Makeup Tips for Youthful Look: యవ్వనంగా కనిపించాలంటే
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:04 AM
మేకప్‌తో వయసు దాచడం కోసం సిలికాన్ ప్రైమర్, మాయిశ్చరైజర్, ఫౌండేషన్, బ్లష్, హైలైటర్ వంటి చిట్కాలు పాటించడం వల్ల వృద్ధాప్య ఛాయలు దాచబడతాయి మరియు చర్మం సాఫీగా కనిపిస్తుంది

మేకప్
మేకప్‌తో వయసును కొంతమేరకే కప్పిపుచ్చగలం. అందుకోసం తెలివైన మెలకువలు పాటించాలి. లేదంటే వయసు దాచలేకపోగా, వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా బహిర్గతమయ్యే ప్రమాదం ఉంటుంది. మేకప్ మాటున ముడతలను దాచడం కోసం ఇవిగో ఈ చిట్కాలు ప్రయోగించండి. కనురెప్పలు, దవడలు, మెడ.. ఇలా కొన్ని చోట్ల చర్మం సాగిపోయి వృద్ధాప్య ఛాయలు బయల్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు...
సిలికాన్ ప్రైమర్: మేకప్‌కు ముందు సిలికాన్ ప్రైమర్ పూసుకోవాలి. దీంతో చర్మం పైని సన్నని గీతలు చర్మంలో కలిసిపోతాయి. టింటెడ్ ప్రైమర్ ఎంచుకుంటే చర్మ రంథ్రాలను కూడా దాచేయవచ్చు. ఇందుకోసం ముఖం, మెడ మీది ముదురు రంగు ప్రదేశాల్లో ప్రైమర్ పూసి, తడి స్పాంజ్‌తో అద్దుకోవాలి. అలాగే కన్‌సీలర్‌ను నేరుగా ఉపయోగించకుండా, అంతకంటే ముందు కలర్ కరెక్టర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
మాయిశ్చరైజర్: మెడ మీద ముడతలు ఏర్పడకుండా ఉండాలంటే, తప్పనిసరిగా మెడకూ మాయిశ్చరైజర్ పూసుకుంటూ ఉండాలి. అప్పుడే మెడ మీద గీతలు, మచ్చలు, ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.
ఫౌండేషన్: లిక్విడ్ లేదా క్రీమ్ ఎలాంటి ఫౌండేషన్‌ను ఎంచుకున్నా, ముఖం, మెడ మీద సమానంగా పరుచుకునేలా తడిపిన స్పాంజీతో అద్దుకోవాలి. అలాగే, ఫౌండేషన్‌ను పరిమితంగానే పూసుకోవాలి. లేదంటే ముడతల్లో ఇరుక్కుపోయి, వృద్ధాప్య ఛాయలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
బ్లష్: చెక్కిళ్ల మీద అద్దుకునే బ్లష్‌ను కొద్ది పరిమాణంలో మెడ మీద అద్దుకోవడం వల్ల, ముఖం, మెడా రెండూ సమంగా కనిపించే అవకాశం ఉంటుంది.
విటమిన్ సి సీరమ్: విటమిన్ సితో కూడిన సీరమ్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించడం వల్ల అతినీలలోహిత కిరణాల నుంచి మెడ చర్మానికి రక్షణ దక్కుతుంది.
హైలైటర్: మెడ మీద నుంచి ఇతరుల చూపులను పక్కకు తప్పించి, చెక్కిళ్ల మీద నిలపడం కోసం హైలైటర్ అద్దుకోవాలి. అయితే ఇందుకోసం లిక్విడ్ హైలైటర్‌ను ఉపయోగించాలి.
పౌడర్: మెడతో పాటు ముంజేతులకు కూడా ఫౌండేషన్ అద్దుకుని, ముఖం, మెడలతో సరిపోలేలా చూసుకోవాలి. తర్వాత పౌడర్ అద్దుకుని, అదనపు పౌడర్‌ను టిష్యూ పేపర్‌తో తొలగించాలి.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News