Share News

BC reservation: నేడే బీసీల పోరుగర్జన

ABN , Publish Date - Apr 02 , 2025 | 03:54 AM

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించి రాజ్యాంగంలో చేర్చాలని బీసీ సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. జంతర్‌మంతర్‌లో ఈ నెల 3న 'బీసీల పోరుగర్జన మహాధర్నా' చేపడుతున్న బీసీ సంక్షేమ సంఘం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు, విపక్ష నాయకులు పాల్గొంటున్నారు.

BC reservation: నేడే బీసీల పోరుగర్జన

42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు..

న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద పోరు

బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు

హాజరు కానున్న రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి, అఖిలేశ్‌ యాదవ్‌, కనిమొళి, అసదుద్దీన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ’బీసీల పోరుగర్జన, మహాధర్నా’ కార్యక్రమాన్ని బుధవారం చేపడుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు మంగళవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఈ మహాధర్నాను జయప్రదం చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి 1500 మంది బీసీ నేతలతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారమే ఢిల్లీ చేరుకుంది. ఇక, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ ఢిల్లీలో పలువురు నేతలను కలిసి ధర్నాకు ఆహ్వానించారు. కాగా, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తీరు గల్లీలో ఒకలా, ఢిల్లీలో మరోలా ఉందని జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు.


తెలంగాణ భవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడిన జాజుల.. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ మద్దతు పలికిందని తెలిపారు. కానీ, బీసీల్లో ముస్లింలు ఉన్నందున బిల్లులను అడ్డుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌షా తమ పార్టీ నేతలను ఆదేశించారని వివరించారు. జంతర్‌ మంతర్‌ వేదికగా 12 బీసీ సంఘాలు ‘బీసీల పోరుగర్జన మహాధర్నా’ చేస్తున్నాయని తెలిపారు. కేంద్రం సహకరించకపోతే దేశవ్యాప్తంగా మరో మండల్‌ కమిషన్‌ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఇక, బీసీల న్యాయమైన హక్కుల కోసం సంఘీభావంగా చేపడుతున్న ’బీసీల పోరు గర్జన’లో విపక్షాలన్నీ భాగస్వామ్యం అవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, సురేష్‌ షట్కర్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. కాగా, మహాధర్నా అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖల నేతృత్వంలో బీసీ ఎమ్మెల్యేలు.. రెండు బిల్లులకు మద్దతు కోసం కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..

జీవితాంతం సమాజం కోసమే

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 03:54 AM