YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్
ABN , Publish Date - Apr 07 , 2025 | 09:41 AM
YS Sharmila Criticizes AP Govt: ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు.

విజయవాడ, ఏప్రిల్ 7: ఏపీలో ఈరోజు (సోమవారం) నుంచి నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) స్పందించారు. ఆరోగ్య శ్రీ (Aarogya Sri) సేవలకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై (AP Govt) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాకా చూశారని ఫైర్ అయ్యారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యిందని, ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీగా మారిందంటూ విమర్శలు గుప్పించారు.
షర్మిల వ్యాఖ్యలు ఇవే
పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదంటూ వ్యాఖ్యలు చేశారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాక చూడటం అంటే ఆరోగ్యశ్రీపై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతోందన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారిందన్నారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యిందని అన్నారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని, గొప్పలు చెప్పే చంద్రబాబు (CM Chandrababu).. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని అన్నారు.
IndiGo Flight: ఇండిగో విమానంలో బంగారం చోరి.. మహిళా సిబ్బందిపై అనుమానం
ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని తెలుసుకోవాలన్నారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతిచెందినా అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
వైద్య సేవలు బంద్
సుమారు రూ.3500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, తమ బకాయిలు చెల్లించాలంటూ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యం డిమాండ్ చేస్తూ నేటి నుంచి వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. బకాయిల చెల్లింపులపై వివిధ దశల్లో ఆందోళనలు చేపట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవలను నిలిపివేయాల్సి వస్తోందని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ వెల్లడించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం సుమారు 2500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
భార్య వేధింపులు తట్టుకోలేక.. ట్రైన్‌కి ఎదురెళ్లి మరీ
P Chidambaram: తమిళనాడుకు భారీగా పెరిగిన నిధులు.. చిదంబరం విమర్శలు
Read Latest AP News And Telugu News