Share News

Congress: విస్తరణకు విరామం!

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:21 AM

మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పునకు సంబంధించి ఉమ్మడి సమావేశంలోనూ, విడివిడిగానూ నేతలు తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి చెప్పారు. ఈ దఫా సమీకరణలను బట్టి నలుగురు లేదా ఐదుగురితో మంత్రివర్గాన్ని విస్తరించాలన్న అవగాహనకూ వచ్చారు.

Congress: విస్తరణకు విరామం!

  • ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్‌ అధిష్ఠానం

  • వక్ఫ్‌ బిల్లుపై ఏఐసీసీ బిజీ బిజీ!

  • మంత్రివర్గ విస్తరణపై ఈ నెల రెండో వారంలో నిర్ణయం!

  • ఢిల్లీకి ఆశావహులు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా జానారెడ్డి

  • తమకు చోటు కల్పించాలని మాదిగ, లంబాడా వర్గం నేతల డిమాండ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర క్యాబినెట్‌ విస్తరణ ఎపిసోడ్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం చిన్న విరామం ఇచ్చిందా? వక్ఫ్‌ బిల్లుపైన, సంస్థాగత వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్న ఏఐసీసీ పెద్దలు.. నిర్ణయాన్ని మరో వారం పాటు వాయిదా వేశారా? ఈనెల రెండో వారంలో క్యాబినెట్‌ విస్తరణపైన నిర్ణయం వెలువడనుందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు.. అవుననే సమాధానం ఇస్తున్నాయి. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపైన గత నెల 24న ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల తుది దఫా చర్చలు ముగిశాయి. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పునకు సంబంధించి ఉమ్మడి సమావేశంలోనూ, విడివిడిగానూ నేతలు తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి చెప్పారు. ఈ దఫా సమీకరణలను బట్టి నలుగురు లేదా ఐదుగురితో మంత్రివర్గాన్ని విస్తరించాలన్న అవగాహనకూ వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, టీజేఎస్‌ అధినేత కోదండరాం తదితర పేర్లపైన పరిశీలన చేశారు. అయితే ఇందులో రాజగోపాల్‌రెడ్డి, కోదండరాంలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీనీ పరిగణనలోకి తీసుకుని చర్చించారు. బీసీ సామాజిక వర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌, విజయశాంతి పేర్లపైన చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్‌వెంకటస్వామితో పాటుగా.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ పేరునూ పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ అమెర్‌ అలీఖాన్‌ లేదా.. పార్టీ సీనియర్‌ నేతను ఎవరినైనా తీసుకుని తర్వాత ఎమ్మెల్సీని చేయడమా అన్నదానిపైన చర్చించారు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్‌ తదితరుల పేర్లూ ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ పేర్లన్నింటిపైనా ఐదుగురు ముఖ్యనాయకుల అభిప్రాయాలను ఉమ్మడిగాను, విడివిడివిడిగానూ అధిష్ఠానం తీసుకుంది. అయితే ఉగాది, ఏప్రిల్‌ 2 సాయంత్రం, 3, 4 తేదీల్లో ఉదయం ప్రమాణ స్వీకారానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఈ లోపున నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం కోరింది. అయితే ఆ ముహూర్తాలపై అధిష్ఠానం ఇంతవరూ నిర్ణయం తీసుకోలేదు.


ఢిల్లీకి ఆశావహుల చక్కర్లు.. ప్రయత్నాలు

నలుగురు లేదా ఐదుగురితోనే మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు వార్తలు రావడంతో ఆశావహులు, మద్దతుదారులు ఢిల్లీ బాట పట్టారు. మాదిగ సామాజిక వర్గం.. ఎస్టీ లంబాడా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌లను కలిసి.. తమ సామాజిక వర్గాలకూ క్యాబినెట్లో చోటు కల్పించాలంటూ వినతిపత్రాలు ఇచ్చారు. ఢిల్లీకీ వెళ్లి అధిష్ఠానం పెద్దలను కలిసి వినతిపత్రాలూ ఇచ్చారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో దీక్షలూ జరుగుతున్నాయి. లంబాడాలకు అవకాశం కల్పించాలంటూ ఆ సామాజిక వర్గ నేతలు ఏకంగా సీఎం నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి.. పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఏఐ సీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి.. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి.. ఖర్గేకు లేఖా రాశారు. వీరే కాకుండా సీనియార్టీ ప్రాతిపదికన తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ పలువురు పార్టీ ఎమ్మెల్యేలు అధిష్ఠానం పెద్దలను సంప్రదిస్తున్నారు.


రెండో వారంలో ప్రకటించే ఛాన్స్‌!

మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపైన రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న అధిష్ఠానం పెద్దలు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌తో కలిసి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా.. పార్టీ పట్ల అంకిత భావానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన అధిష్ఠానం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోడానికి ఉన్న బలమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది తెలంగాణే. దీంతో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు తదితర అంశాలపై అధిష్ఠానం.. ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు బొటా బొటీ మెజార్టీ ఉండగా.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి రావడం, ఎంఐఎం గట్టి మద్దతుదారుగా నిలబడడంతో పార్టీ బలంగా తయారైంది. అదను చూసుకుని ఈడీ, ఐటీ కేసులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేయకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనూ మంత్రివర్గం విషయంలో అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసంతృప్తికి తావు లేకుండా నిర్ణీత వ్యవధి తర్వాత మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టి.. కొత్త వారికి చోటు కల్పించాలన్న ఆలోచనా అధిష్ఠానం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరో వైపున పార్లమెంటుకు వక్ఫ్‌ బిల్లు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపైనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం, దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల కూర్పు, ఇతర సంస్థాగత అంశాల్లో ఏఐసీసీ పెద్దలు తలమునకలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలు అన్ని అంశాలపైన దృష్టి సారించి మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టొచ్చునంటున్నారు. ఏప్రిల్‌ 2వ వారంలో నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్‌ ఉంద ని చెబుతున్నారు.


మల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ దీక్ష

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మునిసిపాలిటీ పరిధి శేరిగూడ గాంధీ విగ్రహం ఎదుట తెలంగాణ పారా మెడికల్‌ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్‌ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా కాంగ్రె్‌సకు సేవలందిస్తూ మలక్‌పేట్‌ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారని, ప్రసుత్తం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది ప్రజల అభిమతన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్ఆర్‌హెచ్‌ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు

For More AP News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:21 AM