Cabinet Expansion: రెండు లేదా మూడున ముహూర్తం
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:02 AM
తెలంగాణలో ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సూచనప్రాయంగా సమాచారం ఇచ్చారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఏప్రిల్ 2 సాయంత్రం లేదా 3 ఉదయం జరగనుంది. అలాగే, అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపితే, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.

మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌కు సీఎం సమాచారం
ఉగాది సందర్భంగా జిష్ణుదేవ్‌తో
రేవంత్ మర్యాద పూర్వక భేటీ
ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపైనా ఇరువురి మధ్య చర్చ
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందంటూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండో తేదీ సాయంత్రం లేదా మూడో తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోవాలని భావిస్తున్నట్లు గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. కనుక కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను సీఎం రేవంత్ కోరారని ప్రభుత్వ వర్గాల కథనం. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డిలతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్‌తో విడిగా సీఎం రేవంత్ భేటీ
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి అరగంట పాటు విడిగా సమావేశమయ్యారు. వారిద్దరూ పాలనాపరమైన అంశాలపై మాట్లాడుకు న్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని, రెండో తేదీ సాయంత్రం లేదా మూడో తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉండొచ్చునని గవర్నర్‌కు సీఎం వివరించారని చెబుతున్నారు. దీంతోపాటు అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని గవర్నర్‌ను సీఎం కోరినట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆమోదం తెలిపితే, ఉదోగ్య నియామకాల కోసం నోటిఫికేషన్ల విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా తాను ప్రకటించిన సంగతిని గవర్నర్‌కు సీఎం గుర్తు చేసినట్లు తెలియ వచ్చింది. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లు లకు రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రయత్నించాలని కోరినట్లు సమాచారం. ఇంకా అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు ఆమోద ముద్ర వేయాలని కోరినట్లు తెలుస్తోంది.
అధిష్ఠానం నిర్ణయమే తరువాయి
మంత్రివర్గ విస్తరణ విషయమై ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం సేకరించింది. ఆ తర్వాత తమ వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ఎస్టీ లంబాడావర్గ ప్రజా ప్రతినిధులు.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిశారు. ఈ అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం తుది నిర్ణయంపై కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్, ఇతర ముఖ్య నేతలతోనూ ఫోన్ల ద్వారా సంప్రదింపులూ నిర్వహిస్తోంది. అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్నారు. కాగా, వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య అనుబంధం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏక్‌భారత్- శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో రాజస్థాన్ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థానీ సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News