Share News

CM Revanth Reddy: నకిలీ ఫొటోలు, వీడియోలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

ABN , Publish Date - Apr 05 , 2025 | 05:25 AM

కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న నకిలీ ఫొటోలు, వీడియోలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: నకిలీ ఫొటోలు, వీడియోలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

  • కంచగచ్చిబౌలి వివాదంలో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి

  • పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం

  • సూత్రధారులను గుర్తించే పనిలో సైబర్‌ క్రైం పోలీసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న నకిలీ ఫొటోలు, వీడియోలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూముల కోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల ఆందోళనలతో పాటు వన్యప్రాణులను వెళ్లగొడుతున్నారంటూ మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా నకిలీ ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నకిలీ ఫొటోలు సృష్టిస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.


కొందరు వ్యక్తులు వీటిని తయారు చేయడం, సర్క్యులేట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారని, పాత్రధారులతో పాటు సూత్రధారులను గుర్తించాలని సీఎం ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. జేసీబీలతో పని జరుగుతున్నపుడు నెమళ్లు, జింకలు ప్రాణ భయంతో పరుగు తీస్తున్నాయంటూ వచ్చిన ఫొటో, వీడియో మార్ఫింగ్‌ చేసినవేనని పోలీసులు చెబుతున్నారు. ఇక, ఆందోళనకు దిగిన హెచ్‌సీయూ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో కూడా పలు ఫేక్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో తిప్పారని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీల వారితో పాటు కొన్ని శక్తులు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నాయంటున్నారు. ఇలాంటి వారిపై సైబర్‌ క్రైం బృందాలు నిఘా పెట్టాయి.

Updated Date - Apr 05 , 2025 | 05:25 AM