EPS: మా పథకాలకు కొత్త పేర్లు పెట్టి మసిపూసి మారేడుకాయ చేశారు..
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:08 PM
ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితంగా ఉందని ఆయన విమర్శించారు.

- అచరణకు సాధ్యం కాని ప్రకటనలతో సరి
- ఈపీఎస్ ధ్వజం
చెన్నై: అచరణకు సాధ్యం కాని ప్రకటనలతో బడ్జెట్ అంతా మోసపూరితంగా వుందని, గతంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే కొత్తగా పేర్లు పెట్టి మసిపూసి మారేడు కాయ చేశారని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswamy) ధ్వజమెత్తారు. అసెంబ్లీలో శుక్రవారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ బయట ఎడప్పాడి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి తంగం తెన్నరసు ఆచరణకు సాధ్యం కాని ప్రకటనలతో మాత్రమే బడ్జెట్ సరిపెట్టారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: ఈడీ అభియోగాలపై న్యాయపరమైన చర్యలు..
ముఖ్యమంత్రి స్టాలిన్ 95శాతం హామీలను నెరవేర్చినట్లు ప్రకటించారని, అయితే 40శాతం హామీలు ఇంకా అలాగే వున్నాయని విమర్శించారు. నీట్ రద్దు చేస్తామని, అందుకు సంబంధించిన రహస్యం తమ వద్ద వుందని పలు వేదికలపై ప్రకటించిన ఉపముఖ్యమంత్రి ఉదయనిధి తన మాట నిలబెట్టుకోకుండా విద్యార్ధులకు ద్రోహం తలపెట్టారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులుగా పెంచుతామన్న హామీ ఏమైందని ఈపీఎస్ ప్రశ్నించారు.
పెరిగిన రుణభారం...
గత 73ఏళ్ళలో రాష్ట్రప్రభుత్వం పొందిన అప్పు రూ.5లక్షల 18వేల కోట్లు మాత్రమేనని అయితే, డీఎంకే ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో రూ.3లక్షల 54వేల కోట్లు రుణం పొందిందని, దేశంలోనే అధిక రుణాలు పొందే రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని ఈపీఎస్ ఆరోపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలంటూ ఏమీ లేవన్నారు.
ప్రజలను విస్మరించిన బడ్జెట్
- టీవీకే నేత విజయ్
రాష్ట్రప్రజలను విస్మరించే విధంగా డీఎంకే ప్రభుత్వ బడ్జెట్ ఉందని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ విమర్శించారు. కేవలం ప్రకటనలపైనే శ్రద్ధ చూపుతున్న డీఎంకే మోడల్ ప్రభుత్వం రహదారుల స్థితిగతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై బడ్జెట్‌లో ప్రకటించలేదన్నారు. కళాశాల విద్యార్ధులకు మాత్రమే లాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం, ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్ధుల గురించి ప్రస్థావించలేదన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ బడ్జెట్ వుందని విజయ్ వ్యాఖ్యానించారు.
ఇది ఎన్నికల బడ్జెట్...
కేంద్రమంత్రి ఎల్.మురుగన్
కేంద్రప్రభుత్వం నిధులిచ్చే పథకాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ తన తండ్రి కరుణానిధి పేరు పెట్టినంత మాత్రాన అది డీఎంకే సాధించిన విజయమవుతుందా? అని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ విమర్శించారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2026లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశం లేనందున మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ఈ డీఎంకే ప్రభుత్వం దాఖలు చేస్తుందని, అందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందానే ఏకైక దృష్టితోనే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించిందన్నారు. ఈ నాలుగేళ్ళలో 57వేలకు పైగా పోస్టులను భర్తీచేసినట్లు బడ్జెటలో ప్రకటించిన ప్రభుత్వం వచ్చే సంవత్సరం 40వేల ప్రభుత్వ పోస్టులను ఎలా భర్తీ చేస్తుందన్న వివరాలు బడ్జెట్‌లో లేవని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ అన్నారు.
పసలేని బడ్జెట్
బీజేపీ ఫ్లోర్ లీడర్ నయినార్ నాగేంద్రన్
డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కొత్తగా అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి లేవని, ఇదో పసలేని బడ్జెట్ అని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. టాస్మాక్ సంస్థలో ఇటీవల తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఫోర్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అందులో రూ.వెయ్యి కోట్ల మేర అవినీతి జరిగిందంటూ గురువారం ప్రకటించారని, అయితే ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి సెంథిల్‌బాలాజీ చెప్పడం హాసాస్పదంగా వుందన్నారు. ఈ అవినీతి గురించి చర్చించేందుకు అసెంబ్లీలో తమకు అవకాశం కల్పించాలంటూ స్పీకర్ అప్పావు వద్ద సావదాణ తీర్మానంకు సంబంధించి వినతిపత్రాన్ని తమ పార్టీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ సమర్పించారని నాగేంద్రన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News