయాలి. తరవాత నూనెలో చిటికెడు పసుపు, ఉప్పు వేయాలి. వెంటనే పనస చీలికలు కూడా వేసి అవి బంగారు రంగులోకి మారి గలగలలాడే వరకు వేయించి ఓ పళ్లెంలోకి తీయాలి. వీటిలో వేయించిన పల్లీలు, కరివేపాకు, ఉప్పు, కారం కలిపి సర్వ్ చేయాలి.
జాగ్రత్తలు
పచ్చి పనసకాయ తొనలు తీసుకుంటే చిప్స్ రుచిగా ఉంటాయి.
పల్లీలు, కరివేపాకులను జల్లి మూకుడులో వేసి వేడినూనెలో ముంచితే అవి మాడకుండా వేగుతాయి.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News