Share News

సురేఖను ఖేల్‌రత్నకు పరిగణించండి

ABN , Publish Date - Jan 29 , 2025 | 02:37 AM

దేశ అత్యుత్తమ క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు విజయవాడ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ పేరును పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది...

సురేఖను ఖేల్‌రత్నకు పరిగణించండి

  • కేంద్ర క్రీడా శాఖను ఆదేశించిన ఏపీ హైకోర్టు

  • 2023 లేదా 2024 జాబితాలో ఆమె పేరు చేర్చాలని సూచన

అమరావతి (ఆంధ్రజ్యోతి): దేశ అత్యుత్తమ క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు విజయవాడ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ పేరును పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. ఖేల్‌రత్న అందుకునేందుకు తనకు అన్ని అర్హతలున్నా అవార్డుకు ఎంపికచేయలేదంటూ 2023లో సురేఖ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. సుదీర్ఘ వాదనల అనంతరం దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తుది తీర్పును వెలువరించారు. తీర్పు ప్రతి మంగళవారం అందుబాటులోకి వచ్చింది. 2023, 2024 సంవత్సరాలకు ఖేల్‌రత్న అవార్డుకు ఇప్పటికే ఎంపికైన క్రీడాకారులతో పాటు జ్యోతి సురేఖ పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 2023లో జరిగిన అవార్డుల ఎంపికను ఈ దశలో రద్దు చేయడం సరికాదు కనుక మరోసారి దరఖాస్తు సమర్పించాలని సురేఖను కోరకుండా పాత అర్జీనే పరిశీలించి ఆమె పేరును క్రీడా పురస్కారాల జాబితాలో చేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


అవార్డుల పాలసీలో పతకాలకు కేటాయించిన మార్కుల ప్రకారం సురేఖకు 148 పాయింట్లు (80 శాతం అర్హత) ఉండగా, ఆ ఏడాది అవార్డు పొందిన వారికి 58.5 పాయింట్లు (31.46 శాతం అర్హత) మాత్రమే ఉన్నట్టు తమ దృష్టికి రావడంతో సురేఖకు అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించింది. పాలసీలోని నిబంధనల ప్రకారం 80 శాతం పతకాల ఆధారంగా, 20 శాతం ఎంపిక కమిటీ విచక్షణాధికారం ప్రకారం మార్కులు ఇచ్చి అవార్డుకు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా కేంద్ర క్రీడాశాఖ మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు, అఖిల్‌ చౌదరి వాదనలు వినిపించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 02:37 AM