జైలుకు పోయినప్పుడు కాపాడుతోంది న్యాయవాదులే
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:51 AM
ప్రజల కోసం పోరాటం చేస్తే జైలుకుపోయిన ప్రతీసారి నన్ను కాపాడుతుంది న్యాయవాదులేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.

- ప్రజల కోసం పోరాడితే 109 కేసులు పెట్టారు
- న్యాయవాదుల కాన్ఫరెన్స్ హాలు నిర్మాణానికి రూ. 50 లక్షలు
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
భగత్‌నగర్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల కోసం పోరాటం చేస్తే జైలుకుపోయిన ప్రతీసారి నన్ను కాపాడుతుంది న్యాయవాదులేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ కోర్టు కాంప్లెక్స్‌లో లైబ్రరీకి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసం తాను ఎన్నో పోరాటాలు చేశామన్నారు. పలు సార్లుజైలుకు పోయినా ప్రతి సారి న్యాయవాదులే కాపాడుతున్నారని తెలిపారు. వారి సంక్షేమానికి అన్ని విధాల సాయం చేస్తామన్నారు. న్యాయవాదుల కాన్ఫరెన్స్ హాల్ కోసం సీఎస్సార్ ఫండ్స్ నుంచి మరో 50 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ముప్పు ఉందంటూ మజ్లిస్ అధినేత ఒవైసీ చేసిన వాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మజ్లిస్ పార్టీనే అసలైన దేశద్రోహ పార్టీ అని, మోదీ ప్రభుత్వం జాతీయ వాద భావజాలంతో పని చేస్తోందన్నారు. వక్ఫ్‌బోర్డు బిల్లుకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఎందరు అడ్డుకున్నా త్వరలోనే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందన్నారు. దేశ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని తెలిపారు. వక్ఫ్‌బోర్డు పేరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసునన్నారు. కరీంనగర్‌లో ఓ పేద వ్యక్తి తరతరాల నుంచి ఉంటున్న ఇంటికి వక్ఫ్‌బోర్డు స్థలమని చెప్పి అనుమతులు రద్దు చేసి ఇబ్బందు పాలు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నారు. దేశ ప్రజల ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు బండి సంజయ్‌కుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి బేతి మహేందర్‌రెడ్డి, బాస సత్యనారాయణరావు, కోమల ఆంజనేయులు పాల్గొన్నారు.