Success Story: లోపం... శాపం కాకూడదని..!
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:59 AM
మగపిల్లాడు కావాలనుకొంటే ఆడపిల్ల పుట్టింది. అదికూడా వినికిడి శక్తి లేని పిల్ల. ఇంట్లో వద్దు పొమ్మని కన్నతండ్రి చీదరించుకున్నాడు. అయినవాళ్లు, బంధువులు దూరం పెట్టారు.

సంకల్పం
మగపిల్లాడు కావాలనుకొంటే ఆడపిల్ల పుట్టింది. అదికూడా వినికిడి శక్తి లేని పిల్ల. ఇంట్లో వద్దు పొమ్మని కన్నతండ్రి చీదరించుకున్నాడు. అయినవాళ్లు, బంధువులు దూరం పెట్టారు. కానీ అమ్మ అండతో సామాజిక అసమానతలు దాటి... ఉన్నత చదువులు చదివింది. నాట్యం, సంగీతం... అన్నింటా అద్భుతాలు చేస్తోంది. తనలాంటివారికి ప్రేరణగా నిలుస్తూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న 33 ఏళ్ల రచనా షా కథ ఇది.
‘‘నాది భిన్నమైన కథ. కన్నవారు ఉన్నా అనాథలా ఇంటికి దూరంగా బతికాను. నాకోసం అమ్మ అన్నిటినీ వదిలేసి కట్టు బట్టలతో బయటకు వచ్చింది. అమ్మమ్మ... అమ్మను, నన్నూ చేరదీసింది. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు వారిద్దరే కారణం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మధ్యతరగతి కుటుంబం మాది. అమ్మ, నాన్న ఇద్దరూ విద్యావంతులు. మా అమ్మ డాక్టర్ జ్ఞానేశ్వరీషా కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేసింది. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ విభాగం అధిపతిగా పని చేస్తోంది. నాన్న ఎలక్ర్టికల్ ఇంజనీర్. కానీ నేను పుట్టినప్పుడు మా ఇంట్లో సంబరాలు చేసుకోలేదు. అబ్బాయి కావాలని పూజలు చేస్తే అమ్మాయి పుట్టడం ఒక కారణమైతే, నేను పుట్టు బధిరురాలిని కావడం మరో కారణం.
‘అలాంటి కూతురు నాకొద్దు...’
చావు పుట్టుకలు ఎవరి చేతుల్లోనూ ఉండవని తెలిసి కూడా నాన్న నన్ను చీదరించుకున్నారు. చెవిటిదాన్నని నా పట్ల వివక్ష చూపారు. నాన్నతో పాటు ఆయన తరుఫు బంధువుల వరుస కూడా అదే. ‘వైకల్యంతో పుట్టిన ఆడపిల్లకు ఇంట్లో స్థానం లేదు’ అంటూ తేల్చేశారు. మరి ఎక్కడ ఉండాలి? ‘ఏదో ఒక ఆశ్రమంలో పడేయండి’... ఇదీ సమాధానం. అమ్మ నా కోసం ఇంటిని, భర్తను వదిలేయడానికి సిద్ధపడింది. అప్పటికి వాళ్ల పెళ్లయ్యి ఏడాదిన్నరే. కానీ మరో ఆలోచన లేకుండా అమ్మ అన్నిటినీ త్యాగం చేసి, నన్ను తీసుకొని, బయటకు వచ్చేసింది. నాకున్న లోపం గురించి ఇకపై ఎవరూ నోరెత్తకుండా నన్ను ఉన్నతంగా పెంచాలని ఆ క్షణం దృఢంగా నిశ్చయించుకుంది.
కొత్త వెలుగు...
నిశిరాత్రి చీకట్లు చీల్చుకొంటూ ఉదయం కొత్త వెలుగుతో వస్తుంది. ఆ నమ్మకంతోనే నా జీవితాన్ని ప్రారంభించాను. నాపై నాకంటే మా అమ్మకు నమ్మకం ఎక్కువ. అందుకు అమ్మమ్మ మద్దతు దొరికింది. సామాజిక అసమానతలు, కట్టుబాట్లు తన కూతురి భవిష్యత్తును నిర్దేశించకూడదన్నది అమ్మ సంకల్పం. అందులో భాగంగా 1995లో తొలిసారి నాకు హియరింగ్ డివైజ్ కొని తెచ్చింది. అధునాతన సాంకేతికతో కూడిన మల్టీచానల్, డిజిటల్ డివైజ్‌లు మార్కెట్‌లోకి రాగానే అవి మా ఇంట్లో ఉండేవి. నా ఎదుగుదలలో వాటి పాత్ర అమూల్యం. అయితే నా వైకల్యం వల్ల చాలాచోట్ల అవహేళనలు ఎదుర్కొన్నా. వినికిడి శక్తిలేనివారు ఈ ప్రపంచంతో పోటీ పడలేరని ఎంతోమంది ముఖం మీదే అన్నారు. ఆ క్షణం బాధ కలిగినా, క్రమంగా నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. నన్ను చులకన చేసినవారికి, నా సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడినవారికి, నన్ను ఇంటి నుంచి గెంటేసిన కన్న తండ్రికి గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నా.
ఒకటి కాదు... ఎన్నో...
నాకు మాటలు రావడమే కష్టమన్నారు. కానీ మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నా. వాటిల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నా. నాలాంటివారికి చదువే వంటబట్టదన్నారు. చదువుతో పాటు భరతనాట్యం చేర్చుకున్నా. అదీ ఐదేళ్ల కోర్సు మూడేళ్లలోనే పూర్తి చేశా. పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాను. హిందుస్థానీ సంగీతం అభ్యసించాను. హార్మోనియం వాయిస్తాను. సంబంధిత పరీక్షలు కూడా పూర్తి చేశాను. నా ఈ తపన కేవలం బతకడానికే కాదు... విజయం వైపు అడుగులు వేయడానికి. నలుగురిలో నన్ను నేను ప్రత్యేకంగా నిలపుకోవడానికి. నాలాంటివారికి నేనొక స్ఫూర్తిమంత్రం కావాలి. అన్నిటికీ మించి మా అమ్మ, అమ్మమ్మ నన్ను చూసి గర్వపడాలి.
వారిలో ధైర్యం నింపేందుకు...
చదువుకొనే రోజుల్లో నాకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తానంటే వద్దన్నాను. అది నా వైకల్యాన్ని గుర్తు చేస్తుంది. సాధారణ విద్యార్థులతో పోటీపడి చదివాను. 2014లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఆడపిల్లలకు, వైకల్యం గల పిల్లలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఖాళీ సమయాల్లో వారికి పాఠాలు చెబుతున్నాను. తమలోని లోపాలను చూసుకొని వెనకడుగు వేయకుండా, దాన్ని ఒక సవాలుగా తీసుకొని ప్రయత్నిస్తే ఎంతటి లక్ష్యమైనా దరి చేరుతుంది. ఈ విషయం మరింత అర్థమయ్యేలా వీధి నాటకాలు, నాట్య ప్రదర్శనలు ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎదిగితే సరిపోదు... నా చుట్టూ ఉన్నవారు కూడా అభివృద్ధి పథంలో పయనించాలి. అదే నా సంకల్పం.’’
‘రోల్‌మోడల్...’
వినికిడిశక్తి లేని ఒక అమ్మాయిగా నాకు కొన్ని పరిమితులు ఉండవచ్చు. కానీ నా ప్రతిభ, సామర్థాలతో వాటిని అధిగమించాను. ఇప్పుడు నేను డ్యాన్స్ చేయగలను. సంగీతం ఆలపించగలను. బొమ్మలు గీయగలను. ఇంకా ఎంబ్రయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్... అన్నిట్లో నైపుణ్యం సంపాదించాను. నా ప్రతిభ, సామాజిక స్పృహను గుర్తించి గుజరాత్ ప్రభుత్వం ‘సర్వశిక్ష అభియాన్’ ప్రచార కార్యక్రమాలకు నన్ను రోల్‌మోడల్‌గా నియమించింది. అలాగే ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. ‘రోల్‌మోడల్ హియరింగ్ ఇంపెయిర్డ్ ఫిమేల్’ అవార్డును నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదగా అందుకోవడం నా జీవితంలోనే ఒక మధురమైన ఘట్టం. యూకేలోని ‘వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్ ఫైర్
Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే
CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..