బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:42 AM
జగిత్యాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వచ్చింది. రూ.3,04,965 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు గాను ప్రత్యేకించి రూ. 56,084 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లు, చేయూత పథకానికి రూ. 14,861 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, సబ్సిడీ గ్యాస్ రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ. 600 కోట్లు, యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, సన్నాలకు బోనస్ రూ.1800 కేటాయించారు.

జగిత్యాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వచ్చింది. రూ.3,04,965 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు గాను ప్రత్యేకించి రూ. 56,084 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లు, చేయూత పథకానికి రూ. 14,861 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, సబ్సిడీ గ్యాస్ రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ. 600 కోట్లు, యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, సన్నాలకు బోనస్ రూ.1800 కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కూడా తగిన విధంగా నిధులు కేటాయించారు. నీటి పారుదల రంగానికి రూ.23,373 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు, విద్యా రంగానికి రూ.23,108 కోట్లు, తదితర పథకాలకు నిధులు కేటాయించారు.
ఫ వ్యవసాయ రంగానికి అధిక నిధులు
బడ్జెట్‌లో జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఏమీ కేటాయించకున్నా, రాష్ట్రంలో జిల్లా వాటాగా పలు రకాలుగా నిధులు పొందనుంది. ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయగా, ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాల కొనసాగింపు వంటివి జగిత్యాల జిల్లా ప్రజలకు మేలు చేకూర్చనున్నాయి. జిల్లాకు చేకూరే లబ్ధి గతంతో పోలిస్తే సాగు, సంక్షేమంలో స్వల్పంగా మెరుగు కనిపిస్తోంది. పలు రంగాల ప్రజలను ఆకర్శించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అధికార పార్టీ నేతలు అంటుండగా...అంకెల గారెడీగా ఉందని ప్రతిపక్ష నేతలు కొట్టిపారేస్తున్నారు.
ఫసంక్షేమ పథకాల అమలుపై దృష్టి
మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, రేషన్ కార్డులపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. మహాలక్ష్మీ పథకంలో గ్యాస్ సిలెండర్లు రూ.500లకే పంపిణీ, గృహాజ్యోతి 200 యూనిట్ల విద్యుత్ మినహాయింపు, రాజీవ్ అరోగ్య శ్రీ రూ 5 లక్షల నుంచి పది లక్షలకు పెంపు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీ సంక్షేమం, సన్నవడ్లకు బోనస్‌లతో పాటు భూభారతితో భూ సమస్యల పరిష్కారం వంటివి ప్రస్తావించారు. విద్యారంగంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ల ఏర్పాటును ప్రస్థావించారు. డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్ ట్రెయినింగ్ కోర్సులు కూడా అందించడానికి కాలేజీల ఎంపికపై పేర్కొన్నారు. మహిళలకు బీమా సౌకర్యం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణలు అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొనడంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ 2862 కోట్లు ప్రతిపాదించారు.
ఫఎస్సీల సంక్షేమానికి పెద్దపీట
ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రకటించగా ఎస్సీ సంక్షేమానికి అత్యధికంగా రూ.40,232 కోట్లు కేటాయించింది. రాజీవ్‌గాంధీ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గాలకు వివిధ యూనిట్లు కేటాయించేందుకు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
-అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్
అభివృద్ధి, సంక్షేమం రెండు గుర్రాలుగా ఉండే విధంగా బడ్జెట్‌ను రూపొందించారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. సాగు, తాగునీటి రంగాలకు నిధుల కేటాయింపు జరిగింది. ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారు.
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్
-మాకునూరి సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పేద వాడి ఇంటి కల నెరవేర్చడమే కాకుండా, కడుపు నింపే విధంగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. రైతులు, మహిళలు, మైనార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందనున్నాయి.
మసిపూసి మారేడు కాయ చేశారు
-డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే
రాష్ట్ర బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసే విధంగా ఉంది. ఆరు గ్యారెంటీల హామీకి బడ్జెట్ కేటాయింపులు లేవు. మహిళలకు తులం బంగారం, మహాలక్ష్మి పథకాలకు కేటాయింపులు లేవు. రుణ మాఫీకి అరకొరగా నిధులు ఇచ్చారు. పంటల బీమా ప్రస్తావన లేదు. బడ్జెట్‌లో ఆటో డ్రైవర్ల ముచ్చట లేదు. అన్ని రంగాల వ్యక్తులు, కులాల సంక్షేమాన్ని పట్టించుకోలేదు.
సంక్షేమానికి పెద్దపీట
-తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
సంక్షేమానికి పెద్దపీట వేసేలా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరిగింది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి అనుగుణంగా భారీగా నిధులు కేటాయించారు. జనరంజకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉంది.
అంకెల గారడీ
-కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
అంకెల గారడీ బడ్జెట్‌ను ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2,500 ఇస్తామన్న హామీపై బడ్జెట్‌లో ఊసే ఎత్తలేదు. కాలేజీ విద్యార్థులకు స్కూటీ విషయం మరిచిపోయారు. అంకెల గారడీతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు
-మోరపల్లి సత్యనారాయణ, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితపు లెక్కలుగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించలేదు. పేద ప్రజల సంక్షేమానికి, పల్లెలు, పట్టణాల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించింది. అంకెల గారడీగా బడ్జెట్ తయారు చేశారు.
విద్యా రంగానికి అరకొర నిధులు
-నునావత్ రాజు, టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడు
విద్యా రంగానికి అరకొరగా నిధుల కేటాయింపులు జరిపారు. విద్యారంగానికి 15 శాతం నిధులు ఇస్తామని హామీనిచ్చి ప్రస్తుతం 7.6 శాతం నిధుల కేటాయించడం సమంజసం కాదు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేదు. అరకొర నిధుల ద్వారా విద్యా వ్యవస్థ ఎలా సక్రమంగా నడుస్తుంది.
విద్యారంగంపై చిన్న చూపు
-శ్యామ్‌సుందర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం విద్యా రంగానికి జరిపిన కేటాయింపులు ఏమాత్రం సరిపోయే విధంగా లేవు. గత యేడాది కంటే ప్రస్తుత యేడాది విద్యా రంగానికి 0.20 శాతం కేటాయింపులు తగ్గాయి. విద్యాశాఖ పరిధిలో ఉన్న పాఠశాలలను గాలికొదిలేసి రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రస్తావించడం సరికాదు.
పేదలకు మేలు చేసేలా బడ్జెట్
-జిల్లా గంగాధర్, వ్యాపారి, జగిత్యాల
బడ్జెట్ పేద ప్రజలకు మేలు చేసేలా ఉంది. ప్రధానంగా రైతులు, యువత, వృద్ధులు, మహిళలు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నిధులను సమానంగా కేటాయించారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ ఉంది.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ప్రణాళికతో బడ్జెట్
-అయిత అనిత, కవయిత్రి, జగిత్యాల
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అను మూడు అంశాల నినాదం మీద తెలంగాణ రైజింగ్ 2050 అను ప్రణాళికతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి, రైతు భరోసాకు ప్రాధాన్యతనిచ్చారు.
రైతు పక్షపాతిగా బడ్జెట్
-మహంకాలి రాజన్న, కాంగ్రెస్ నాయకులు, జగిత్యాల
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు పక్షపాతిగా ఉంది. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తామని పేర్కొని అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించడం హర్షణీయం.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్
-తాటిపర్తి విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు
సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్‌గా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరిగింది. విద్య, వైద్య, వ్యవసాయ, గృహ నిర్మాణ రంగాలకు పెద్ద మొత్తంగా కేటాయింపులు జరిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాని పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లేలా బడ్జెట్ ఉంది.
సకల జనుల బడ్జెట్
-బండ శంకర్, టీపీసీసీ సెక్రెటరీ
రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. సకల జనులకు ఆమోదయోగ్యంగా బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్ రూపకల్పనలో అన్ని వర్గాల ప్రజలను పరిగణనలోకి తీసుకున్నారు.