కోటిన్నరకు శఠగోపం పెట్టిన జ్యువెల్లరి యజమాని
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:47 AM
మంథని పట్టణంలోని ధనలక్ష్మి జ్యువెల్లరీ యజమాని సుమారు కోటిన్నర రూపాయలకు పైగా ప్రజలనెత్తిన శఠగోపం పెట్టి పరారయ్యాడు. వ్యాపారిని నమ్మి అప్పులు ఇచ్చిన వారిని, తక్కవ ధరకే బంగారం, వెండి ఇస్తానంటే నమ్మిన వారిని, వివాహ ఆభరణాలు తయారీకి బంగారం ఇచ్చిన వారికి షాపు యజమాని, కుటుంబ సభ్యులు కోటిన్నరకు పైగా ఎగవేసినట్లు శనివారం బహిర్గతమైంది.

మంథని, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మంథని పట్టణంలోని ధనలక్ష్మి జ్యువెల్లరీ యజమాని సుమారు కోటిన్నర రూపాయలకు పైగా ప్రజలనెత్తిన శఠగోపం పెట్టి పరారయ్యాడు. వ్యాపారిని నమ్మి అప్పులు ఇచ్చిన వారిని, తక్కవ ధరకే బంగారం, వెండి ఇస్తానంటే నమ్మిన వారిని, వివాహ ఆభరణాలు తయారీకి బంగారం ఇచ్చిన వారికి షాపు యజమాని, కుటుంబ సభ్యులు కోటిన్నరకు పైగా ఎగవేసినట్లు శనివారం బహిర్గతమైంది. గత నెల 25వ తేదీనే సదురు షాపు యాజమాని తోరత్ సీతారాం, భార్య, కొడుకులు ప్రవీణ్, ప్రశాంత్‌లతో కలిసి పరారయ్యాడు. సీతారం కుటుంబం ఇంట్లో, రెండు షాపుల్లో కనిపించకుండా పోవడంతో తొలుత చుట్టుపక్కవారు, స్థానికులు, ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళకు వెళ్ళినట్లుగా భావించారు. అయితే కుటుంబంలో అందరి సెల్‌ఫోన్లు పని చేయకుండా పోవడంతో వారు పారిపోయినట్లు ఆలస్యంగా గుర్తించారు. దీంతో చేసేది ఏం లేక రెండు షాపు వద్ద శనివారం బాధితులు సమావేశం కావాలని మూడు రోజుల క్రితం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
శనివారం బాధితులంతా కలిసి పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన ప్రకారం సీతారం కుటుంబం 51 మందిని మోసం చేసిన బాధితులు ఉన్నారు. వారి నుంచి 708 గ్రాముల బంగారం, 52 లక్షల నగదు, కిలో వెండి తీసుకున్నట్లు తెలిపారు. బాధితుల్లో అఽధికంగా ఇంటి యజమాని శారద వద్ద 5 లక్షలు, తులంన్నర బంగారం, మరో ఇంటి యజమాని చంద్రశేఖర్ రూ.6 లక్షల నగదు, 10 తులాల బంగారం తీసుకున్నటు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సీతారం దాదాపు 20 ఏళ్ళ క్రితం మంథనికి వచ్చి జ్యువెల్లరి షాపు నిర్వహించి అందరిని నమ్మించి భారీగా నగదు, బంగారం, వెండితో ఉడాయించారు. ఇంకా ముందుకు రాని బాధితులు ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.