GHMC: ఎల్బీనగర్ ఘటనపై జీహెచ్‌ఎంసీ సీరియస్.. అనుమతులు రద్దు
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:17 PM
GHMC: ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల్లో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటనను జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా తీసుకుంది. భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: నగరంలోని ఎల్బీనగర్ సెల్లార్ కుంగిన ఘటనపై జీహెచ్‌ఎసీ (GHMC) సీరియస్ అయ్యింది. భవన నిర్మాణ అనుమతులను బల్దియా రద్దు చేసింది. సెట్ బ్యాక్ లేకుండా అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నారని.. బారికేడింగ్, రిటర్నింగ్ వాల్ లేకుండానే సెల్లార్ తవ్వకం జరిగిందని తేలింది. అసలు జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు జరిపారని.. ముగ్గురు మృతికి కారణమయ్యారంటూ బిల్డర్‌పై క్రిమినల్ కేసు పెట్టింది జీహెచ్‌ఎంసీ. జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జీహెచ్‌ఎంసీ ఈ కేసు పెట్టింది. అలాగే బిల్డర్‌కు జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఓనర్‌పై కేసు...
ఎల్బీనగర్‌లోని సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటనలో ఓనర్ కుస్మా రమేష్‌పై 106(1) 125(a) బీఎన్‌ఎస్ సెక్షల కింద ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు రాము, వీరయ్య, వాసు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించగా.. గాయపడిన బిక్షపతి ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం శరీరంలో అక్కడక్కడ కొన్ని గాయలతో నిలకడగానే బిక్షపతి ఆరోగ్యం ఉన్నట్లు తెలుస్తోంది. పేదవారు కావడంతో కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో బిక్షపతి కుటుంబం ఉంది.
ఆందోళన...
మరోవైపు ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూరైనా మృతదేహాలను ఇవ్వకుండా బిల్డర్ అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్ చంద్రపురి కాలనీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సెల్లార్ తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ వైపు నుంచి ఒక్కసారిగా మట్టిదిబ్బలు కూలాయి. ప్రమాద సమయంలో పలువురు కూలీలు అక్కడే ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కొంత మంది కూలీలు పక్కకు జరిగి ప్రాణాలు కాపాడుకోగా.. నలుగురు కూలీలు మాత్రం మట్టిదిబ్బల కింద పడిపోయారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టినప్పటికీ మట్టిదిబ్బల కింద ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు తండ్రీకొడుకులు కాగా.. మరొకరు మేనల్లుడు. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి...
CLP Meeting: సీఎల్పీ మీటింగ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఆహ్వానం
Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..
Read Latest Telangana News And Telugu News