Radio: ‘ఆకాశవాణి’.. ఒక మధురానుభూతి
ABN , Publish Date - Apr 15 , 2025 | 09:01 AM
రేడియో.. నిన్నటి తరానికి ఒక మధుర స్మృతి. స్మార్ట్ యుగంలో దాని ప్రాభవం తగ్గొచ్చేమోకానీ, టెలివిజన్ వచ్చే ముందు వరకు అది వహించిన పాత్ర అంతా ఇంతా కాదు. కొన్ని జీవితాలను నిలబెట్టింది. మరికొన్ని జీవితాలను వెలిగించింది. విజ్ఞానాన్ని, వినోదాన్ని కలగలసి ప్రతి ఇంటా ఆరాధ్యనీయమైంది. ఒక ప్రగతికర పాత్ర పోషించిన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రానికి 75 వసంతాలు. ఈ సందర్భంగా చరిత్రపుటల్లోకి వెళ్తే..

- హైదరాబాద్ కేంద్రానికి 75 ఏళ్లు
- దక్కన్ రేడియోగా 1935లో ప్రారంభం
- 1950, ఏప్రిల్‌లో ఆకాశవాణిగా మార్పు
- రేడియోకు సేవలందించిన దాశరథి, దేవులపల్లి, త్రిపురనేని గోపీచంద్ తదితర దిగ్గజాలు
హైదరాబాద్ సిటీ: నిజాం తపాలా శాఖ అధికారి మహబూబ్ అలీ అబిడ్స్, చిరాగ్ అలీ గల్లీలోని తన ఇంట్లో 200 వాట్ల సామర్థ్యం గల రేడియో కేంద్రాన్ని 1933లో ప్రారంభించారు. దాని నిర్వహణ బాధ్యతను స్వీకరించిన నిజాం ప్రభుత్వం 1935 ఫిబ్రవరి 3న దక్కన్ రేడియోగా మార్చింది. ఆనాటి నుంచీ 1948, సెప్టెంబరు 17 వరకు ఉర్దూ, కన్నడ, మరాఠి, తెలుగు కార్యక్రమాలతో దక్కన్ రేడియో అలరారింది. హిందుస్థానీ సంగీత కచేరీల నిర్వహణలో లాహోర్, ఢిల్లీ ఆకాశవాణి రేడియో స్టేషన్లకు దీటుగా దక్కన్ రేడియో కార్యక్రమాలు ఉండేవని ఆకాశవాణి మాజీ ఉద్యోగి సుమనస్పతి రెడ్డి చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: కుషాయిగూడలో వృద్ధురాలి హత్య
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాట ప్రసారం
ఉర్దూ భాష ప్రధానంగా సాగే దక్కన్ రేడియోలో 1948, సెప్టెంబరు 17న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడిన ‘వైష్ణవజనతో’ గీతాన్ని ప్రసారం చేయడం ఆనాడు ఒక పెద్ద సంచలనం. అదే హైదరాబాద్(Hyderabad) రాజ్యానికి స్వాతంత్య్రం వచ్చిందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందని సుమనస్పతి రెడ్డి వివరించారు. ఆపరేషన్ పోలోలో భాగంగా హైదరాబాద్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన భారత సైన్యాన్ని స్వాగతిస్తున్నట్లు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దక్కన్ రేడియో ద్వారా ప్రకటించాడని చరిత్రకారులు చెబుతారు.
అనంతరం కూడా ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ అధికారుల పర్యవేక్షణలో దక్కన్ రేడియోగా 1950 ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగింది. తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంగా మారింది. దాశరథి కృష్ణమాచార్య, దేవులపల్లి కృష్ణశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్, పాలగుమ్మి విశ్వనాథం, స్థానం నరసింహారావు, భాస్కరభట్ల కృష్ణారావు, కేశవపంతులు నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ వంటి సాహితీ దిగ్గజాలెందరో ఈ కేంద్రంలో సేవలందించారు. త్రిపురనేని మహారథి దక్కన్ రేడియో తెలుగు విభాగంలో కొంతకాలం పనిచేసినట్లు ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగి సీఎస్ రాంబాబు చెప్పారు.
అమృత మహోత్సవం
హైదరాబాద్ కేంద్రం ఆకాశవాణిగా మారిన నాటి నుంచి తెలుగు కార్యక్రమాలకు నెలవుగా మారింది. పాలగుమ్మి విశ్వనాథం కృషితో లలిత సంగీతానికి ఈ కేంద్రం మేటిగా నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. వార్తలు మాత్రమే కాదు, చర్చాగోష్ఠులు, ఇంటర్వ్యూలు, పిల్లలు, యువత, మహిళలు, రైతులు, కర్షకులకు ప్రత్యేక కార్యక్రమాలు, నాటకాలు, నాటికలు, శ్రోతలు కోరిన సినిమా పాటలు వంటి రకరకాల ప్రసారాలతో 1990వ దశకం వరకు తెలుగువారి ఆదరాభిమానాలు పొందింది. ఎంతోమంది జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిన ఆకాశవాణి అమృత మహోత్సవాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా కర్ణాటక, జానపద, లలిత సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
Read Latest Telangana News and National News