IPL Return: బుమ్రా వచ్చేదెప్పుడో!
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:40 AM
వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజా ఐపీఎల్‌లో ఎప్పుడు చేరతాడనేది సందేహంగా మారింది.

ABN AndhraJyothy: వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజా ఐపీఎల్‌లో ఎప్పుడు చేరతాడనేది సందేహంగా మారింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన అతడు రెండున్నర నెలలుగా క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే బుమ్రాను లీగ్‌లోకి అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తను ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వచ్చే నెల రెండో వారంలో బుమ్రా జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
అదే జరిగితే ముంబై ఆడే తొలి ఐదు మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉండడు. ‘ఎన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడనేది ఇప్పుడే తెలియదు. లీగ్ ఆరంభమయ్యాక ఏదో దశలో జట్టుతో చేరుతాడు. అయితే ఇందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి అనుమతి తప్పనిసరి’ అని ఓ క్రీడా వెబ్‌సైట్ పేర్కొంది. ఈనెల 23న ముంబై జట్టు చెన్నైతో తొలి మ్యాచ్ ఆడనుంది.