Share News

Bhatti: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి

ABN , Publish Date - Mar 01 , 2025 | 04:58 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti: స్వయం ఉపాధి  పథకాలకు రుణాలివ్వండి

ప్రభుత్వం తరపున మార్జిన్‌ మనీ, సబ్సిడీలిస్తాం.. 2న రూ.6000 కోట్ల విలువైన యూనిట్ల పంపిణీ

  • గత ప్రభుత్వ పాలనలో ఆయా కార్పొరేషన్లపై నిర్లక్ష్యం

  • మూసీ నిర్వాసితులకు ఆర్థిక చేయూత అందించాలి

  • బ్యాంకర్లతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం తరఫున మార్జిన్‌మనీ, సబ్సిడీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని సూచించారు. స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా రూ.6,000కోట్ల విలువైన వివిధ యూనిట్లను వనపర్తిలో ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజాభవన్‌లో శుక్రవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘రైజింగ్‌ తెలంగాణ’లో బ్యాంకర్ల పాత్ర కీలకమని, ప్రపంచాన్ని ఆకర్షించేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. స్వయం ఉపాధి పథకాల ప్రారంభం, సంక్షేమ పథకాల అమలును ఓ పండుగలా నిర్వహించనున్నామని, ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ)ని పెంచుతాయన్నారు. స్కిల్‌ యూనివర్సిటీ, ఐటీఐల ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేస్తున్నామన్నారు. ఒక్క వ్యవసాయ రంగానికే బడ్జెట్‌లో రూ.52వేల కోట్లను కేటాయించామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయిస్తున్నామని, 1000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్‌కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని వివరించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యేవారికి బ్యాంకర్లు ఆర్థికంగా చేయూత అందించాలని కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ)కు ఆర్థిక చే యూత అందించేందుకు బ్యాంక ర్లు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గత ప్రభు త్వ పాలనలో కార్పొరేషన్లపై తీవ్ర నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు.


3 ఎకరాల వరకు రైతు భరోసా జమ చేయండి: భట్టి

రైతుభరోసాలో భాగంగా 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సా యం సొమ్మును జమ చేయాలని సంబంధిత శాఖల అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకులు గోపీతో నిర్వహించిన సమీక్షలో ఆయ న మాట్లాడుతూ.. రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శనకు పెట్టాలని ఆదేశించారు. రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయిందా? లేదా? అన్నది ముందుగానే నిర్ధారించుకోవాలని సూచించారు.


సీఐఐ విందు సమావేశంలో భట్టి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ దెర్‌ లేయన్‌ గౌరవార్థం ఢిల్లీలోని పురానా ఖిల్లాలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో తెలంగాణ తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. యూరోపియన్‌ కమిషన్‌ సభ్యులు, కేంద్ర మంత్రులు, యూరప్‌ దేశాల రాయబారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూరోపియన్‌ దేశాలు- భారత దేశ వాణిజ్యాభివృధిలో తెలంగాణ పాత్రను అతిథులకు భట్టి వివరించారు.

Updated Date - Mar 01 , 2025 | 04:58 AM