శ్రేయాస్ అయినా.. పంజాబ్ రాత మార్చేనా?
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:11 AM
మెగా లీగ్‌లో ఉనికిని కోల్పోయిన జట్టు పంజాబ్ కింగ్స్..! ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేక పోయింది. పేరు మార్చుకొన్నా.. తరచూ జట్టును సమూలంగా ప్రక్షాళన చేస్తున్నా.. ఎంతో అనుభవం ఉన్న కోచ్‌లను...

మెగా లీగ్‌లో ఉనికిని కోల్పోయిన జట్టు పంజాబ్ కింగ్స్..! ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేక పోయింది. పేరు మార్చుకొన్నా.. తరచూ జట్టును సమూలంగా ప్రక్షాళన చేస్తున్నా.. ఎంతో అనుభవం ఉన్న కోచ్‌లను నియమించుకొంటున్నా జట్టు తలరాత మాత్రం మారడం లేదు. టోర్నీ చరిత్రలో రెండుసార్లు మాత్రమే ప్లేఆ్‌ఫ్సకు చేరుకొంది. 2008 సెమీస్‌లో ఓడగా.. 2014లో ఫైనల్లో కోల్‌కతా చేతిలో పరాజయం పాలైంది. గత పదేళ్లలో ఎన్ని ప్రయోగాలు చేసినా.. పంజాబ్ ఆటతీరు మాత్రం మారడం లేదు. అయితే, గతేడాది కోల్‌కతాకు టైటిల్ సాధించి పెట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన పంజాబ్.. అతడికే జట్టుపగ్గాలు అప్పగించింది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌ను చెరో రూ. 18 కోట్లకు ఖరీదు చేసింది. కోచ్‌గా రికీ పాంటింగ్‌ను నియమించడంతో ఈసారి జట్టు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తున్నా నిలకడలేమి ఇబ్బందిపెడుతోంది.
ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, జెన్సన్‌తో మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో ఫినిషర్‌గా ఆకట్టుకొన్న శశాంక్ సింగ్ నుంచి జట్టు అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. అర్ష్‌దీప్, ఫెర్గూసన్, జెన్సన్‌తో పేస్ విభాగం ఫర్వాలేదనిపిస్తున్నా.. చాహల్ మినహా మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం మైనస్. పైగా టీమిండియాకు ఆడుతున్న ఆటగాళ్లు ఇద్దరే జట్టులో ఉండగా.. కోర్ టీమ్‌ను తయారు చేసుకోలేకపోవడం పెద్దలోపం.
జట్టు
బ్యాటర్లు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ఆరోన్ పన్ను, అవినాష్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్;
వికెట్ కీపర్లు: విష్ణు వినోద్, జోష్ ఇంగ్లిస్;
ఆల్‌రౌండర్లు: మార్కస్ స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జెన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ప్రియాన్స్ ఆర్య, ఆరోన్, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెగ్డే;
బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, చాహల్, లోకీ ఫెర్గూసన్, వైశాఖ్ విజయ్‌కుమార్, యాశ్ ఠాకూర్, కుల్దీప్ సేన్, బార్ట్‌లెట్, ప్రవీణ్ దూబే.