రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:48 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన అమలు, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

సుభాష్‌నగర్, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన అమలు, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు, వాగ్ధానాలు చేసిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన అన్ని హామీలు, వాగ్ధానాల్లో కోతపెడుతూ రైతాంగాన్ని గోసపెడుతున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ రైతాంగాన్ని మోసం చేసినట్టు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే దారు ణంగా మోసం చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే కేవలం 25 లక్షల మందికి కూడా రుణమాఫీ చేయకుండా, 70 శాతం మందికి ఎగ్గొట్టారని ఆరోపించారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా విషయంలో కూడా మోసం చేశారన్నారు. ఎంతమంది రైతు కూలీలకు సహాయాన్ని అందించారని ప్రశ్నించారు. సన్నవడ్లకే బోనస్ ఇచ్చారన్నారు. పంటలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వానికి కనిపంచడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు కేంద్రం ఇచ్చే సహాయం రైతులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 2,320 కనీస మద్దతు ధర నిర్ణయించి రైతులకు అండగా నిలుస్తుందన్నారు. కొనుగోలు అయ్యే ప్రతిపైసా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. రైతుల సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బిజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, యాదగిరి, కర్ర సంజీవరెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ వై సునీల్‌రావు, డి శంకర్, రాష్ట్ర నాయకులు బాస సత్యనారాయణ, గుగ్గిల్లపు రమేశ్, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, కన్నెబోయిన ఓదెలు, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకటరెడ్డి, ఎర్రవెల్లి సంపత్‌రావు, బొంతల కళ్యాణ్‌చంద్ర, బింగి కరుణాకర్, అలువెలి సమ్మిరెడ్డి, చొప్పరి జయశ్రీ, మడుగురి సమ్మిరెడ్డి, దుర్శెట్టి సంపత్, కటకం లోకేష్, ఎన్నం ప్రకాష్, బల్బీర్‌సింగ్, పుప్పాల రఘు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.