Share News

Continental Hospital: ఏఐతో క్యాన్సర్‌ ముందస్తు నిర్ధారణ

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:24 AM

ఒక సిటీ స్కాన్‌ చేసి, దాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో అనుసంధానం చేస్తే ఐదు సంవత్సరాలు ముందుగానే క్యాన్సర్‌ ముప్పును గుర్తించవచ్చని.. ఆ పరిజ్ఞానాన్ని తమ వద్ద అందుబాటులోకి తెచ్చామని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Continental Hospital: ఏఐతో క్యాన్సర్‌ ముందస్తు నిర్ధారణ

  • సీటీ స్కాన్‌ను కృత్రిమ మేధతో విశ్లేషించడం ద్వారా.. ఐదేళ్ల తర్వాత వచ్చే క్యాన్సర్లనూ ముందే పసిగట్టొచ్చు

  • కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఏఐ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఒక సిటీ స్కాన్‌ చేసి, దాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో అనుసంధానం చేస్తే ఐదు సంవత్సరాలు ముందుగానే క్యాన్సర్‌ ముప్పును గుర్తించవచ్చని.. ఆ పరిజ్ఞానాన్ని తమ వద్ద అందుబాటులోకి తెచ్చామని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆ ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంఐటీ (మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ), మయోక్లినిక్‌, నెదర్లాండ్స్‌కు చెందిన పలు సంస్థలతో కలిసి.. దేశంలోనే తొలిసారి ‘కాంటినెంటల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్లీ డిటెక్షన్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఫర్‌ క్యాన్సర్‌’ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఏఐ సాయంతో.. రొమ్ము, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్ల వంటివాటిని ముందస్తుగా గుర్తించి, వైద్యం అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.


ఈ ప్రోగ్రామ్‌ వేలాది మంది ప్రాణాలు కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తుందని.. క్యాన్సర్‌ మరణాలను నివారించడమే కాక, చికిత్స ఖర్చును తగ్గిస్తుందని చెప్పారు. సీటీ స్కాన్‌ను ఏఐ ద్వారా విశ్లేషించి.. క్యాన్సర్‌ కణాలు ఏ దశలో ఉన్నాయి, ఏయే అవయవాలపై దాని ప్రభావం ఉండొచ్చు అనే అంశాలపై కచ్చితమైన నివేదికను పొందవచ్చని, సదరు రోగులకు ఎలాంటి చికిత్స చేయాలో కూడా ఏఐ సూచిస్తుందని వివరించారు. ఇప్పటికే 1500 మందికి పైగా క్యాన్సర్‌ పేషెంట్స్‌కు ఈ ఏఐ ఆధారిత ఇమేజింగ్‌ పరీక్షలను కూడా నిర్వహించినట్టు వెల్లడించారు. ఇలా క్యాన్సర్‌ను తొలిదశల్లోనే గుర్తిస్తే 90 శాతం జీవితకాలం మెరుగుపడుతుందని.. ఏడాదిపాటు చికిత్స చేయించుకున్నాక ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఐఎ్‌సబీ (ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) డీన్‌ మదన్‌, ప్రొఫెసర్‌ మణీంద్ర కె.యలవర్తి, వైద్యులు రుజు జోషీ, రవీంద్రనాథ్‌ పాల్గొని ప్రసంగించారు.

Updated Date - Mar 18 , 2025 | 04:24 AM