Share News

Summer Drinks: కమ్మని మజ్జిగతో... చల్ల చల్లగా...

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:28 AM

వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకీ ఎండ వేడి పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగితే ప్రాణం లేచొచ్చినట్లు ఉంటుంది.

Summer Drinks: కమ్మని మజ్జిగతో... చల్ల చల్లగా...

కమ్మని మజ్జిగతో... చల్ల చల్లగా...

వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకీ ఎండ వేడి పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగితే ప్రాణం లేచొచ్చినట్లు ఉంటుంది. అందుకే ఈ వేసవిలో మీ దాహార్తిని తీర్చేందుకు విభిన్న మజ్జిగ రుచులను అందిస్తున్నాం...

స్వీట్‌ లస్సీ

కావాల్సిన పదార్థాలు

పెరుగు- రెండు కప్పులు, పంచదార- అర కప్పు, యాలకుల పొడి- అర చెంచా, కుంకుమ పువ్వు- పావు చెంచా, గులాబీ నీళ్లు- ఒక చెంచా, చల్లటి నీళ్లు- అర గ్లాసు, ఐస్‌ క్యూబ్స్‌- ఆరు

తయారీ విధానం

ఒక కప్పులో ఒక చెంచా నీళ్లు, కుంకుమ పువ్వు వేసి అయిదు నిమిషాలు నాననివ్వాలి.

ఒక వెడల్పాటి గిన్నెలో పెరుగు, పంచదార వేసి బీటర్‌ సహాయంతో బాగా బీట్‌ చేయాలి. పంచదార మొత్తం కరిగాక ఇందులో యాలకుల పొడి, కుంకుమపువ్వు మిశ్రమం, గులాబీ నీళ్లు, చల్లటి నీళ్లు, ఐస్‌ క్యూబ్స్‌ వేసి మరోసారి బీట్‌ చేయాలి. తరవాత ఈ మిశ్రమాన్ని గాజు గ్లాసులో పోసి పైన కుంకుమ పువ్వు రేకులు, పిస్తా తరుగు చల్లితే స్వీట్‌ లస్సీ సిద్దం అవుతుంది.

జాగ్రత్తలు

కమ్మగా ఉండే గడ్డ పెరుగుని తీసుకుంటే లస్సీ రుచికరంగా తయారవుతుంది.

ఇందులో ఒక చెంచా కోవా కలిపితే మరింత కమ్మగా ఉంటుంది.

పంచదారకు బదులు బెల్లం పొడి లేదా తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు.


మసాలా మజ్జిగ

కావాల్సిన పదార్థాలు

అల్లం- ఒక చిన్న ముక్క, పచ్చి మిర్చి- ఒకటి, పుదీనా ఆకులు- అయిదు, కొత్తిమీర- రెండు రెమ్మలు, మిరియాల పొడి- పావు చెంచా, జీలకర్ర పొడి- పావు చెంచా, పెరుగు- ఒక గంటె, ఉప్పు- తగినంత, చల్లటి నీళ్లు- ఒక గ్లాసు, నిమ్మరసం- ఒక చెంచా

తయారీ విధానం

పచ్చిమిర్చి, పుదీనా, అల్లం, కొత్తిమీరలను నీళ్లతో శుభ్రంగా కడగాలి. కొత్తిమీరను సన్నగా తరగాలి.

మిక్సీ గిన్నెలో పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరవాత ఇందులో చల్లటి నీళ్లు పోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఇలా తయారైన మసాలా మజ్జిగను గాజు గ్లాసులో పోయాలి. ఇందులో నిమ్మరసం వేసి కలపాలి. దీనిపైన చిటికెడు జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేస్తే బాగుంటుంది.

జాగ్రత్తలు

గ్రైండ్‌ చేసిన మసాలా మజ్జిగను కావాలనుకుంటే వడబోసుకోవచ్చు.

ఈ మజ్జిగ ఘాటుగా ఉందనిపిస్తే అందులో కొన్ని చల్లటి నీళ్లు, కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు.

dshf.jpg

షాహీ లస్సీ

కావాల్సిన పదార్థాలు

ఖర్జూరాలు- తొమ్మిది, బాదం పప్పులు- పదమూడు, జీడిపప్పులు- పది, పిస్తా పప్పులు- పది, ఎండు ద్రాక్ష- ఆరు, యాలకుల పొడి- పావు చెంచా, కుంకుమ పువ్వు- పావు చెంచా, పెరుగు- ఒక గరిటెడు, నీళ్లు- ఒక గ్లాసు, గులాబీ రేకులు- అయిదు

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో ఖర్జూరాలు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టాలి.

ఒక కప్పులో ఒక చెంచా నీళ్లు తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి ఉంచాలి.

మిక్సీ గిన్నెలో పెరుగు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌, కుంకుమపువ్వు మిశ్రమం, యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరవాత ఇందులో నీళ్లు పోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని గాజు గ్లాసులో పోసి పైన పిస్తా తరుగు, గులాబీ రేకులు చల్లితే రుచికరమైన షాహీ లస్సీ తయారవుతుంది. చల్లగా తాగాలనుకుంటే ఫ్రిజ్‌లో అరగంటసేపు పెడితే చాలు.

జాగ్రత్తలు

పుల్లగా కాకుండా తియ్యగా ఉండే పెరుగు తీసుకుంటే షాహీ లస్సీ రుచిగా ఉంటుంది.

డ్రైఫ్రూట్స్‌ని రాత్రంతా నీళ్లలో నానబెడితే లస్సీ రుచి పెరుగుతుంది.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 12:29 AM