Share News

కటక్‌లోనే కొట్టేస్తారా?

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:40 AM

ఓవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వైఫల్యంతో ఆందోళన నెలకొనగా, మరోవైపు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రాకతో తుది కూర్పు ఎలా? అనే తర్జనభర్జన పడుతోంది టీమిండియా. ఈనేపథ్యంలో సిరీసే లక్ష్యంగా...

కటక్‌లోనే  కొట్టేస్తారా?

నేడు రెండో వన్డే

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

సిరీస్‌ లక్ష్యంగా టీమిండియా

బరిలో కోహ్లీ

ఒత్తిడిలో ఇంగ్లండ్‌

కటక్‌: ఓవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వైఫల్యంతో ఆందోళన నెలకొనగా, మరోవైపు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రాకతో తుది కూర్పు ఎలా? అనే తర్జనభర్జన పడుతోంది టీమిండియా. ఈనేపథ్యంలో సిరీసే లక్ష్యంగా ఆదివారం ఇంగ్లండ్‌తో రెండో వన్డే బరిలోకి దిగబోతోంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో ఘన విజయంతో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉండడంతో సిరీస్‌ పట్టేందుకు మన జట్టుకు మరో విజయం చాలు. ఇక, పేలవ ఆటతీరుతో విమర్శలపాలవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్న బట్లర్‌ సేనకు ఇది కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌. అందుకే ఎలాంటి అలక్ష్యం లేకుండా ఆ జట్టు ఆటగాళ్లంతా సత్తా నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇదిలావుండగా కటక్‌లో ఆడిన 17 వన్డేల్లో భారత్‌ 13 గెలిచింది. అలాగే 2003 నుంచి ఇక్కడ జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ జట్టుకు ఓటమి లేకపోవడం విశేషం.


8-Sports.jpg

జైస్వాల్‌ అవుట్‌!

మోకాలి గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్‌ కోహ్లీ రెండో మ్యాచ్‌లో ఆడడం ఖాయమే. అతను ఫిట్‌గానే ఉన్నాడని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ కోటక్‌ కూడా స్పష్టం చేశాడు. అయితే విరాట్‌ రాకతో జట్టులో చోటు కోల్పోయేదెవరనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. కోహ్లీ స్థానంలో నాగ్‌పూర్‌లో బరిలోకి దిగిన శ్రేయాస్‌ అయ్యర్‌ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అసలే ఫామ్‌లో లేని విరాట్‌ కోసం ఇప్పటికిప్పుడు అయ్యర్‌ను తొలగించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడందరి చూపు ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌పై పడనుంది. పైగా నాగ్‌పూర్‌లో వన్డే అరంగేట్రం చేసిన అతను 15 పరుగులే చేశాడు. దీంతో విరాట్‌ కోసం జైస్వాల్‌ పక్కకు తప్పుకోక తప్పదేమో! అదే జరిగితే రోహిత్‌కు జతగా తిరిగి గిల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. కానీ కోచ్‌ గంభీర్‌ వ్యూహమైన కుడి-ఎడమ కాంబినేషన్‌ మిస్‌ అవుతుంది. ఒకవేళ శ్రేయా్‌సనే తప్పిస్తే గిల్‌ వన్‌డౌన్‌లో, విరాట్‌ నెంబర్‌-4లో ఆడతాడు. మరోవైపు విరాట్‌ వీలైనంత త్వరగా ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు అతడికి రెండు వన్డేలు మాత్రమే మిగిలాయి. అందుకే కటక్‌లో తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


రోహిత్‌ ఈసారైనా..

ఫార్మాట్‌ ఏదైనా కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం విఫలమవుతూనే ఉన్నాడు. తొలి వన్డేలో రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. గతేడాది ఆగస్టు నుంచి ఏ ఫార్మాట్‌లోనూ అతడు కనీసం అర్ధసెంచరీ చేయకపోవడం గమనార్హం. షాట్ల ఎంపికలోనూ ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. మిగిలిన రెండు వన్డేల్లోనూ విఫలమైతే అతడి వన్డే భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నట్టే. బౌలింగ్‌ విభాగం మాత్రం పటిష్టంగా కనిపిస్తోంది. కమ్‌బ్యాక్‌ పేసర్‌ షమి అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో అరంగేట్ర పేసర్‌ హర్షిత్‌ రాణా ఆదిలో పరుగులిచ్చుకున్నా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బ తీశాడు. కానీ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం అతడి స్థానంలో మరో పేసర్‌ అర్ష్‌దీ్‌పను ఆడించే అవకాశం ఉంది. స్పిన్నర్లు జడేజా, అక్షర్‌ ప్రభావం చూపిస్తున్నారు. కుల్దీప్‌ కూడా మెరుగ్గా రాణిస్తే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయవచ్చు.


చావోరేవో..

ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌ చావోరేవోలాంటిది. ఇందులోనూ ఓడితే వరుసగా రెండు సిరీ్‌సల ఓటమితో చాంపియన్స్‌ ట్రోఫీ ముందు జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం లేకపోలేదు. ప్రతీ బంతిని బాదే ఉద్దేశంతో కాకుండా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు నాణ్యమైన స్పిన్నర్లను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు ఎవరో ఒకరు క్రీజులో నిలదొక్కుకుంటే మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లవచ్చు. కానీ కోచ్‌ మెకల్లమ్‌ ఆధ్వర్యంలోని ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ గేమ్‌నే ఎక్కువగా నమ్ముకుంటోంది. సాల్ట్‌, డకెట్‌, బ్రూక్‌, బట్లర్‌ రాణిస్తున్నా.. లివింగ్‌స్టోన్‌, రూట్‌ బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉంది. పేసర్‌ సకీబ్‌ స్థానంలో ఉడ్‌ ఆడే అవకాశం ఉంది. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెక్‌ పెట్టేందుకు ఇంగ్లండ్‌ ఎలాంటి ప్రణాళికలతో ఆడనుందో చూడాలి.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, విరాట్‌, శ్రేయాస్‌, రాహుల్‌, అక్షర్‌, హార్దిక్‌, జడేజా, రాణా/అర్ష్‌దీప్‌, కుల్దీప్‌, షమి.

ఇంగ్లండ్‌: సాల్ట్‌, డకెట్‌, రూట్‌, బ్రూక్‌, బట్లర్‌ (కెప్టెన్‌), బెథెల్‌, లివింగ్‌స్టోన్‌, కార్స్‌, రషీద్‌, ఆర్చర్‌, సకీబ్‌/ఉడ్‌.

4-Sports.jpg

పిచ్‌

ఆరేళ్ల క్రితం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో వెస్టిండీ్‌సపై భారత్‌ 316 పరుగులను ఛేదించింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌, రోహిత్‌, రాహుల్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఈసారి కూడా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. కానీ మంచు ప్రభావంతో.. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే చాన్స్‌ ఉంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు.


ఇవీ చదవండి:

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి

‘సన్‌రైజర్స్‌’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 04:40 AM