Ram Navami: కోల్‌కతాలో మరో కల్లోలం.. రామ నవమి ర్యాలీపై దాడి..
ABN , Publish Date - Apr 07 , 2025 | 09:44 AM
Ram Navami Rally: రామ నవమిని పురష్కరించుకుని నిన్న పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఏకంగా 2000 వేలకుపైగా ర్యాలీలు జరిగాయి. పార్క్ సర్కస్ సెవెన్ పాయింట్ ఏరియాలో మాత్రం ర్యాలీగా వెళుతున్న భక్తులపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు.

దేశ వ్యాప్తంగా రామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రామ దేవాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల రామ నవమిని పురష్కరించుకుని ర్యాలీలు కూడా జరిగాయి. అయితే, కోల్‌కతాలో రామనవమి ర్యాలీ సందర్భంగా దారుణం చోటుచేసుకుంది. ర్యాలీగా వెళుతున్న రామ భక్తులపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పార్క్ సర్కస్ సెవెన్ పాయింట్ ఏరియాలో చోటుచేసుకుంది. రామ నవమి ర్యాలీపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.
ఈ మేరకు బీజేపీ ఎంపీ సుఖాంత మజుందార్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..‘ రామ నవమి సందర్భంగా ర్యాలీ చేసి తిరిగి వస్తున్నారు. అప్పుడు హిందూ భక్తులపై క్రూరమైన విధంగా దాడి జరిగింది. కాషాయ జెండాలతో ఉన్న భక్తులపై రాళ్ల వర్షం కురిసింది. భక్తులకు గాయాలు అయ్యాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. కుట్ర ప్రకారమే ఇదంతా జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నారా? ఉంటే.. దాడి జరుగుతుంటే చూస్తూ కూర్చొన్నారా?.. ఇదంతా రాజకీయ కుట్రతోనే జరిగింది. అదే పార్కు సర్కిల్‌లో వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ర్యాలీ నిర్వహిస్తాం. ఈ రోజు చూస్తూ కూర్చొన్న పోలీసులే రేపు పూలు చల్లుతారు. ఇది రాసిపెట్టుకోండి’ అని అన్నారు.
ఇక, ఈ సంఘటనపై కోల్‌కతా పోలీసు శాఖ స్పందించింది. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘ పార్క్ సర్కిల్‌లో జరిగిన సంఘటన గురించి చెప్పాలంటే.. ర్యాలీ నిర్వహించడానికి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు. ప్రచారం జరుగుతున్నట్లుగా కూడా ఎలాంటి దాడి జరగలేదు. వాహనాలు ధ్వంసం అయ్యాయని సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లాం. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితుల్ని చక్కదిద్దారు. ఈ సంఘటనపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది. తప్పుడు ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దు’ అని పేర్కొంది. కాగా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా నిన్న ఏకంగా 2000 వేలకుపైగా రామ నవమి ర్యాలీలు జరిగాయి. అందులో బీజేపీతో పాటు టీఎంసీ నాయకులు కూడా పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉండటంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి:
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్..నిమిషాల్లోనే లక్షల కోట్ల నష్టం
AP News: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్