KCR: తెలంగాణ సంపదపై గుంటనక్కల్లా కన్నేశారు
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:22 AM
బెల్లం ఉన్నచోటకు ఈగలు వచ్చినట్లు.. తెలంగాణను దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సంపదపై గుంటనక్కల మాదిరిగా కన్నేసి ఉన్నారు.

మంచిగ పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడా!?
నన్ను ఓడించి ఇప్పుడు ‘కేసీఆర్ అన్నా’ అంటే ఎలా!?
కత్తి ఒకరికిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా!?: కేసీఆర్
హైదరాబాద్, మర్కుక్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘బెల్లం ఉన్నచోటకు ఈగలు వచ్చినట్లు.. తెలంగాణను దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సంపదపై గుంటనక్కల మాదిరిగా కన్నేసి ఉన్నారు. ఇప్పుడున్న పాలకులు సరిగా చేస్తలేరట. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చేసారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడా!?’’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని, పదేళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఉన్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 200 మందితో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 180 కిలోమీటర్ల మేర ‘గోదావరి కన్నీటి గోస’ పేరిట పాదయాత్ర చేశారు. ఈ బృందంతో శనివారం ఎర్రవెల్లిలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు తథ్యమని, రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘నోటికొచ్చిన హామీలిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. దీనిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తుంటే ‘కేసీఆర్ అన్నా ఎక్కడున్నావ్.. రమ్మం’టూ బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజలు నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఏం చేయాలి? కత్తి ఒకరికిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా సాధ్యమవుతుంది!? ఆనాడు అధికారం ఇచ్చింది ప్రజలే. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కూడా ప్రజలే. సరైన పాలకుడిని ఎన్నుకునేటప్పుడే ప్రజలు ఆలోచించాలి. భవిష్యత్తులో ప్రజలు తీర్పు దిశగా ఆలోచించాలి’’ అని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ శ్రేణులు పోరాడాలని, అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలని అన్నారు.
సన్నాసులు, దద్దమ్మలు అన్నది అందుకే
ఇన్నాళ్లూ లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లివ్వాలనే ప్రాధాన్యాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య నెలకొందన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటినుంచీ ఈ ప్రాంత నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూసే అవలక్షణంగా మార్చుకున్నారు. అందుకే తెలంగాణలో సాగునీటి వనరులను కల్పించలేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. ఆ ఆవేదనతో, వాళ్ల తెలివితక్కువతనం చూసి, ఉద్యమకాలంలో వాళ్లను దద్దమ్మలు, సన్నాసులు అని తిట్టాను. అంతే తప్ప, ఎవరిపైనా నాకు వ్యక్తిగత కోపం లేదు’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు సాగు, తాగునీరు ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు నీళ్లు అందించాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సేనంటూ సాయుధ పోరాట కాలం నుంచి నేటిదాకా పలు సందర్భాల్లో కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రె్‌సకు 8 మంది ఎంపీలను ఇచ్చారని, వాళ్లు ఒక్క ఏకానైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. అదే పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలుంటే రాష్ట్ర హక్కులను కాపాడుకునేవారని అన్నారు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదని, కేసీఆర్ ఎప్పటికీ ఉండడని, అందరూ ఒక్కొక్క కేసీఆర్‌లా తయారు కావాలని పిలుపునిచ్చారు.