ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఊరట
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:24 PM
సామాన్యులకు గుదిబండగా మారిన ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో దరఖా స్తుదారులకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే 25శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మొత్తం ఫీజులో రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించినా ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు.

కోల్‌సిటీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): సామాన్యులకు గుదిబండగా మారిన ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో దరఖా స్తుదారులకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే 25శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మొత్తం ఫీజులో రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించినా ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు. 14శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు ప్రస్తుతం చెల్లించకుండానే రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించినా పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో కూడా ఫీజు ఆప్షన్ పెట్టారు. దీంతో దరఖాస్తుదారులకు ఉపశమనం కలుగనున్నది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేందుకు ఇప్పటివరకు దర ఖాస్తుదారులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ప్రస్తు తం కల్పించిన రెగ్యులరైజేషన్ చార్జీ చెల్లింపు అవకాశం తో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.
జిల్లాలో 25,513 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రామాల్లో 5735దరఖాస్తులు రాగా మిగతావి రామగుండం నగరపాలక సంస్థ, పెద్దపల్లి, సుల్తానా బాద్, మంథని మున్సిపల్ పరిధిలో ఉన్నాయి. ఇందులో 25వేల దరఖాస్తుల్లో 4521దరఖాస్తులు ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నాయి. ఇందులో అసైన్డ్, ప్రభుత్వ, ఇనాం, దేవాదాయ, వక్ఫ్ భూములు, చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని భూములు, హైటెన్షన్ వైర్ల కింద ఉన్న భూములు ఉన్నాయి. 16910 దరఖాస్తులకు ఫీజు అప్రూవల్ చేసి దరఖాస్తుదారులకు సమాచారం పంపారు. మరో 3568 దరఖాస్తులు మున్సి పల్, రెవెన్యూ, నీటి పారుదలశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అప్రూవల్ లేకుండా పెండింగ్‌లో ఉన్నాయి. రామగుండం 7,078 దరఖాస్తులకు గాను 3920 దరఖా స్తులకు ఫీజు అప్రూవల్ చేశారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 245 దరఖాస్తులు మాత్రమే పరిష్కార మయ్యాయి. ఇక మంథనిలో 895, పెద్దపల్లిలో 10269, సుల్తానాబాద్‌లో 1536 దరఖాస్తులు వచ్చాయి.
రెగ్యులరైజేషన్ చార్జీల వెసులుబాటుతో పరిష్కారానికి అవకాశం
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీతో పాటు కేవలం రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించినా దర ఖాస్తుల పరిష్కారానికి అవకాశం ఇవ్వడంతో దీన్ని విని యోగించుకునేందుకు దరఖాస్తుదారులు మొగ్గుచూపే అవకాశం ఉన్నది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 15శాతం ఫీజు చెల్లిస్తే రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్ వచ్చే అవకాశం ఉంది. మిగతా 14శాతం చార్జీలు, ఇతర ఫీజులను భవ న నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించుకునే వెసులుబటు కల్పించారు. చాలా మంది ప్రజలు ఖాళీ స్థలాలపై పెట్టుబడి పెట్టారు. ధర వస్తే అమ్ముకుందా మనే ఆలోచనతో ఉన్నారు. వీరికి ఈ కొత్త వెసులు బాటు కలిసిరానున్నది. రెగ్యులరైజేషన్ ఫీజు వెసులు బాటు అవకాశంతో జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది.