Share News

బౌలర్లకు ఊరట

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:40 AM

ధనాధన్‌ బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచే ఐపీఎల్‌లో ఇక బౌలర్లు కూడా తడాఖా చూపనున్నారు. శనివారం ఆరంభం కానున్న ఈ లీగ్‌లో బంతికి ఉమ్మి (సలైవా) రాయడంపై ఉన్న నిషేధాన్ని...

బౌలర్లకు ఊరట

ఐపీఎల్‌ రేపటి నుంచే

బంతికి ఉమ్మిపై నిషేధం ఎత్తివేత

రెండో కొత్త బాల్‌కు అవకాశం

ఐపీఎల్‌లో నయా రూల్స్‌

ముంబై: ధనాధన్‌ బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచే ఐపీఎల్‌లో ఇక బౌలర్లు కూడా తడాఖా చూపనున్నారు. శనివారం ఆరంభం కానున్న ఈ లీగ్‌లో బంతికి ఉమ్మి (సలైవా) రాయడంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ఫాస్ట్‌ బౌలర్లకు అద్భుతంగా మేలు చేకూర్చుతుంది. గురువారం బీసీసీఐ కార్యాలయంలో ఫ్రాంచైజీల కెప్టెన్ల సమావేశం జరిగింది. దీంట్లో భాగంగా బంతి మెరుపు కోసం ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు మెజార్టీ కెప్టెన్లు సుముఖత వ్యక్తం చేయడంతో బోర్డు ముందడుగు వేసింది. బంతి పాతబడ్డాక ఉమ్మితో దాన్ని మెరిసేలా చేసి బౌలర్లు రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టడం పరిపాటి. కానీ కొవిడ్‌ సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బంతికి ఇలా ఉమ్మి పూయడాన్ని ఐసీసీ నిషేధించింది. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ అదే నిర్ణయాన్ని అమలు చేశారు.


ఇన్నాళ్లూ బౌలర్లు చెమటను మాత్రం ఉపయోగిస్తూ వచ్చారు. కానీ దాంతో బంతి బరువు పెరుగుతుందని, స్వింగ్‌ రాబట్టడం కష్టమనే అభిప్రాయం ఉంది. అయితే కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో సలైవాపై ఉన్న నిషేధాన్ని తొలగించాలన్న డిమాండ్‌ ఎక్కువైంది. ఇటీవల భారత పేసర్‌ మహ్మద్‌ షమి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు బోర్డు నిర్ణయాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ స్వాగతించాడు. ‘బౌలర్లు ఇది శుభవార్తే. బంతి ఎలాంటి ప్రభావం చూపని స్థితిలో ఉమ్మితో రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు’ అని సిరాజ్‌ తెలిపాడు.

6-Sports.gif

11వ ఓవర్‌ నుంచి మరో బంతి..

రాత్రి జరిగే మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈకారణంగా బంతి తడిగా మారి బౌలర్లకు పట్టు లభించదు కాబట్టి.. సెకండ్‌ బ్యాటింగ్‌ జట్టు భారీగా పరుగులు సాధించే చాన్సుంటుంది. దీన్ని ఎదుర్కొనేందుకు రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్‌ నుంచి మరో బంతిని తీసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించనుంది. అయితే ఇది రూల్‌ మాత్రం కాదని, కొత్త బంతిని కెప్టెన్లు కోరినప్పటికీ మంచు అధికంగా ఉందా? లేదా? అని పరిశీలించి ఫీల్డ్‌ అంపైర్లే తుది నిర్ణయం తీసుకుంటారని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ అంపైర్లు బంతిని మార్చాలనుకున్నా కొత్త బంతిని మాత్రం ఇవ్వరు. ఏ బంతిని మార్చుతున్నారో.. దాదాపు అలాంటి మరో బాల్‌తో మ్యాచ్‌ను కొనసాగిస్తారు. మధాహ్నం మ్యాచ్‌కు ఈ రూల్‌ వర్తించదు.


హాక్‌ఐ ద్వారా వైడ్‌ బాల్‌

కెప్టెన్ల సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నుంచి వైడ్‌ బాల్‌ను సరిగ్గా అంచనా వేసేందుకు హాక్‌ఐ, బాల్‌ ట్రాకింగ్‌ సహకారం కూడా తీసుకోనున్నారు. ఎక్కువ ఎత్తు వైడ్స్‌తో పాటు ఆఫ్‌ స్టంప్‌ ఆవలగా వెళ్లే వైడ్స్‌పై నిర్ణయం తీసుకునేందుకు వీటిని ఉపయోగించనున్నారు.

రాజస్థాన్‌ కెప్టెన్‌గా రియాన్‌ పరాగ్‌

సంజూ శాంసన్‌ స్థానంలో తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్‌ పరాగ్‌ సారథ్యం వహిస్తాడని రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పూర్తి ఫిట్‌నె్‌సతో లేకపోవడంతో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కెప్టెన్‌గా ఉండేందుకు వీల్లేదు కాబట్టి పరాగ్‌ నేతృత్వంలో ఆ మ్యాచ్‌లను ఆడతాడు.

ఇవి కూడా చదవండి..

Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..

పాండ్యాకు మెంటల్ టార్చర్

మరిన్ని క్రీడాతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 03:44 AM