Share News

తాళం తీస్తే ఒట్టు!

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:57 PM

పశువుల్లో కృత్రిమ గర్భధారణ చేసేందుకు ఉద్దేశించి నిర్మించిన గోపాలమిత్ర భవనం ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది.

 తాళం తీస్తే ఒట్టు!

తాళం తీస్తే ఒట్టు!

నిరుపయోగంగా గోపాలమిత్ర భవనం

లక్షలు వెచ్చించారు వాడకం వదిలేశారు

అక్కెనపల్లిలో ఏడేళ్లుగా తెరుచుకోని భవనం

నార్కట్‌పల్లి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పశువుల్లో కృత్రిమ గర్భధారణ చేసేందుకు ఉద్దేశించి నిర్మించిన గోపాలమిత్ర భవనం ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది. ప్రారంభం అనంతరం భవనానికి వేసిన తాళం మళ్లీ తీయలేదంటే అతిశయోక్తి కాదు. దీంతో గోపాలమిత్ర భవనం వాడకంలో లేకపోవడంతో ఆవరణతో పాటు పశువుల దాహార్తి తీర్చడం కోసం కట్టిన నీటితొట్టి చెత్తాచెదారంతో నిండాయి. అసలు ఇక్కడ నిర్మించిన భవనం వాడకంలో లేదనే విషయం సం బంధిత జిల్లా ఉన్నతాధికారులకు తెలియకపోవడం విడ్డూరం. నార్కట్‌పల్లి మండలంలోని అక్కెనపల్లిలో నాబార్డు పథకం కింద ఆర్‌ఐడీఎఫ్‌ నిధులు రూ.7.50లక్షల అంచనా విలువతో గోపాలమిత్ర భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని 2017 సెప్టెంబరు 4వ తేదీన అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. భవనం నిర్మించారే తప్ప కృత్రిమ గర్భదారణకు సంబంధించిన ఎలాంటి పరికరాలు ఇవ్వలేదు. దీంతో తొ లినాళ్లలో కొన్ని రోజుల పాటు మాత్రమే వినియోగించిన ఈ భవనా న్ని ఆ తదుపరి ఏళ్ల తరబడి నిరుపయోగంగానే మా రింది. తలుపులకు వేసిన తాళం తీసిన దాఖలాలు క నిపించలేదు. ఇదిలా ఉంటే ఆయా శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో మగ్గుతుంటే సొంత భవనం ఉండి నిరుపయోగంగా మారిన వైనంపై అటు అధికారులు కాని ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టనట్లే ఉన్నా రు. పశువులు ఉన్న చోటికే వెళ్లి కృత్రిమ గర్భదారణ చికిత్స చేస్తున్నాం కాబట్టి భవనం అవసరం అంతగా లేకపోయిందని స్థానిక గోపాలమిత్ర పేర్కొన్నారు.

భవనాన్ని వాడకంలోకి తేవాలి

లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన గోపాలమిత్ర భవనాన్ని వాడకంలోకి తేవాలి. పశువైద్య శాల గానో లేకపోతే మరే ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, అనుబంధ సంస్థలకు ఉపయోగపడేలా వినియోగంలోకి తెచ్చేందుకు మండలంలోని అధికారులు కూడా ఆలోచన చేయాలి.

చిరబోయిన రాజు, మాజీ వార్డు సభ్యుడు

భవనం వాడకంలో లేదని తెలియదు

అక్కెనపల్లిలో గోపాలమిత్ర భవనం నిరుపయోగంగా మారిందనే విషయం తన దృష్టిలో లేదు. ఆ భవనాన్ని ఏళ్ల తరబడి ఎందుకు నిరుపయోగంగా ఉంచారో తెలుసుకుని వాడకంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటా.

రాజశేఖర్‌, ఈవోడీఎల్‌డీఏ ఏడీ

Updated Date - Mar 27 , 2025 | 11:57 PM