CM Revanth Reddy: కంచ గచ్చిబౌలి.. నకిలీ ఫొటోలు, వీడియోలపై.. సీఎం సీరియస్
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:55 AM
కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు.

విచారణకు ఆదేశించేలా.. ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయండి
సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయండి
ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్‌ని సమకూర్చుకోండి
కంచ గచ్చిబౌలి వివాదంపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు సృష్టించారు
ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
కిషన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పోస్టులపై చర్చ
సెలబ్రిటీలు జాన్ అబ్రహం, దియామీర్జా.. రవీనా టాండన్ ట్వీట్‌లపై పోలీసుల ఆరా
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్‌క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నకిలీ వీడియోలు, ఫొటోలను పసిగట్టేలా అవసరమైన ఆధునిక ఫోరెన్సిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. శనివారం ఆయన కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కృత్రిమ మేధతో తయారు చేసే నకిలీ వీడియోలు, ఫొటోలు కరోనాను మించిన మహమ్మారిలాంటివని.. ఇండో-పాక్, ఇండో-చైనా వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్‌ను సృష్టించే ప్రమాదముంటుందనే చర్చ ఈ సమీక్షలో జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్టుగా సోషల్ మీడియా నెట్‌వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఫేక్ కంటెంట్ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సీఎం రేవంత్‌కు పలు కీలక విషయాలను వెల్లడించారు.
కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న భూముల్లో గడిచిన 25 ఏళ్లుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్‌స(ఐఎ్‌సబీ)తో పాటు గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ, ప్రైవేటు భవనాలు, అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని.. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు తెరపైకి రాలేదన్నారు. ఇప్పుడు అదే సర్వే నంబర్‌లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎందుకు అక్కడ వివాదాస్పదం అవుతుందనే విషయంపై సమావేశంలో చర్చించారు. ఏఐ ద్వారా కొందరు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలను సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్డోజర్ల పనులు చేస్తుండడంతో జింకలు గాయపడి, పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలను తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు కూడా ఆ ఫేక్ ఫొటోలు, వీడియోలు, ఆడియోలను నిజమని నమ్మి.. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అసత్యాలకు మరింత ఆజ్యం పోసినట్లయిందన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్‌రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా టాండన్ లాంటి వాళ్లు కూడా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను పోస్టుచేసి, సమాజానికి తప్పుడు సందేశాన్ని చేరవేశారని సమావేశంలో చర్చించారు. అయితే ఈ భూముల వివాదంపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా.. కొద్ది సేపట్ల్లోనే తన పోస్టును తొలగించి.. క్షమాపణలు చెప్పారని, మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా.. ఫేక్ వీడియోలను ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.
బాలీవుడ్ నటుల పాత్రపైనా ఆరా!!
ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను పోస్టుచేసి, సమాజానికి తప్పుడు సందేశాన్ని చేరవేశారనే ఆరోపణలపై పలువురు ప్రముఖులను విచారించేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. శనివారం జరిగిన సమీక్షలో సీఎం ఈ అంశంపై సీరియస్ అయిన నేపథ్యంలో సీఎ్‌సబీ చర్యలకు సిద్ధమవుతోంది. సీఎం సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ధ్రువ్‌రాఠీ, జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా టాండన్ తదితరులపై దృష్టి సారించినట్లు తెలిసింది. దీంతోపాటు.. ‘ఫ్యాక్ట్‌చెక్’ పేరిట శనివారం సాయంత్రం మీడియాకు 8 పేజీల డాక్యుమెంట్‌ను సీఎ్‌సబీ విడుదల చేసింది. అందులో సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలు, ఫొటోల లింకులు.. అవి అసత్యాలని చెప్పడానికి ఆధారాలు, ఆ పోస్టులు చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను వెల్లడించింది. ఏఐ ఫేక్ కంటెంట్‌ను షేర్ చేసిన సంస్థలు, వ్యక్తుల్లో.. కేసీవీపీ-తెలంగాణ, డిగ్‌టీవీ పేరడీ, కెప్టెన్ ఫసక్2.0, సూరజ్ ఠాకూర్, సుశీలారెడ్డి(బీఆర్‌ఎస్), సిరివెన్నెల గౌడ్ పల్లె, సాయి ప్రణీత్‌రెడ్డి, భరత్‌ప్రసాద్ పోతుగంటి, నాగిరెడ్డి-ఆర్గనైజేషన్, ఉత్కర్ష్ తివారీ, తనకమ్ కుమరన్, లింగప్రసాద్ గౌడ్ అనంతుల, దుర్గాప్రసాద్, అర్పితాప్రకాశ్, సత్య బండెల ఉన్నారు. తొలుత వీరికి నోటీసులు పంపి, విచారించాలని సీఎ్‌సబీ నిర్ణయించినట్లు తెలిసింది. కాగా.. మొట్టమొదటి ఫేక్ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టు సుమిత్.. కాసేపటికి తన తప్పు తెలుసుకుని, తొలగించారని, క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. మిగతావారు కూడా నిజాన్ని గుర్తించినా, స్తబ్ధుగా ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు.
జగ్జీవన్‌కు సీఎం నివాళులు
మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ 118వ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, గాంధీభవన్‌లోనూ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here