Share News

Ira Jadhav: 14 ఏళ్ల వయసులోనే ట్రిపుల్ సెంచరీ.. ఈ అమ్మాయి బ్యాటింగ్‌కు ఫిదా

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:12 PM

Ira Jadhav Tripple Century: మహిళా క్రికెట్‌లో సంచలనం నమోదైంది. 14 ఏళ్ల ఓ యంగ్ బ్యాటర్ భారీ ట్రిపుల్ సెంచరీతో అలరించింది. ఎవరికీ సాధ్యం కాని అద్భుతమైన రికార్డును బ్రేక్ చేసి వారెవ్వా అనిపించింది.

Ira Jadhav: 14 ఏళ్ల వయసులోనే ట్రిపుల్ సెంచరీ.. ఈ అమ్మాయి బ్యాటింగ్‌కు ఫిదా
Ira Jadhav

ప్రొఫెషనల్ క్రికెట్‌లో సెంచరీ కొడితేనే తోపు బ్యాటర్లలా చూస్తారు. ఇక డబుల్ సెంచరీ కొడితే వాళ్ల కంటే గ్రేట్ ఎవరూ లేరనే రీతిలో మెచ్చుకుంటారు. అలాంటిది ట్రిపుల్ సెంచరీ కొడితే.. అది కూడా 14 ఏళ్ల వయసులోనే! ఊహించడానికే కష్టంగా ఉంది కదా? కానీ ఈ అరుదైన ఫీట్‌ను అందుకుందో బ్యాటర్. అది కూడా వన్డేల్లో కావడం మరో విశేషం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో టీమ్ మొత్తం కలిపి కొట్టే స్కోరును ఒంటిచేత్తో కొట్టేసిందో అమ్మాయి. మహిళా క్రికెట్‌లో సంచలనం నమోదైంది. ఇండియా విమెన్స్ యంగ్ బ్యాటర్ ఇరా జాదవ్ అద్భుతం చేసి చూపించింది. భారీ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టింది. అండర్-19 స్థాయిలో మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్‌ను అందుకుంది.


సిక్సుల వర్షం!

ముంబై తరఫున బరిలోకి దిగిన ఇరా జాదవ్.. మేఘాలయపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. బంతిని కసితీరా చితకబాదింది. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించింది. 157 బంతుల్లోనే ఏకంగా 346 పరుగులు చేసింది. ఇందులో 42 బౌండరీలతో పాటు 16 భారీ సిక్సులు ఉన్నాయి. తనతో తనే పోటీపడి బిగ్ షాట్స్ బాదింది ఇరా. రీసెంట్‌గా జరిగిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్‌లో ఆమెను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆ కోపంతోనో ఏమో మేఘాలయపై విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది ఇరా. ఆమెతో పాటు కెప్టెన్ హుర్లే గాలా (116) భారీ సెంచరీతో అలరించింది.


19కే ఆలౌట్!

ఇన్నింగ్స్ చివరి వరకు నాటౌట్‌గా నిలబడింది ఇరా జాదవ్. ఆమెతో పాటు కెప్టెన్ హుర్లే గాలా కూడా రాణించడంతో ముంబై ఓవర్లన్నీ ఆడి మూడు వికెట్ల నష్టానికి 563 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్ స్టార్ట్ చేసిన మేఘాలయ.. కేవలం 19 పరుగులకే కుప్పకూలింది. కనీసం ఫైట్ కూడా చేయకుండానే చేతులెత్తేసింది. దీంతో 544 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది ముంబై. కాగా, ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఇరా జాదవ్ అరుదైన ఘనత సాధించింది. భారత విమెన్స్ క్రికెట్ హిస్టరీలో ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచింది.


ఇవీ చదవండి:

జెమీమా సెన్సేషనల్ రికార్డ్.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

అప్పటివరకు నేనే కెప్టెన్.. కుండబద్దలు కొట్టిన రోహిత్

హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 05:18 PM