Gachibowli 400 Acre Land Issue: ఆ భూములు సర్కారువే
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:43 AM
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై ఇటీవల జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూమి హక్కులపై ప్రభుత్వ మరియు హెచ్‌సీయూ అధికారుల మధ్య చర్చ జరిగింది.

వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే
అక్కడ అభివృద్ధితో పెద్దఎత్తున ఉద్యోగ కల్పన
400 ఎకరాలపై సుదీర్ఘ చర్చలో ప్రభుత్వం స్పష్టీకరణ
మంత్రులు, పర్యావరణవేత్తలతో ముఖ్యమంత్రి సమీక్ష
అడవి అనగల అర్హతలన్నీ ఆ భూములకున్నాయి
యథాతథంగా ఉంచాలి: హెచ్‌సీయూ, పర్యావరణవేత్తలు
యూనివర్సిటీ ఇంచు భూమినీ ప్రభుత్వం గుంజుకోలేదు
కొంతమంది కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టం: భట్టి
బీఆర్‌ఎస్ హయాంలో ఆ భూములపై కుట్ర: పొంగులేటి
వర్సిటీ భూములకు టైటిల్ డీడ్ యోచన: శ్రీధర్‌బాబు
42% ఆమోదం కోసం నేడు ఢిల్లీలో బీసీల గర్జన హాజరు కానున్న రాహుల్, రేవంత్, అఖిలేశ్, కనిమొళి, అసద్
ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, పర్యావరణవేత్త నర్సింహారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదానికి కారణమైన భూమిపై కూలంకషంగా చర్చ జరిగింది. అటు ప్రభుత్వం, ఇటు హెచ్‌సీయూ అధికారులు భూమికి సంబంధించి తమ వద్ద ఉన్న రికార్డులు, పత్రాల ఆధారంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆ భూమిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని ప్రభుత్వం వాదనలు వినిపించింది. అక్కడ అభివృద్ధి పనులు చేపడితే ఉద్యోగ కల్పనకు పెద్దఎత్తున అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, అడవి అనగల అన్ని అర్హతలు ఆ ప్రాంతానికి ఉన్నాయని, ప్రస్తుతం ఉన్నట్లుగానే ఆ స్థలాన్ని ఉండనివ్వాలని హెచ్‌సీయూ అధికారులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. అయితే, భూమిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేసిన ప్రభుత్వం.. తమ అభీష్టం మేరకే ముందుకు వెళతామన్న విషయమై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువర్చలేదు. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ భూమికి సంబంధించి ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.
400 ఎకరాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడాం
కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా, ప్రభుత్వం న్యాయపరంగా కొట్లాడి సాధించుకున్నదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ, ప్రజా విజయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ఆ భూమిని పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో కలిసి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి, భూమికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ‘‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇంచు భూమిని కూడా మా ప్రభుత్వం గుంజుకోలేదు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించినది కాదు. ఈ భూమిని ప్రభుత్వం లాక్కుని ప్లాట్లు చేసి, విక్రయించుకుంటోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ భూమి మాదేనని హెచ్‌సీయూ భావిస్తోంది. కానీ, 2004 జనవరి 31న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని బిల్లీరావు ప్రాతినిధ్యం వహించిన ఐఎంజీ ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించింది. దానికి బదులుగా గోపనపల్లిలోని సర్వే నంబర్లు 36, 37ల్లోని 397 ఎకరాలను యూనివర్సిటీకి బదలాయించింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో సంతకాలు చేశారు. అయితే, ఐఎంజీ భారత్ అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న అప్పటి వైఎ్‌సఆర్ ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది.
దీనిపై ఐఎంజీ భారత్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ రిట్ పిటిషన్‌పై అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి న్యాయస్థానంలో సీనియర్ అడ్వకేట్లను నియమించి ప్రభుత్వ వాదనలు వినిపించేలా చేశారు. కానీ, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పాలకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోని ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయలేదు. పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా ఆ భూమిని పట్టించుకోకుండా గాలికొదిలేశారు. కోట్లాది రూపాయల విలువైన ఈ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే.. దానిని తమ చేతుల్లోకి తెచ్చుకోవచ్చన్న కుట్ర చేశారు. అందుకే న్యాయస్థానంలో కొట్లాడలేదు. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విలువైన భూమిని రాష్ట్ర సంపద, ప్రజల ఆస్తిగా భావించి, స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై భూమి స్వాధీనానికి న్యాయ పోరాటం చేయాలని యోచించింది. ఆ మేరకు న్యాయవాదులను నియమించి విజయం సాధించింది. ఇది ప్రభుత్వ, ప్రజా విజయం’’ అని భట్టి విక్రమార్క వివరించారు. విలువైన భూమిని కాపాడినందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి... ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని తప్పుబట్టారు. లక్షలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో ఈ భూమిని రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి అప్పగించామని, ఇందులో ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని స్పష్టం చేశారు. టీజీఐఐసీ తయారు చేసిన డ్రాఫ్ట్ లే అవుట్‌లో ఈ భూమిలోని సహజసిద్ధమైన రాక్ ఫార్మేషన్స్, మష్రూమ్ రాక్‌ను మినహాయించామన్నారు. భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా ఇవ్వడానికి ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, వాటి మీడియా సంస్థలు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టబోమని, ప్రజల ఆస్తిని వారి చేతుల్లోకి పోనివ్వబోమని చెప్పారు.
బీజేపీ, బీఆర్‌ఎ్‌సది ఫెవికాల్ బంధం: పొంగులేటి
కంచ గచ్చిబౌలి భూమిపై నాలుగైదు రోజులుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల ఫెవికాల్ బంధాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎ్‌సకు ఈ భూమిని కాపాడాలన్న ఆలోచన రాలేదని విమర్శించారు. భూమిని వారి సంస్థలకు అప్పగించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారని, అప్పట్లో హైరైజ్ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చినప్పుడు పక్షులు, జంతువుల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. జంతువులు చనిపోయినట్లు తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని, ఇది నీచాతి నీచమైన ప్రచారమని తప్పుబట్టారు. ఇప్పటి వరకు వర్సిటీలో పక్షులు, జంతువులు చనిపోయినట్లు చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. వర్సిటీకి ఎంత భూమి ఉంటే... అంత భూమికి టైటిల్ డీడ్ ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
వర్సిటీ భూమిలో ఇంచు కూడా తీసుకోలేదు: శ్రీధర్‌బాబు
కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్‌ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. వర్సిటీకి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఎకరంపై కూడా వర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవని, ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారని తెలిపారు. కానీ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, ఇప్పుడేమో పని గట్టుకుని తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. వారం రోజుల కిందట వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌తో తాము ప్రత్యేకంగా సమావేశమయ్యామని, వారి విజ్ఞప్తి మేరకు దాదాపు 1500 ఎకరాల యూనివర్సిటీ భూములపై చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News